హైద్రాబాద్, మార్చి 19 (globelmedianews.com): 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లోనే తారల తళుకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నడూ లేని విధంగా సినీ స్టార్లు ఈ సారి రాజకీయ పార్టీలకు తమ మద్దతు తెలుపుతున్నారు. వీరిలో కొందరు టికెట్లు దక్కించుకోగా.. ఇంకొందరు ఆశతో ఎదురు చూస్తున్నారు. ఏయే తారలు ఏయే పార్టీలకు మద్దతు ఇస్తున్నారో చూద్దామా! 
తెలుగు దేశం: టీడీపీలో మొదటి నుంచి సినీ తారల హవా ఎక్కువే. ఎన్టీఆర్ తనయుడు, కథానాయకుడు బాలకృష్ణ హిందూపురం నుంచి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. ఇటీవల టీడీపీలో చేరిన నటీమణులు వాణి విశ్వనాథ్, దివ్యవాణీలకు టికెట్లు లభించే అవకాశాలు లేకపోవడంతో టీడీపీ తరఫున ప్రచారానికి సిద్ధమవుతున్నారు. రాజమండ్రి ఎంపీ మురళీ మోహన్ మాత్రం ఈ సారి పోటీ చేయకుండా ఆయన కోడలు రూపను బరిలోకి దింపుతున్నారు. పార్లమెంటులో రోజుకో వేషంతో ప్రత్యేక హోదాపై నిరసనలు వ్యక్తం చేసే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ టీపీడీ నుంచి మరోసారి బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్‌లు సినిమాల్లో బిజీగా ఉండటంతో టీడీపీ తరఫున ప్రచారం చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రాలేదు. 


ఏపీలో తారల తళుకులు 

వైసీపీ: ఈసారి వైసీపీలో తారా బలం పెరిగింది. మొన్నటి వరకు ఆ పార్టీలో చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా మాత్రమే కనిపించేవారు. ఆవిడకు తోడుగా ఈసారి మరికొందరు తారలు వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో ప్రముఖ నటి జయసుధతో పాటు నటుడు బానుచందర్, హాస్య నటులు ఆలీ, పృథ్వీ, కృష్ణుడు, రాజా రవీంద్ర, దాసరి అరుణ్, పోసాని కృష్ణ మురళీలు వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. సినీ నిర్మాత విజయవాడ పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) విజయవాడ నుంచి పోటీ చేస్తుండగా, రోజా మరోసారి నగరి స్థానం నుంచే బరిలో దిగుతున్నారు. 
జనసేన: మిగతా పార్టీలతో పోల్చితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన ‘జనసేన’లో పేరొందిన తారల సంఖ్య తక్కువగానే ఉంది. పవన్‌కు మద్దతుగా ఆయన సోదరుడు నాగబాబు ప్రచారం చేస్తుండగా ‘జబర్దస్త్’ మాజీ టీమ్ లీడర్ షకలక శంకర్, ఆదీలు మద్దతు తెలుపుతున్నారు. పవన్‌కు చిరకాల మిత్రుడైన ఆలీ.. వైసీపీలోకి చేరడం పవర్ స్టార్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. 
బీజేపీ: ఏపీ బీజేపీ నుంచి ‘నచ్చావులే’ ఫేమ్, నటి మాధవీలత తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేయనుంది. గుంటూరు బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా ఆమె బరిలో దిగుతున్నారు. ప్రముఖ సీనియర్ నటుడు కృష్ణం రాజు కూడా బీజేపీలోనే ఉన్నా.. ఆయన ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టీవ్‌గా లేరు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ‘ఈరోజుల్లో’ ఫేమ్, నటి రేష్మ వైరా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. 

ఏపీలో తారల తళుకులు

హైద్రాబాద్, మార్చి 19 (globelmedianews.com): 
మొబైల్స్ త‌యారీదారు షియోమీ భార‌త్‌లో  ఎంఐ పే సేవ‌ల‌ను ప్రారంభించింది. గ‌తేడాది డిసెంబ‌ర్‌లోనే షియోమీ ఈ సేవ‌ల‌పై ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే నేటి నుంచి భార‌త్‌లోని స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు ఎంఐ పే సేవ‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఇక‌ షియోమీ ఐసీఐసీఐ బ్యాంక్‌తో భాగ‌స్వామ్య‌మై ఆ సేవ‌ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్న‌ది. ఈ క్ర‌మంలో యూజ‌ర్లు ఎంఐ పే యాప్‌ను ఉప‌యోగించి ఆన్‌లైన్‌లో యూపీఐ ద్వారా న‌గ‌దును సుల‌భంగా ఇత‌రుల‌కు పంప‌వ‌చ్చు. ఇత‌రుల నుంచి న‌గ‌దును స్వీక‌రించ‌వ‌చ్చు. అలాగే బిల్ పేమెంట్స్, రీచార్జిలు కూడా చేసుకోవ‌చ్చు. స్మార్ట్‌ఫోన్‌ రంగంలో సంచనాలను నమోదు చేసిన చైనా కంపెనీ షావోమి ఇపుడిక డిజిటల్‌ చెల్లింపుల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గూగుల్‌ పే, పేటీఎం తరహాలో  తన పేమెంట్‌ యాప్‌ ఎంఐపేను లాంచ్‌ చేసింది. 

భారత్ లోషియోమీ సేవలు 

ఇండియాలో 'ఎంఐ పే' యూపీఐ సర్వీస్ కోసం ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది.  డేటా లీక్‌ పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని అత్యధిక  భద్రమైన సర్వీసులను అందిస్తామని హామీ ఇచ్చింది. యూజర్ల డేటాను ఇండియాలో మాత్రమే స్టోర్ చేస్తామని షావోమీ ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)  క్లియరెన్స్‌ అనంతరం  'ఎంఐ పే'  యాప్‌ను  అధికారికంగా తీసుకొచ్చింది. ఎంఐ పే ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడం మాత్రమే కాదు... బిల్లులు, రీఛార్జుల చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం 120 బిల్లర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ క్యూఆర్ కోడ్‌తో సహా ఇతర క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయొచ్చు.ఎంఐ పే యాప్ యూజర్లకు మరో బంపర్‌ఆఫర్‌ కూడా ప్రకటించింది.  వినియోగదారులు రెడ్‌మీ నోట్ 7, 32 అంగుళాల ఎంఐటీవీ 4ఏ ప్రో గెలుచుకునే అవకాశముందని షావోమీ ప్రకటించింది. ఇప్పటికే చైనాలో వినియోగంలో ఉన్న  ఈ వ్యాలెట్‌ సర్వీసును  ఇండియన్ యూజర్ల కోసం   ఆవిష్కరించింది.  కొద్ది రోజుల క్రితం ఇండియాలో 'ఎంఐ పే' బీటా వర్షన్ రిలీజ్ చేసిన చేసిన సంగతి తెలిసిందే.

భారత్ లోషియోమీ సేవలు

ముంబై మార్చి 19 (globelmedianews.com): 
ప్రపంచకప్‌లో ఆడాలని ఆశించే భారత్ ఆటగాళ్లకి ఐపీఎల్ 2019 సీజన్ సువర్ణావకాశమని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు తెలిపారు. మార్చి 23 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభంకానుండగా.. ఈ టోర్నీ ముగిసిన కొద్దిరోజులకే అంటే.. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే ప్రపంచకప్‌ మొదలవుతుంది. ఇప్పటికే ప్రపంచకప్‌ జట్టుపై స్పష్టత వచ్చిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రకటించినా.. ఇంకా రెండు మూడు స్థానాలపై సెలక్టర్లు కసరత్తులు చేస్తున్నట్లు ఆ అధికారి తాజాగా వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ఐదు వన్డేల సిరీస్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కోహ్లీ ఓ స్థానం పై చర్చ జరుగుతోందని వెల్లడించాడు. కానీ.. రెండో వికెట్ కీపర్, ఆల్‌రౌండర్ స్థానాలపై కూడా సెలక్టర్లు ఇప్పటికీ కసరత్తులు చేస్తున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. నెం.4 స్థానంలో గత ఏడాదికాలంగా మెరుగ్గా రాణించిన అంబటి రాయుడు.. ఇటీవల ఫామ్ కోల్పోయాడు. ఇక రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. ఆస్ట్రేలియాపై వరుస తప్పిదాలతో మళ్లీ సెలక్టర్లని ప్రశ్నార్థకంలో పడేశాడు. ఇక ఆల్‌రౌండర్‌ రేసులో ఉన్న హార్దిక్ పాండ్య గాయాలతో బాధపడుతుండగా.. విజయ్ శంకర్‌ నిలకడ సాధించలేకపోతున్నాడు. 


ఐపీఎల్ ఆట తర్వాతే ప్రపంచ కప్ చాన్స్

దీంతో.. ఐపీఎల్‌పై దృష్టి సారించి.. అత్యుత్తమంగా ఆడిన ఆటగాళ్లని ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేయాలని భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు ఆ అధికారి తెలిపారు. నెం.4 బ్యాట్స్‌మెన్ రేసులో.. అంబటి రాయుడు, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అజింక్య రహానె ఉండగా.. రెండో వికెట్ కీపర్ స్థానం కోసం రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్‌ పోటీపడుతున్నారు. ఏప్రిల్ 20 సమయంలో టీమ్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఐపీఎల్ తొలి నెల కీలకం కానుంది. ఇందులో బాగా రాణించిన వాళ్లకు వరల్డ్‌కప్‌లో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. నిజానికి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లోనే అన్ని స్థానాలకు ప్లేయర్స్ దొరుకుతారు అని భావించినా.. నాలుగో స్థానంలో మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ఆ స్థానంలో ఎవరూ రాణించలేదు. ప్రస్తుతానికి ఈ స్థానం కోసం నలుగురు పోటీ పడుతున్నారు. అజింక్య రహానే, అంబటి రాయుడు, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్.. ఈ స్థానం కోసం పోటీలో ఉన్నారు. వీళ్లు ఐపీఎల్‌లో ఎలా రాణిస్తారన్నదానిని బట్టి వరల్డ్‌కప్ టీమ్ ఎంపిక ఆధారపడి ఉంది. నాలుగో స్థానానికి ఇంకా ఏ ప్లేయర్ ఖరారు కాలేదు. ఈ స్థానం కోసం ఇంకా పోటీ ఉంది. గతేడాది కొంత మంది ప్లేయర్స్ ఈ స్థానంలో కుదురుకుంటారని భావించినా అలా జరగలేదు. దీంతో తొలి నెల ఐపీఎల్‌లో రాణించిన ప్లేయర్‌కు ఈ స్థానం దక్కే అవకాశం ఉంది అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. టీమ్ మేనేజ్‌మెంట్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాయి. నిజానికి కోహ్లిని నంబర్ 4లో పంపాలని కోచ్ రవిశాస్త్రి ప్రతిపాదించినా.. అది మ్యాచ్ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప అతడు నాలుగో స్థానానికే పరిమితం కాడు అని టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. రహానే, శ్రేయస్ అయ్యర్ ఇప్పటికీ వరల్డ్‌కప్ టీమ్‌లో తమకు చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్‌లో రాణిస్తే నంబర్ 4 తమదే అని ఈ ఇద్దరూ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. వరల్డ్‌కప్ టీమ్ గురించి తాను ఆలోచించడం లేదని, అయితే ఐపీఎల్‌లో రాణిస్తే టీమ్‌లో చోటు అదే దక్కుతుందని రహానే అన్నాడు. ఐపీఎల్ మొదట్లోనే రాణిస్తే అది సెలక్టర్లను ప్రభావితం చేస్తుందని అటు శ్రేయస్ అయ్యర్ కూడా అభిప్రాయపడ్డాడు.

ఐపీఎల్ ఆట తర్వాతే ప్రపంచ కప్ చాన్స్

హైద్రాబాద్, మార్చి 19 (globelmedianews.com): 
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసే అంశంపై స్పష్టత వచ్చింది. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ నగర పరిధిలోని గాజువాక శాసనసభ స్థానాల నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ట్విట్టర్ జనసేన పార్టీ ప్రకటించింది. తాను రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నట్టు మంగళవారం ఉదయం పవన్ కల్యాణ్ తెలియజేసిన విషయం తెలిసిందే. తన పోటీపై జనసేన పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని, ఎక్కడ నుంచి పోటీ చేసేది గంట తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. పవన్ ఎక్కడ నుంచి పోటీచేయాలనే అంశంపై జనరల్ బాడీ రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. ఇందులో అనంతపురం, తిరుపతి, రాజానగరం, పిఠాపురం, భీమవరం, గాజువాక, పెందుర్తి, ఇచ్చాపురం నియోజకవర్గాలు తొలి స్థానంలో నిలిచాయి. ఈ ఎనిమిదింటిపై అంతర్గత సర్వే నిర్వహించిన మేధావులు, రాజకీయ పరిశీలకులు చివరకు గాజువాక, భీమవరం స్థానాల నుంచి పోటీచేయాలని పవన్‌కు సూచించారు. 


రెండు స్థానాల్లో పవన్ పోటీకి అవకాశం


వారి ప్రతిపాదనలకు పవన్ సానుకూలంగా స్పందించారు. గాజువాక అసెంబ్లీ నుంచి పవన్ పోటీ చేస్తారనే తొలి నుంచీ ప్రచారం జరగ్గా, రెండో సీటు మాత్రం అనూహ్యంగా మంగళవారం తెరపైకి వచ్చింది. ఇక, ఎన్నికల్లో పోటీ విషయంలో అన్నయ్య చిరంజీవి మార్గాన్నే పవన్ అనుసరిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అధినేతగా చిరంజీవి కూడా రెండు చోట్ల బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి చిరు పోటీ చేశారు. అయితే, తిరుపతిలో మాత్రమే విజయం సాధించిన చిరంజీవి, తన సొంత జిల్లాలోని పాలుకొల్లు మాత్రం ఓటమిపాలయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్టణం జిల్లా గాజువాక, పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ మేరకు జనసేన నుంచి అధికార ప్రకటన వెలువడింది. ఈ నేపథ్యంలో జనసేనానిపై పోటీ చేయబోతున్న ఇతర పార్టీల నేతలు ఎవరో ఓ సారి చూద్దాం.
గాజువాక నియోజకవర్గం:
టీడీపీ - పల్లా శ్రీనివాసరావు
వైసీపీ - టి.నాగిరెడ్డి
బీజేపీ - పులుసు జనార్దన్
భీమవరం నియోజకవర్గం:
టీడీపీ - పులవర్తి రామాంజనేయులు
వైసీపీ - గ్రంధి శ్రీనివాస్
బీజేపీ - ప్రకటించాల్సి ఉంది

రెండు స్థానాల్లో పవన్ పోటీకి అవకాశం

హైద్రాబాద్, మార్చి 19 (globelmedianews.com): 
మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల ఫలితాలు తేలినా వేడి చల్లారడం లేదు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల్లో శివాజీ రాజాపై నరేష్ ప్యానల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే మా ప్రెసిడెంట్‌గా కొత్తగా ఎన్నికైన నరేష్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముహూర్తం పెట్టుకోగా.. తనకు మార్చి 31 వరకూ గడువు ఉందని.. అప్పటి వరకూ కుర్చీ దిగే ప్రసక్తే లేదని శివాజీ రాజా అనడంతో నరేష్ - శివాజీ రాజాల మధ్య వివాదం మరింత ముదిరింది. మా ఎన్నికల ఫలితాల తరువాత ప్రెస్ మీట్ పెట్టిన నరేష్.. శివాజీరాజాపై ఫైర్ అయ్యారు. ఓడిపోయిన వ్యక్తి కొత్తవారికి బాధ్యతల్ని అప్పగించడం ఆనవాయితీగా వస్తుందని శివాజీ రాజా ఇలా చేయడం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పించారు. కాగా నరేష్ ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ పోటీగా ప్రెస్ మీట్ పెట్టారు శివాజీరాజా. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన తన ఓటమికి కారణమైన మెగా బ్రదర్ నాగబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు. 


చల్లారని మా ఎన్నికల వేడి

‘మీరేమో రెండోసారి ప్రెసిడెంట్ కావాలని చిరంజీవి కోరారని అంటారు.. ఆయన తమ్ముడు నాగబాబు.. ఎలక్షన్స్‌కి రెండురోజుల ముందు ప్రెస్ మీట్ పెట్టి నరేష్‌కి సపోర్ట్ ఇచ్చారు’.. దీనిపై మీ సమాధానం ఏంటి అన్న ప్రశ్నకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు శివాజీ రాజా. ‘నాగబాబు నాకు 30 ఏళ్లుగా స్నేహితుడు.. నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. త్వరలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. అయినా నాగబాబు గురించి ఇక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదు. నేను కుట్రలు చేసేవాడినో సాయం చేసే వాడినో అందరికీ తెలిసిందే.ప్రతి సంవత్సరం నేను ‘మా’ డైరీ వేస్తా . కాని ఈసారి నరేష్ నేను వేస్తా.. దానికి ఓ కమిటీ వేస్తా అన్నారు. మా డైరీకి 14 లక్షలు ఇరవై వేలు వచ్చిందని ప్రెస్ మీట్‌లో చెప్పారు. కాని అకౌంట్‌లో ఏడు లక్షల చిల్లరే పడింది. నేను ఈ అకౌంట్స్ లెక్కలు చెప్పి బాధ్యతలు అప్పగించాలిగా.. ఆ డైరీ లెక్కలు నరేష్ చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే బాగుంటుంది. వాళ్లు తినేశారని చెప్పను.గత 25 ఏళ్లుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఎంత సొమ్ము ఉంది. నేను ప్రెసిడెంట్ అయ్యాక ఎంత ఉంది. ఇంతకు ముందు పెన్షన్ ఎంత ఇచ్చేవారు? ఎంత మందికి ఇచ్చేవారు? ఇప్పుడు ఎంత ఇస్తున్నాం అన్నది చూడండి. మీ మేనిఫేస్టోలో పెట్టిన హామీలను అమలు చేసి చూపించండి. దయచేసి కలిసి పనిచేద్ధాం.. అంతేతప్ప ప్రెస్ మీట్‌లు పెట్టి ‘మా’ భవిష్యత్‌ని రోడ్డుకి లాగొద్దంటూ హితవు పలికారు మా మాజీ ప్రెసిడెంట్ శివాజీ రాజా. 

చల్లారని మా ఎన్నికల వేడి

నెల్లూరు, మార్చి 19 (globelmedianews.com): 
పట్ణణాల్లోని పేదల సొంతింటి కల పగటి కలగా మారిది. అందరికీ ఇళ్లు పథకం కింద ఇళ్లు ఇస్తామని ఆశలు రేపిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ఏడాదిలో హడావుడిగా అపార్ట్‌మెంట్‌ తరహా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఐదేళుగా మోసం చేస్తూ వచ్చి అధికార అంతమున కట్టడాలే పూర్తికాని, పునాదులే వేయని ఇళ్లకు గ్రాఫిక్స్‌ సినిమా చూపించి ఆన్‌లైన్‌ లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించింది.
నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో కార్పొరేషన్‌ పరిధిలోని వెంకటేశ్వరపురంలో 4,800, అల్లీపురంలో 12,288, అక్కచెరువుపాడులో 3,696, కల్లూరుపల్లిలో 3,168, కొండ్లపూడిలో 2,544, వెంకటేశ్వరపురం ఫేజ్‌–2లో 7,536 మొత్తం 34,032 ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే వీటిలో కేవలం వెంకటేశ్వరపురంలోని 4,800 ఇళ్లు మాత్రమే నిర్మాణాలు పూర్తయ్యాయి. ఇంకా ఆ ఇళ్లలో కుళాయిలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. మిగిలిన 29,232 ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. కల్లూరుపల్లి, కొండ్లపూడి, వెంకటేశ్వరపురం ఫేస్‌–2లో ఇళ్లు పునాదుల దశలో ఉన్నాయి. అయితే ఈ మొత్తం ఇళ్లను ఆన్‌లైన్‌ పద్ధతిలో లాటరీలో లబ్ధిదారులకు కేటాయించారు. 


కలగానే సొంతిల్లు (నెల్లూరు)

ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించిన లబ్ధిదారులు ఆ నాసిరకం ఇళ్లు తమకొద్దంటూ సుమారు 3 వేల మందికి పైగా నిరాసక్తత చూపిస్తున్నారు. ఇప్పటికే 700 మంది లబ్ధిదారులు కార్పొరేషన్‌ కార్యాలయంలో లిఖిత పూర్వకంగా వినతిపత్రాలు ఇచ్చారు. లబ్ధిదారులు రూ.12,500, రూ.25 వేలు వంతున నాలుగు విడతల్లో రూ.50 వేలు,  రూ.లక్ష చెల్లించాల్సి ఉంది. అయితే కేవలం ఒక విడతలో మాత్రమే డబ్బులు చెల్లించారు. మరో మూడు విడతలు డబ్బులు చెల్లించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదు. తాము కట్టిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది.
ఇళ్లను లాటరీ ద్వారా కేటాయించారు. కానీ లబ్ధిదారులకు నివాసానికి అనుకూలమైన పరిస్థితులు మాత్రం లేవు. నెల రోజుల క్రితం చంద్రబాబునాయుడు కేవలం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు ప్రచారం కోసం రెండు ఇళ్లలో మాత్రమే గృహ ప్రవేశం చేయించారు. వెంకటేశ్వరపురంలోని 4,800 ఇళ్లు గృహప్రవేశం జరిగినట్లు చెప్పారు. అయితే నెల రోజులు గడుస్తున్నా ఒక్క లబ్ధిదారుడికి తాళం కూడా ఇవ్వలేదు. వెంకటేశ్వరపురంలో నిర్మాణాలు పూర్తయ్యాయిని చెబుతున్న ఇళ్లకు విద్యుత్, తాగునీటి ఏర్పాట్లు కూడా చేయలేదు.
గూడూరు పట్టణంలో హౌస్‌ ఫర్‌ ఆల్‌ ఇళ్లు దిష్టిబొమ్మల్లా మారాయి. నిర్మాణాలైతే జరిగాయే కానీ, అరకొర పనులు ఇంకా సాగుతూనే ఉన్నాయి. అక్కడ తాగునీటి వసతి, ఇతర మౌలిక సదుపాయాలు అసంపూర్తిగానే ఉన్నాయి. కానీ ఆరు నెలల క్రితం లాటరీ పద్ధతి ద్వారా ఇళ్లు కేటాయించారే కానీ, వాటిని ఇప్పటి వరకూ ఎవరికీ స్వాధీనం చేసిన దాఖలా లేవు. ఆ హౌస్‌ ఫర్‌ ఆల్‌లో ఇంకా రోడ్డు నిర్మాణ పనులతో పాటు, వాటర్‌ ట్యాంకు నిర్మాణం కూడా జరుగుతోంది. పట్టణానికి ఆరు కిలో మీటర్ల దూరంలో గాంధీనగర్‌ సమీపంలో హౌస్‌ఫర్‌ ఆల్‌ పథకం కింద అపార్ట్‌మెంట్ల తరహాలో సుమారు 7 వేల ఇళ్లను నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటి వరకూ 5,120 ఇళ్లు పూర్తి కాగా, మొదటి విడతలో 3,704 మందికి ఇళ్లు కేటాయించారు. రెండో విడతలో 812 మందికి ఇళ్లు కేటాయించారు. ఇప్పటి వరకు అధికారులు 4,516 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు కేటాయించారు. ఇళ్ల నిర్మాణాలు చిన్నవిగా ఉండడం, నాసిరకంగా ఉండడంతో పాటు సుమారు 20 ఏళ్ల పాటు నెలకు సుమారు రూ.2,300 నుంచి రూ.3,200 వరకు చెల్లించాల్సి ఉండడంతో, తాము బ్యాంకుల్లో చెల్లించే మొత్తాలకు పట్టణంలోనే అద్దెకు ఇళ్లు దొరుకుతాయని, కొందరు ఆ ఇళ్లలో చేరే ఆలోచనలను కూడా మానుకుంటున్నారు. 

కలగానే సొంతిల్లు (నెల్లూరు)

మెదక్, మార్చి 19 (globelmedianews.com): 
ఇసుక వ్యాపారానికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలకు కూతవేటు దూరంలోనే దర్జాగా ఇసుకను ఫిల్టర్‌ చేస్తూ మూడింతల రవాణాలు ఆరింతల కుప్పల ఇసుక అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. పలుకుబడి గల వ్యక్తులు కావడంతో అధికారులు వారి జోలికి వెళ్లడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అధికారులు ధైర్యం చేసి పట్టుకున్నా ‘మనోడే వదిలేయండం’టూ పెద్దల నుంచి ఫోన్లు వస్తాయంటున్నారు. పట్టణంలోని బండ్రేవు, రాయరావు చెరువు, పంటకాలువ పొడవునా సమీప పంట పొలాల్లో, ఆదిపరాశక్తి ఆలయం తదితర స్థలాల్లో పట్టణం చుట్టూ జోరుగా దందా సాగుతోంది.
ఇసుక వ్యాపారం రెండు రకాలుగా సాగుతోంది. ఒకవైపు లోతైన గోతులు తవ్వి ఇసుకను తీస్తున్నారు. అవి ప్రమాదకరంగా తయారయ్యాయి. మరోవైపు మట్టిని తీసి దానిని నీటితో కడిగి ఇసుకను తయారు చేస్తున్నారు. చాలా చోట్ల ఇసుక నిల్వలు దర్శనమిస్తున్నాయి. పంటపొలాల్లో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపడుతున్నారు. 


కళ్లముందే జరుగుత్నానా..! (మెదక్)

వీటిల్లో పశువులు పడి ప్రమాదాలకు గురవుతున్నాయి. గోతులు, వాటిలోని నీటి ద్వారా మనుషుల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించాయి. పట్టణంలో రాయరావు చెరువు పంటకాల్వలపై చెక్‌డ్యాంలు నిర్మించిన ప్రాంతం ఇందుకు అడ్డాగా మారింది. పెద్దఎత్తున ఇసుకను నిల్వచేశారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు, ఆయా పార్టీలలో కార్యకర్తలు, నాయకులు, పెద్దమనుషుల అండదండలున్న వారు ఈఅక్రమ వ్యాపారాన్ని దర్జాగా కొనసాగిస్తున్నారు.
హన్మంతాపూర్‌, ఆవంచ, ఎల్లాపూర్‌, మంతూరు, ఖాజీపేట, కాగజ్‌మద్దూర్‌, నత్నాయిపల్లి, కొండాపూర్‌, జక్కపల్లి, చిప్పల్‌తుర్తి, మహ్మదాబాద్‌, అహ్మద్‌నగర్‌, రుస్తుంపేట, మూసాపేట, నాగులపల్లి, గొల్లపల్లి, బ్రాహ్మణపల్లి, తుజాల్‌పూర్‌, తిర్మలాపూర్‌, అచ్చంపేట, నారాయణపూర్‌, లింగాపూర్‌ తదితర గ్రామాల్లోనూ ఇసుక అక్రమ వ్యాపారం కొనసాగుతోంది. ట్రాక్టర్‌ ఇసుకను రూ.3000 నుంచి రూ.4000 వరకూ విక్రయిస్తున్నారు. గ్రామాల నుంచి పట్టణానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు ముడుపులు ముట్టజెపుతున్నారు. కట్టడి చేయాల్సిన రెవెన్యూ, పోలీసు, మైనింగ్‌, నీటిపారుదల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వాదాయం పెంపు కోసం ఇసుక వ్యాపారాన్ని కట్టడి చేయాలని కోరుతున్నారు.

కళ్లముందే జరుగుత్నానా..! (మెదక్)