2473 కోట్లతో నాల్గో హరిత హారం

 

హైద్రాబాద్, జూలై 28, (globelmedianews.com)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 24 శాతం ఉన్న పచ్చదనాన్ని 33 శాతానికి పెంచడంతో పాటు పర్యావరణాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ ఈ బృహత్తర కార్యక్రమాన్ని 2015-16 సంవత్సరంలో ప్రారంభించారు. ప్రస్తుతం పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించడం, భవిష్యత్ తరాలకు ఆస్తి, ఐశ్వర్యాల కంటే మంచి ఆరోగ్యకరమైన వాతావారణాన్ని అందించటమే లక్ష్యంగా హరితహారం కొనసాగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమాన్ని మూడు విడతలుగా చేపట్టారు. తాజాగా నాలుగో విడత కార్యక్రమానికి సర్వం సిద్ధం చేసింది. త్వరలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్న నాలుగో విడత హరితహారం(2018-19)లో 40 కోట్ల మొక్కల్ని నాటడమే లక్ష్యంగా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఏటేటా గణనీయమైన మార్పులతో ముందుకుసాగుతోంది. 2017-18 సంవత్సరంలో 2925 నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. 
 
 
 
2473 కోట్లతో  నాల్గో హరిత హారం
 
అదే 2018-19 సంవత్సరంలో 3566 నర్సరీల్లో 42 కోట్ల మొక్కల పెంపకాన్ని చేపట్టారు. అంటే గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో 641 నర్సరీల్లో అధికంగా మొక్కలను పెంచారు. ఇదిలావుంటే.. నాలుగో విడత హరితహారంలో 40 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీంతో పాటుగా ఈ యేడు నర్సరీల్లో 1.70 కోట్ల ఈత మొక్కలను పెంచడంతో పాటు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. వెదురుతో పాటు ఈత చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీపై డ్రిప్ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కోసం అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి(ఉపాధిహామీ), జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ నిధులతో కలుపుకుని ఇప్పటివరకు రూ.2473 కోట్లను ఖర్చు చేసింది.హరితహారంలో ఒకే రకం చెట్లు కాకుండా నీడనిచ్చే చెట్లతో పాటు పండ్లు, పూల చెట్లు, ఔషధ మొక్కలను కూడా మూడేండ్లలో నాటారు. అటవీ ప్రాంతంలోనే కాకుండా విద్యాలయాలు, పోలీస్ స్టేషన్ ప్రాంగణాలు, మార్కెట్ యార్డులు, వ్యవసాయ క్షేత్రాలు, శ్మశాన వాటికలు, పరిశ్రమలు, పారిశ్రామిక వాడలు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లోనూ మొక్కలను నాటనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఆర్టీసీ, సింగరేణి, విద్యుత్ శాఖలు, పాఠశాల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, డ్వాక్రా మహిళలతో సహా ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు.తెలంగాణకు హరితహారాన్ని విజయవంతం చేయడంతో పాటు వాహనదారులు, ప్రయాణికులకు నీడను కల్పించడం, పర్యావరణాన్ని కాలుష్యం బారి నుంచి రక్షించేందుకు రాష్ట్రంలోని అన్ని రహదారుల వెంట ప్రధానంగా మొక్కలను నాటనున్నారు. గతంలో హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-ముంబాయి, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్-నాగపూర్ వంటి జాతీయ రహదారులకిరువైపులా పెద్ద పూల చెట్లు నాటారు. ఈ విడతలోనూ ఈ రహదారుల వెంట మిగిలిన ప్రాంతాల్లో హరితహారం చేపట్టనున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు ప్రతీ గ్రామానికి వెళ్లే రోడ్ల వెంట అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు సూచించారు. మున్సిపాలిటీలు, అన్ని పంచాయితీ రోడ్ల వెంట నీడను ఇచ్చే మొక్కలతో పాటు, పూలతో ప్రయాణం అహ్లాదంగా ఉండాలనే స్ఫూర్తితో ఈ ప్రణాళిక అమలు కానుంది.కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చిన ప్రభుత్వ పచ్చదనం పెంపుతో పాటు మొక్కలు నాటడాన్ని తప్పనిసరి చేస్తూ.. ప్రతీ గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వచ్చే ఏడాది నుంచి గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నారు.  అందుకు అవసరమైన యంతాంగం ఇప్పటికే ప్రారంభమైంది. అటవీ, గ్రామీణాభివృద్ది, మున్సిపల్ శాఖల సమన్వయంతో సుమారు పది వేల నర్సరీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రచించారు. ఈ నర్సరీల్లో వంద కోట్ల మొక్కలను పెంచాలని, వాటిని రాష్ర్ట వ్యాప్తంగా నాటేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ గతంలోనే ఆదేశించారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మొక్కల రక్షణకు బాధ్యత వహించని వ్యక్తులు, సంస్థలపై తగిన చర్యలను తీసుకునేలా ప్రభుత్వం చట్టంలో ప్రతిపాదించింది.

No comments:
Write comments