మన్యంలో విజృంభిస్తున్న విషజ్వరాలు

 

విశాఖపట్నం, జూన్29, 2018 ()  
వాతావరణం మార్పులతో విశాఖ మన్యంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే ముగ్గురు మృతిచెందడంతో స్థానికంగా భయాందోళనలు అలముకున్నాయి. బాధితుల సంఖ్యా రోజురోజుకు ఎక్కువవుతున్నా పారిశుద్ధ్య, వైద్య విభాగాలు మాత్రం అప్రమత్తం కాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మన్యంలో ప్రధానంగా డెంగ్యూ విస్తరిస్తోంది. పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం వల్లే ఈ సమస్య అని అంతా అంటున్నారు. ఇక ప్రభుత్వాసుపత్రులకు వెళ్తే.. ఆరోగ్య పరీక్షల రిపోర్టులు ఆలస్యంగా వస్తున్నాయన్న కారణంతో బాధితులు ప్రైవేట్ లేబొరేటరీలనే ఆశ్రయిస్తున్నారు. దీంతో.. సదరు పరీక్ష కేంద్రాలు బడుగులను దండుకోవడమే పనిగా పెట్టుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రోగుల నుంచి రూ.వెయ్యి నుంచి రూ.1500 వసూలు చేస్తున్నారని.. ఇతరత్రా పరీక్షలంటూ.. మరింతగా దండుకునే ప్రోగ్రామ్ కు తెరతీశారని పలువురు మండిపడుతున్నారు. ఇక ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత సైతం రోగులకు శాపంగా పరిణమించింది. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి సత్వరమే ఏరియా ఆసుపత్రిలో సిబ్బందిని పెంచాలని.. టెస్ట్ రిపోర్టులను తక్షణమే అందించాలని అంతా కోరుతున్నారు. అంతేకాక బయట అధిక మొత్తంలో వసూళ్లను నివారించాలని విజ్ఞప్తిచేస్తున్నారు. 
 
 
 
మన్యంలో విజృంభిస్తున్న విషజ్వరాలు
 
ఏజెన్సీలో డెంగ్యూ కేసులున్నట్లు తేలడంతో కలెక్టర్ అప్రమత్తమయ్యారు. వైద్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి నివారణ చర్యలపై సమీక్షించారు. బాధితులను కెజిహెచ్‌, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేర్పించి వైద్యం అందించనున్నామని తెలిపారు. మన్యంలో డెంగ్యూ కేసులు నమోదు కావడం పట్ల పరిశీలన చేసేందుకు జిల్లా స్థాయి వైద్య బృందాన్ని ఏజెన్సీకి తరలిస్తున్నామని వివరించారు. దోమలవ్యాప్తి జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలను అప్రమత్తం చేయాలని, వసతిగృహలు, పాఠశాలల్లో, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని స్పష్టంచేశారు. అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన మందులను పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని సూచించారు. మరీ అత్యవసరమైయితే తన దృష్టికి తీసుకురావాలని, కంటిజెన్సీ నిధులతో ఔషదాలు కొనుగోలు చేస్తామని అన్నారు. ఏజెన్సీలో 36 పిహెచ్‌సిల్లో వైద్యలు రిజైన్‌ చేసినందున కొత్త వారిని త్వరగా నియమించాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారికి సూచించారు. విషజ్వరాలు మరింతగా వ్యాపించకుండా.. నివారణ చర్యలు ముమ్మరం చేయాలని అధికారయంత్రాంగానికి స్పష్టంచేశారు.

No comments:
Write comments