వామ్మో...ఎన్నికలు అభ్యర్ధికి 40 కోట్లపైగానే ఖర్చు

 

హైద్రాబాద్, జూలై 26, (globelmedianews.com)
 ఎలక్షన్స్ కాస్ట్ లీ అయిపోయాయి. ఎన్నికలొచ్చాయంటే డబ్బు ప్రవాహంగా మారుతుంది. అంతెందుకు.. ఎమ్మెల్యేగా పోటీచేయాలంటే కోట్లు ఖర్చుపెట్టాలి. నానాటికీ ఈఖర్చు పెరుగుతుందే కానీ తగ్గడంలేదు. ఓట్లు రాబట్టుకోవాలంటే .. డబ్బు కరిగిపోవాలి. రానున్న ఎన్నికల్లో తెలుగురాష్ట్రాల్లో ఈ ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంతకీ ఒక ఎమ్మెల్యే పోటీచేయాలంటే ఎంత డబ్బు పెట్టాలి..? ఎన్ని రూపాల్లో డబ్బు ఖర్చుచేయాల్సి ఉంటుంది..? ఎన్నికల సమయం ఆసన్నమవుతోంది. మరోవైపు ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో ఇప్పటినుంచే తెలుగురాష్ట్రాల్లో ఓరకంగా ఎన్నికల సందడి మొదలైపోయింది. ప్రధాన పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి. ఎవరు ఎక్కడనుంచి పోటీచేయాలన్నదానిపై సిగపట్లు పడుతున్నారు నేతలు. ఎమ్మెల్యేల టికెట్ల ఆశించేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఎమ్మెల్యేగా పోటీచేయాలంటే అంత వీజీ కాదు. ప్రజల మనసులు గెలిస్తే సరిపోదు.. వారిని శాటిస్ ఫై చేయాలి. అలా చేయాలంటే డబ్బు కావాలి. వందలు వేలు కాదు కోట్లు కావాలి. 
 
 
 
 వామ్మో...ఎన్నికలు అభ్యర్ధికి 40 కోట్లపైగానే ఖర్చు
 
ఓట్లు రాబట్టుకోవాలంటే ఆమాత్రం ఖర్చుపెట్టాల్సిందే. అందుకే ఎమ్మెల్యే టికెట్ కోరేవాళ్లు ముందుగానే డబ్బు మూటలను సర్దిపెట్టుకుంటున్నారు. ఎన్నికలంటే ప్రచారం. అంతేనా.. మందు , విందు.. ఓటుకు నోటు ..వగైరా వగైరా .. అన్నీ కలిసి ఖర్చు తడిసి మోపెడవుతుంది. నానాటికి ఎన్నికల ప్రచారం ఖర్చు పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధులు ఇప్పటికే గల్లాపెట్టెలు లెక్కపెట్టుకుంటున్నారు.  ఈసారి ఒక ఎమ్మెల్యే అభ్యర్ధికి దాదాపు 40 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉందట. నమ్మలేకపోయినా ఇది నిజం. ఎన్నికల సమయంలో డబ్బు ప్రవాహంలా పారుతుంది. ఎన్నికలకు దాదాపు 3 నెలల ముందునుంచే హడావుడి ఉంటుంది. అంటే అప్పటినుంచే ఒకరకంగా ప్రచారం మొదలవుతుందన్నమాట. ఈ మూడునెలల్లోనే ప్రచారానికి దాదాపు 6 కోట్లు ఖర్చయిపోతాయి. గతంలో మాటలతో నచ్చచెప్పో.. లేక హామీలిచ్చో ఓట్లు రాబట్టుకునేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మారింది. జనంలోనూ ఎన్నికలపై అవగాహన వచ్చింది. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు ఎలాగూ నెరవేర్చరనే అభిప్రాయం జనానికొచ్చేసింది. దీంతో డబ్బులిస్తేనే ఓటువేస్తామనే ధోరణికి వచ్చేశారు. ఎన్నికల సమయంలోనే డబ్బులిస్తారు కాబట్టి.. ఆ అవకాశాన్ని వదలుకునే పరిస్థితిలో లేరు ప్రజలు. కాబట్టి తప్పనిసరిగా ఎమ్మెల్యే అభ్యర్ధులు ఓటు కొనే పరిస్థితి నెలకొంది.  ఒక ఓటు ఖరీదు దాదాపు 2వేలు. వేరే పార్టీ అభ్యర్ధి అంతకంటే ఎక్కువిచ్చే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో ఓటరు పంట పండినట్టే. ఒక నియోజకవర్గంలో లక్ష మంది జనాభా ఉంటే ఓటరుకు 2వేల చొప్పున ఇస్తే.. 20 కోట్లు ఖర్చువుతుంది. లక్షన్నర జనాభా ఉంటే 30 కోట్లు పెట్టాలి. ఓటర్లను  కొనేందుకే దాదాపు 30 కోట్లు ధారపోయాలి. ఇక ప్రచారం ఖర్చు .. అంటే వెంట వచ్చే జనం, బహిరంగసభలు, ర్యాలీలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాల ఖర్చు, మీడియా మేనేజ్ మెంట్.. ఇలా చాలా తతంగాలుంటాయి. వీటికి ఓ నాలుగైదు కోట్లు ముట్టజెప్పాలి. మరోవైపు ఎమ్మెల్యే అంటే అనుచరవర్గం తప్పనిసరి. ఓ వందమంది వరకైనా ఎమ్మెల్యే వెనకే తిరుగుతూ ఉంటారు. వారందరి ఖర్చు ఎమ్మెల్యేనే భరించాలి. ఉదయం నుంచి రాత్రి వరకు వారికయ్యే అన్ని ఖర్చులూ ఎమ్మెల్యేగారే చూసుకోవాలి. ఇదంతా కలిపి ఓ కోటిరూపాయిలైనా అవుతుంది. అంటే అంతా కలిపి ఒక ఎమ్మెల్యేగా పోటీచేయాలంటే దాదాపు 40 కోట్లు ఖర్చుపెట్టాలి. అభ్యర్ధిని బట్టి ఖర్చు పెరుగుతూ ఉంటుంది. కొంతమంది తగ్గే అవకాశమూ ఉండొచ్చు. ప్రస్తుతం తెలుగురాష్ట్రాల్లో ఎమ్మెల్యేల అభ్యర్ధుల అంచనాలివి. ఇప్పటినుంచే రెండు రాష్ట్రాల నేతలు ప్రస్తుతం లెక్కలు వేసుకుంటున్నారు. రాబోయే ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీలు గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామని నొక్కి చెబుతున్నాయి.  దీంతో టికెట్ కోరేవాళ్లు  కాస్త ముందుగానే నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రచారానికి అయ్యే ఖర్చును కూడా అంచనా వేస్తున్నారు. 40కోట్లను భరించే వారే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అయ్యే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా రానున్న ఎన్నికలు చాలా ఖరీదు కాబోతున్నాయి.

No comments:
Write comments