డెల్టాపై నిర్లక్ష్యం

 

మచిలీపట్నం, జూలై 2 (globelmedianews.com)
జిల్లాలోని కాలువల ద్వారా సాగు, తాగు అవసరాలకు, డ్రెయిన్ల ద్వారా ఆక్వారంగానికి నీటి వసతి సమకూరుతోంది. వీటి ఆధునికీకరణకు ప్రభుత్వం నిధులు కేటాయించి తొమ్మిదేళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. కాంట్రాక్టర్లు పలుకుబడి ఉన్నవారు కావడంతో వారు సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించి పనులు పూర్తికాకుండా చేస్తున్నారు. తమ పనులు రద్దు కాకుండా చేసుకోవడంతో పాటు వేరొకరు వాటిని చేపట్టకుండా కాలయాపనతో సరిపెడుతున్నారు. పెద్ద పనులను, చేయలేని వాటిని వదలిపెట్టారని రైతులు వాపోతున్నారు. చేసిన పనులు కూడా రైతుల అవసరాలకు తగినట్లుగా లేవనే విమర్శలొస్తున్నాయి.
 
 
 
  డెల్టాపై నిర్లక్ష్యం
 
తూర్పు కృష్ణాకు ప్రకాశం బ్యారేజీ నుంచి బందరు, ఏలూరు కాలువల ద్వారా నీరు సరఫరా అవుతోంది. బందరు కాలువ ద్వారా రైవస్‌ కాలువకు, గుడ్లవల్లేరు లాకుల నుంచి పోల్‌రాజు, క్యాంపుబెల్‌, బంటుమిల్లి కాలువల ద్వారా తూర్పుడెల్టా ప్రాంతానికి నీటి సరఫరా జరుగుతోంది. వీటి ఆధునికీకరణకు ముందుకొచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు ఏళ్లు గడుస్తున్నా పనులను పూర్తిచేయడం లేదు. బడా కాంట్రాక్ట్ సంస్థల నిర్లక్ష్యాన్ని గుర్తించిన ప్రభుత్వం వీరికి అప్పగించిన పనులను రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఒత్తిడి పెంచడంతో ఆధునికీకరణ పనులను రైతులు వ్యతిరేకిస్తున్నారని, చేయలేమని రద్దు కోసం కాంట్రాక్టర్లు ప్రతిపాదనలు పంపారు.
 కైకలూరు డివిజన్‌లో 14వ ప్యాకేజీ కింద ప్రభుత్వం 2009లో రూ.67.03 కోట్లు కేటాయించింది. ఈ పనులను పటేల్‌ కంపెనీ దక్కించుకుంది. ముఖ్యంగా పోల్‌రాజు, క్యాంప్ బెల్‌ (సీబీ) కాలువలను, పలు డ్రెయిన్ల ఆధునికీకరణ పనుల కోసం ఈ నిధులు మంజూరయ్యాయి. ఇవి కాక అదనంగా మరో రూ.17 కోట్లు కేటాయించారు. వీటితో ముదినేపల్లి మండలంలోని శ్రీహరిపురం ప్రాంతంలో కాలువకు రిటైనింగ్‌ వాల్‌, బెడ్‌ లైనింగ్‌ పనులు చేయాలి. కొంత మేరకు ఈ పనులు జరుగుతున్నాయి. కాలువలకు నీటిని విడుదల చేసే సమయం ఆసన్నమవుతున్నా పనులను మాత్రం పూర్తి చేయలేదు. పనులు దక్కించుకున్న నిర్మాణ సంస్థ తొమ్మిదేళ్లలో రూ.47 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తిచేసింది. మిగిలినవి చేపట్టకుండానే వదిలేసింది. రైతులు సహకరించడం లేదని, పనులు చేసే వీల్లేదని పలు కారణాలు చూపింది. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధుల కోరిక మేరకు గత ఏడాది సుమారు రూ.1.50 కోట్ల పనులు చేశారు. శివారు ప్రాంతాల్లో షట్టర్లు, కాలువ, డ్రెయిన్ల పూడిక పనులు, వంతెనలు, ఇతర పనులు నిలిచి ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ ఏడాది వేసవి ముందు రూ.18.50 కోట్ల పనులు చేయలేమని చేతులెత్తేసి.. రద్దు కోసం పటేల్‌ సంస్థ ప్రతిపాదనలు పంపించింది. ఈలోగా నీరు- చెట్టు పథకంలో రూ.2 కోట్లతో నీటి సంఘాల ద్వారా పనులు చేయించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పనులు చేసినా డబ్బు సకాలంలో ప్రభుత్వం విడుదల చేయడం లేదని సాగునీటి సంఘాల ప్రతినిధులు కూడా కాలువ, డ్రెయిన్ల పనులు చేపట్టడానికి వెనుకడుగు వేస్తున్నారు. కలిదిండి మండలంలోని కొన్ని గ్రామాల పరిధిలో నీటి సంఘాల ప్రతినిధులు తమ పరిధిలోని కాలువల పనులు చేయిస్తున్నారు.
ఆధునికీకరణ పేరుతో డెల్టాను కాంట్రాక్టర్లు సర్వనాశనం చేశారు. బ్రిటీషు కాలం నాటి కట్టడాలను ధ్వంసం చేసి నాసిరకం పనులు మూన్నాళ్ల ముచ్చటగా చేశారు. దీనివల్ల గతంలో పోల్‌రాజుకు 150 క్యూసెక్కుల నీరు వచ్చే సామర్థ్యం నేడు ఆధునికీకరణ పనుల పుణ్యామా అని 120 క్యూసెక్కులు కూడా రావడం లేదు. ఆధునికీకరణకు ముందు శివారు గ్రామాలకు నీరు వచ్చేది. ఈ పనులు చేపట్టిన తరవాత తొమ్మిదేళ్లుగా శివారు గ్రామాలకు నీరు రావడం లేదు. కాలువల స్థాయి తగ్గిపోయింది. ఇష్టం వచ్చినట్లు చేయడం వల్ల కట్టలు సైతం బలహీనపడి గండ్లు పడుతున్నాయి. అప్పటి ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. రైతుల పేరిట రూ.కోట్లు ఖర్చు అయ్యాయి. కానీ రైతులు సాగునీటి కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది.

No comments:
Write comments