సాగునీటికి తొలగిన ఇక్కట్లు

 

ఆదిలాబాద్‌, జూన్29, 2018 (globelmedianews.com)  
ఆదిలాబాద్ జిల్లాలోని సాత్నాల జలాశయాన్ని పటిష్టం చేసి.. వ్యవసాయానికి ఊతమిచ్చేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో ఈ రిజర్వాయర్ ఆధునికీకరణకు ప్రాధాన్యతనిస్తోంది. పనులకు అవసరమైన నిధులు సైతం విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ క్రమంలోనే సాగునీటి రంగానికి పెద్దపీట వేసే దిశగా నూతన ప్రాజెక్టులతో పాటు పాత ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు భారీగా నిధుల మంజూరు చేశారు. సాత్నాల కాలువల సీసీ లైనింగ్‌ నిర్మాణం పూర్తయితే రబీ సీజన్‌లో పంటలకు సాగునీరు అందుతుందని, ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు అవసరమని నీటి పారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. గతేడాది జులై 6న మంత్రి హరీష్‌రావు నీటి పారుదల శాఖపైనా సమీక్షించారు. ఈ నిధుల విషయమై మంత్రి జోగు రామన్న మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన నిధులను మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జులై 29న రూ.28.60 కోట్లు నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో సాత్నాలకు మహర్దశ పట్టనుందని.. స్థానిక రైతులకు పుష్కలంగా సాగునీరు అందుబాటులో ఉంటుందని అంతా ఆశిస్తున్నారు. 
 
 
 
సాగునీటికి తొలగిన ఇక్కట్లు
 
సాత్నాల జలాశయాన్ని 1976లో మంజూరుచేశారు. 1977లో జైనథ్‌ మండలం సాత్నాల వాగుపై జలాశయాన్ని నిర్మించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అపరిష్కృత ప్రాజెక్టులకు భారీగా నిధులు ఇస్తోందిది. దీనిలో భాగంగానే సాత్నాల జలాశయానికి నిధులు మంజూరయ్యాయి. మంత్రి హరీష్‌రావు ఎప్పటికప్పుడు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తూ పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకున్నారు. సాత్నాల జలాశయం నుంచి కుడి కాలువ ద్వారా లక్ష్మీపూర్‌ జలాశయంలోకి వరదనీరు చేరుతుంది. ఏళ్ల తరబడి సీసీ కాలువలు పూర్తికాక పోవడంతో నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం కాలువల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ కాలువల నిర్మాణంతో 6వేల ఎకరాలకు పైగా సాగునీరు సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది. నిధుల లేమితో ఈ జలాశయం నుంచి నీరు సమర్ధవంతంగా అందేదికాదు. మరమ్మతులకు నోచుకోక అస్తవ్యస్తంగా ఉండేది. సాత్నాల చివరి ఆయకట్టు వరకు సాగునీరందించని దుస్థితి ఉండేది. ప్రస్తుతం సర్కార్ రూ.28.60 కోట్లతో నిధులు విడుదల చేయడంతో మరమ్మతులు, కాలువల నిర్మాణం పూర్తి చేశారు. రైతులకు 24 వేల ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించనున్నారు.

No comments:
Write comments