తెలంగాణ కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స

 

హైద్రాబాద్ జూన్ 29, (globelmedianews.com)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ముదురుతున్న విభేదాలకు అధిష్టానం చెక్ పెట్టనుందా? అందరూ సీనియర్లు కావడం…ఎవరినీ మందలించే వీలు లేకపోవడంతో కాంగ్రెస్ హైకమాండ్ సరికొత్త తరహా విధానాలకు శ్రీకారం చుట్టింది. దీనివల్ల పీసీసీకి కూడా పెద్దగా పవర్ ఉండదు. పీసీసీ అధ్యక్షుడయినా…. సీనియర్ నేత అయినా ఒక్కటే. అందుకే కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ల దూకుడుకు కళ్లెం వేయడానికి త్రిమూర్తులను రంగంలోకి దించింది. ఇక వారు చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. వారు గీచిన గీత దాటకూడదు. వారు ఓకే అంటేనే బీఫాం. ఇలా సీనియర్ నేతలను ఫిక్స్ చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఇదే గాంధీభవన్ లో చర్చనీయాంశంగా మారింది.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ కు సన్నిహితుడు. ఆయనను పదవి నుంచి తొలగించాలని ఎప్పటి నుంచో సీనియర్లు ప్రయత్నిస్తున్నారు. 
 
 
 
తెలంగాణ కాంగ్రెస్ కు కాయకల్ప చికిత్స
 
దీనికి తోడు పార్టీని పటిష్టం చేసేందుకు ఉత్తమ్ తీసుకుంటున్న చర్యలు కూడా సీనియర్లకు రుచించడం లేదు. రేవంత్ రెడ్డి, నాగం జనార్థన్ రెడ్డి వంటి నేతలను పార్టీలోకి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కావడంతో ఉత్తమ్ పై సీనియర్ నేతలు బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీకి వెళ్లి ఉత్తమ్ పై పితూరీలు చెప్పి వచ్చేశారుఅలా చెప్పి వచ్చారో లేదో….రాహుల్ టీం ఇక్కడకు నిఘా బృందాన్ని పంపింది. అదే….ప్రస్తుత తెలంగాణ ఇన్ ఛార్జి కుంతియాకు తోడుగా ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను నియమించింది. వీరు కుంతియాకు సహకరించాల్సి ఉంటుంది. బోస్ రాజు, శ్రీనివాస్ కృష్ణన్, సలీం అహ్మద్ లు ఇన్ ఛార్జులగా వ్యవహరిస్తారు. వీరికి ఒక్కొక్కరికీ 40 శాసనసభ నియోజకవర్గాలను అప్పగించారు. ఆ నియోజకవర్గాల బాధ్యత వీరిదే. వీరు ఆ నియోజకవర్గాల్లో పర్యటించి, అవసరమైతే సర్వేలు చేయించుకుని అక్కడ అభ్యర్థుల ఖరారులో ప్రధాన భూమికను పోషించనున్నారు.పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలను తొలగించే బాధ్యత కూడా వీరే తీసుకుంటారు. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ తెలంగాణలోనే ఉండి నియోజకవర్గాల వారీగీ పరిస్థితిని ఎప్పటికప్పుడు రాహుల్ టీంకు నేరుగా నివేదికలను పంపనున్నారు. ఇప్పుడు పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వీరి అనుమతి కావాల్సిందే. అంటే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయం వీరు ఒకే చెప్పాక అమలు పర్చాలి. అలాంటప్పుడు సీనియర్లు అసంతృప్తికి లోను కారని కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. ఇప్పటివరకూ ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్న సీనియర్ నేతలకు వీరి ద్వారా కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెట్టిందనే చెప్పాలి. ఇక వీరి చుట్టూనేతలు తిరగక తప్పదు.

No comments:
Write comments