నింపాదిగా రైతుబీమా

 

జగిత్యాల, జూన్28, 2018 (globelmedianews.com)
రైతాంగానికి అండగా.. తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ఈ ఏడాది పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.4వేలు చొప్పున రైతులకు అందించింది. ప్రస్తుతం రైతుబీమా పథకాన్ని ప్రారంభించింది. సర్కార్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కార్యక్రమం నత్తనడకన సాగుతోందని జగిత్యాల రైతులు పెదవి విరుస్తున్నారు. సంబంధిత విభాగం సిబ్బంది వివరాల సేకరణ నింపాదిగా చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఈ నెలాకరులోగా రైతులనుంచి నామినీల వివరాల సేకరించాలి. అంతేకాక కర్షకుల సంతకాల సేకరణను కొలిక్కి తీసుకురావాలి. అయితే ఈ పని తీరులో జాప్యం కనిపిస్తోంది. మరో ౩ రోజులు మాత్రమే గడువు ఉన్నా ఇప్పటికీ 50శాతం కూడా పూర్తి కాలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ విషయమై అధికారుల్లో కూడా ఆందోళన నెలకొంది. వ్యవసాయశాఖ అధికారులతోపాటు రైతు సమన్వయ సమితిల ప్రతినిధుల భాగస్వామ్యం ఆయా గ్రామాల వారీగా కనిపిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం అనుకున్న తరహాలో పురోగతి ఉండటం లేదని అంతా అంటున్నారు. నిత్యం నిర్ణీత స్థాయిలో రైతులను కలవకపోవడం వల్ల దస్త్రాలపై నామినీల వివరాల నమోదు ఆలస్యమవుతోందని చెప్తున్నారు. ముందస్తు సమాచార లోపంతోపాటు రైతుల్ని ఒకే చోట సమావేశపర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు విమర్శిస్తున్నాపు. దీంతో ఈ పని పూర్తవడానికి మరిన్ని రోజుల పడుతుందని అంతా అంటున్నారు. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని స్పష్టంచేస్తున్నారు.
 
 

నింపాదిగా రైతుబీమా 
 
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీమా పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే వ్యవసాయశాఖ అధికారులతోపాటు రైతుసమన్వయ సమితి సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులూ చొరవ తీసుకోవాలి. వీరందరి సమన్వయంతోనే ఈ పని కొలిక్కి వస్తుందని పలువురు అంటున్నారు.  ఉమ్మడి జిల్లాలో 255మంది ఏఈవోలున్నారు. వీరు రోజుకో గ్రామానికి వెళ్లి వీలైనంత ఎక్కువ మంది రైతలను కలుస్తూ సంతకాలు సేకరిస్తున్నారు. అయినా టార్గెట్ చేరుకోవడం కష్టంగా మారుతోంది. ఒక్కో ఇంటి వద్ద 10 నిమిషాలకుపైగా సమయం పడుతోంది. దీంతో సంతకాల సేకరణకు ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో ముందస్తుగానే సమాచారం ఇచ్చి రైతుల్ని ఒకే చోట చేర్చాలని భావిస్తున్నా ఫలితం ఉండడంలేదు. రైతులు పెద్ద ఎత్తున తరలివారడం లేదు. రైతు బంధు పథకంలో భాగంగా చెక్కుల్ని తీసుకున్న రైతుల్లో చాలామంది స్థానికంగా లేకపోవడం కూడా కొన్ని చోట్ల సమస్యగా మారిందని సమాచారం. మరోవైపు కొన్నిచోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి ప్రతినిధుల సహకారం  లేదని తెలుస్తోంది. ఇవన్నీ సంతకాల సేకరణకు అడ్డంకులుగా మారాయని అంటున్నారు. సమన్వయ లేమిని అధిగమించి వీలైనంత తొందరగా ప్రక్రియను పూర్తిచేసేలా జిల్లాల్లో మార్పు రావాల్సిన అవసరముందని అంతా అంటున్నారు. ఇప్పట్నుంచైనా రైతుబీమా వివరాల నమోదు ప్రకియను వేగవంతం చేయాలని రైతులంతా విజ్ఞప్తిచేస్తున్నారు. 

No comments:
Write comments