10 వేలు ఇస్తే..ఇంటి మొత్తం సోలార్

 

విజయవాడ, జూలై 14, (globelmedianews.com)
ప్రపంచం వేగంగా మారిపోతుంది. గ్రీన్ ఎనర్జీ వైపు పరుగులు పెడుతుంది. ఇందులో భాగంగా, మన దేశంలో సోలార్ వైపు ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నా, ప్రజలు మాత్రం సహకరించటం లేదు. దానికి ప్రధాన కారణం సోలార్ ప్యానెల్ ల ధరలు. సోలార్ పై మక్కువతో ఉన్న చంద్రబాబు, ఈ సమస్యను అధిగమించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇంటి పైకప్పు పై సోలార్ విద్యుత్తు ప్యానెల్స్ ను అతి తక్కువ ధరకే ఏర్పాటు చేసుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ మండల విద్యుత్తు పంపిణీ సంస్థ  ప్రణాళికలు రూపొందించింది. ముందుగా తక్కువ విద్యుత్తు వాడుతున్న వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీకి అదనంగా మరికొంత ఏపీఎస్పీడీసీఎల్‌ భరించి ప్రజలకు చేరువ చేసేందుకు సిద్ధమైంది.ముందుగా తిరుపతి, విజయవాడ ప్రాంతాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. మరో వారంలో వినియోగదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 
 
 
 
10 వేలు  ఇస్తే..ఇంటి మొత్తం సోలార్
 
ప్రస్తుతం ఇంటి పైకప్పు పై ఏర్పాటు చేసుకునే సోలార్ ప్యానెల్స్ నెడ్‌క్యాప్‌ 30 శాతం సబ్సిడీ అందిస్తూ వస్తోంది. ఒక కిలోవాటు విద్యుత్‌కు సంబంధించి సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు సుమారు 70వేలు అవుతుంది. ఇందులో 30 శాతం సబ్సిడీ పోనూ రూ.49వేలు చెల్లించాల్సి వచ్చేది. దీంతో వినియోగదారులు ముందుకు రాకపోవడంతో.. నెడ్‌క్యాప్‌ సబ్సిడీకి అదనంగా ఏపీఎస్పీడీసీఎల్‌ మరికొంత నిధులను భరించేందుకు సిద్ధమైంది.  కొత్తగా సోలార్ ప్యానెల్స్ సరఫరా చేసేవారి నుంచి టెండర్లు పిలిచారు. ఒక్కో కిలోవాట్‌ విద్యుత్తును ఉత్పత్తి చేసే సౌర పలకలను రూ.60వేలకు ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు వచ్చింది. నెలకు 100 యూనిట్ల విద్యుత్తును వినియోగించే వినియోగదారులు..1 కిలోవాట్‌ సోలార్ ప్యానెల్స్ కు రూ.10వేలు చెల్లిస్తే సరిపోతుంది. 0.5 కిలోవాట్‌ పెట్టుకుంటే రూ.5వేలకే అందిస్తారు. నెడ్‌క్యాప్‌ ఇచ్చే 30శాతం సబ్సిడీ పోనూ మిగతా మొత్తాన్ని ఏపీఎస్పీడీసీఎల్‌ భరించనుంది. 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ వినియోగించే వారికి ఒక్కో కిలోవాట్‌ సోలార్ ప్యానెల్స్ ను రూ.15వేలకు అందిస్తారు. 0.5 కిలోవాట్‌కు రూ.7500కే ఇవ్వనున్నారు.

No comments:
Write comments