2019లో విజయమే ధ్యేయంగా..

 

తూర్పుగోదావరి, జూన్28, 2018 (globelmedianews.com)
ఆంధ్రప్రదేశ్ విపక్షనేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరిలో సాగుతోంది. ఇక్కడే ఈ ప్రతిష్టాత్మక యాత్ర 200 రోజులకు చేరుకుంది. ఇప్పటికే 10జిల్లాలను కవర్ చేసిన ఆయన వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఆ పార్టీ నేతలు సైతం ప్రజాసంకల్ప యాత్ర.. తమకు గణనీయమైన పొలిటికల్ ప్రయోజనాలు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో జనసేన హడావిడి ప్రారంభం కాకముందే జగన్ ప్రజలకు చేరువయ్యేందుకు పాదయాత్రను ఎంచుకున్నారు. రాష్ట్రమంతటా నడచి.. ప్రజామద్దతు కూడగట్టాలని నిర్ణయించుకున్నారు. పార్టీ పరిస్థితి మరీ ఆశాజనకంగా లేనప్పుడే జగన్ యాత్ర ప్రారంభించారు. ప్రస్తుతమైతే వైసీపీకి ఆదరణ పెరుగుతున్న పరిస్థితి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారడంతోనే ఈ పరిస్థితి అని పరిశీలకులు అంటున్నారు. నాలుగేళ్లలో ప్రభుత్వం చేయలేని పనులను, వైఫల్యాలను జగన్ హైలెట్ చేస్తున్నారు.
 
 
 
2019లో విజయమే ధ్యేయంగా..
 
 టీడీపీ శ్రేణులనే కాక ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తంగా క్రియాశీలకమైన ప్రతిపక్షంగా వైసీపీని ప్రజల్లో ఫోకస్ చేయడంలో జగన్ పాదయాత్రతో సఫలమయ్యారు. ఈ జోష్‌ వచ్చే ఎన్నికల్లో తమకు కలిసివస్తుందని వైసీపీ నేతలు విశ్వసిస్తున్నారు. టీపీడీ కంటే పైచేయి సాధించగలమని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. 
వాస్తవానికి జగన్ పాదయాత్ర ప్రారంభించేనాటికి వైసీపీకి చెందిన పలువురు నేతలు అధికార టీడీపీలోకి వచ్చేశారు. పలువురు కీలక నాయకులతో పాటూ.. కీలక ప్రాంతాల్లోనూ పట్టు కోల్పోయిన పరిస్థితి ఆ పార్టీది. ఇంకా పలువురు నేతలు.. టీడీపీ గూటికి చేరే ఛాన్స్ ఉందన్న వార్తలు వైసీపీని ఆందోళన పెట్టాయి. ఓ దశలో.. జగన్‌కు అత్యంత సన్నిహితులు మినహా.. ప్రతిపక్షంలో మిగతావారు ఉండడం కష్టమే అన్న వాదనలూ వినిపించాయి. టోటల్‌గా వైసీపీ కష్టకాలంలో ఉన్న స్థితి నుంచే విపక్షనేత పాదయాత్రకు శ్రీకారం చుట్టి సక్సస్‌ అయ్యారు. యాత్ర మొదలుపెట్టిన అనంతరం.. వైసీపీని ట్రాక్‌లో నిలబెట్టగలిగారు. అంతర్గత విబేధాలు, అసంతృప్తులను కూడా చక్కబెట్టుకుంటే జగన్‌కు తిరుగు ఉండకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం అత్యవసరం.  మరో ఓటమి ఎదురైతే వైసీపీ రాజకీయంగా కష్టంలో పడుతుంది. టీడీపీ, జనసేనల పట్టు పెరిగిపోతుంది. అందుకే ఎన్నికల టైమ్‌కు అనూహ్యంగా పుంజుకోవాలన్న లక్ష్యంతోనే గతేడాదిలోనే జగన్ ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభించారు. నిజమైన ప్రజాసంక్షేమం తమతోనే సాధ్యమంటూ ప్రజల్లోకి వెళ్లారు. అన్ని వర్గాల ప్రజాభ్యున్నతికి నిర్దేశించిన 9రకాల పథకాలకు నవరత్నాలుగా పేరుపెట్టి.. వాటిని ప్రజలకు వివరిస్తున్నారు. మొత్తంగా విపక్షనేత కృషి సత్ఫలితాన్నే ఇస్తోందని... వైసీపీ ప్రజల్లో దూసుకెళ్తోందని పరిశీలకులు అంటున్నారు.

No comments:
Write comments