బడిపిల్లల ఇబ్బందులు పట్టవా..?

 

అమరావతి, జూలై 2 (globelmedianews.com)
 సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల సంఖ్య  వందల్లో ఉంటే... వీరికోసం ఏర్పాటు చేసిన  మరుగుదొడ్లు ఆరు నుంచి పది వరకు మాత్రమే.. ఇంతమంది వినియోగించే టాయిలెట్లలు శుభ్రంగా లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు నానా అవస్థలు పడుతున్నారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో వాటిని శుభ్రం చేయడానికి స్కావెంజర్లు నిరాకరిస్తున్నారు. దీంతో కంపు కొట్టే మరుగుదొడ్లు వినియోగించలేమని చిన్నారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో నలుగురు వినియోగించే దగ్గరే సరిగా నీళ్లు పోయకపోయినా, శుభ్రం చేయకపోయినా ఎలాంటి పరిస్థితి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. అలాంటిది రెండు జిల్లాల్లో పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి ఇచ్చే నిధులు 11 నెలలుగా బకాయి పెట్టడం గమనార్హం.
 
 
 
బడిపిల్లల ఇబ్బందులు పట్టవా..?
 
పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉండవు. ఉన్నా వాటి నిర్వహణ లేక కంపుకొడతాయి. వాటిల్లోకి వెళ్లటం కష్టమని చాలా మంది బాలికలు పాఠశాల దశలోనే బడి మానేస్తున్నారు. ఈ రకమైన డ్రాపౌట్లు ఎక్కువుగా ఉంటున్నాయని పలు సర్వేలు ఇంతకుముందే వెల్లడించాయి. మరుగుదొడ్ల నిర్వహణ వ్యయాలు ప్రభుత్వమివ్వక.. మరోవైపు ఆ నిర్వహణ ఛార్జీలు సొంత జేబు నుంచి వెచ్చిస్తే అవి ఎప్పటికి సమకూరతాయో తెలియక అనేక మంది హెచ్‌ఎంలు మరుగుదొడ్లు బాగున్నా బాగోకపోయినా పట్టించుకోవటం లేదు. దీంతో నిర్వహణ కొరవడి మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. ఇప్పటికే 11 నెలల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయి. ఒక్కో పాఠశాలకు రూ.20వేల నుంచి రూ.44వేల దాకా రావల్సి ఉండటంతో ఇకమీదట సొంత జేబులు నుంచి వెచ్చించి మరుగుదొడ్లు శుభ్రం చేయించలేమని కొందరు హెచ్‌ఎంలు చేతులెత్తేస్తున్నారు. మున్ముందు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ మరీ అధ్వానంగా మారే అవకాశం ఉందనే ఆందోళన ఉపాధ్యాయవర్గం నుంచి వినిపిస్తోంది.
ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు శుభ్రం చేయటానికి స్కావెంజర్లను పెట్టుకోవాలని, వారిని డీఆర్‌డీఏ ద్వారానే చెల్లింపులు జరపాలనేది ప్రభుత్వ విధాన నిర్ణయం. ఉన్నత పాఠశాలకు నెలకు రూ.4వేలు చొప్పున 11 నెలలకు రూ.44వేలు, ప్రాథమికోన్నత పాఠశాలకు నెలకు రూ.2500 చొప్పున రూ.27,500, ప్రాథమిక పాఠశాలకు రూ.2 వేలు చొప్పున రూ.22వేలు మరుగుదొడ్లకు నిర్వహణ వ్యయాలు సర్వశిక్ష అభియాన్‌ నుంచి డీఆర్‌డీఏకు రావాలి. అలావస్తే వాటిని డీఆర్‌డీఏ యంత్రాంగం స్కావెంజర్లకు ఖర్చుపెడుతుంది. పాఠశాలల్లో మరుగుదొడ్ల శుభ్రతకు అవసరమయ్యే బ్లీచింగ్‌, పినాయిల్‌, చీపుర్లు వంటి సామగ్రి కూడా ఈ మొత్తంలో నుంచే వెచ్చించాలి. ఇన్ని నిధులు పాఠశాలకు ఏ గ్రాంటు నుంచి అందవు. స్కూల్‌ గ్రాంటు కింద రూ.10వేలు కేటాయిస్తారు. ఆ నిధులతో పాఠశాలకు నెలవారీ విద్యుత్తు, అంతర్జాలం బిల్లులు, నల్లబల్లలు, చాక్‌పీస్‌లు వంటివి కొనుగోలు చేస్తారు. వాటి కొనుగోలుకే ఆ నిధులు సరిపోవని, అలాంటప్పుడు తమ వద్ద ఏం నిధులు ఉంటాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
కృష్ణా జిల్లాలో 2956, గుంటూరు జిల్లాలో 3250 పాఠశాలలకు గత 11  నెలలుగా బిల్లులు పెండింగ్‌ పడ్డాయని ఉపాధ్యాయులు వివరించారు. సగటున ఒక్కో జిల్లాకు ఈబిల్లులు రూ.50 కోట్లకు తగ్గకుండా పెండింగ్‌ ఉన్నాయి. ఈ బిల్లులను సర్వశిక్ష అభియాన్‌ చెల్లించినట్లు చెబుతున్నా పాఠశాలలకు మాత్రం ఇప్పటి దాకా పైసా రాలేదని ఓ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చెప్పారు. అనేక పాఠశాలల్లో ఇప్పటికీ మరుగుదొడ్లకు పైపుల ద్వారా నీటి సరఫరా వచ్చే పరిస్థితి లేదు. ఆ వినియోగపు నీటిని కూడా బయట నుంచి ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేసి సమకూర్చుకోవాల్సి వస్తోంది. ఈ బిల్లులు భారీగా అవుతున్నాయి. ఒకవైపు దొడ్లలో వినియోగించే నీటి బిల్లులు పేరుకుపోయి మరోవైపు స్కావెంజర్ల బిల్లులు పేరుకుపోతే మరుగుదొడ్ల శుభ్రత ఎలా సాధ్యమో విద్యాశాఖ ఉన్నతాధికారులే ప్రశ్నించుకోవాలి. కీలకమైన ఈ బిల్లులను 11 నెలలుగా పెండింగ్‌ పెట్టడం ఏమిటని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. సగటున ఒక్కో ఉన్నత పాఠశాలలో 300 నుంచి 800 మంది వరకు విద్యార్థులు ఉంటున్నారు. ఇంతమందికి ఏడు నుంచి పది వరకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయి. ఇన్ని వందల మంది వినియోగించే మరుగుదొడ్లను నిత్యం పినాయిల్‌, బ్లీచింగ్‌ వంటివి వేసి కడిగిస్తే తప్ప వాటిని వినియోగించుకోలేమని ఉపాధ్యాయ వర్గం అంటోంది. ఒక్క విద్యార్థులే కాదు.. ఆ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి కూడా అత్యవసరానికి ఆ దొడ్లు తప్ప ప్రత్యామ్నాయం లేదు.
మరుగుదొడ్ల బిల్లులు చాంతాడులా పేరుకుపోవటంతో స్కావెంజర్లు ఎవరూ శుభ్రం చేయటానికి రావటం లేదు. ఆ కంపుకొడుతున్న వాటిల్లోకి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవటానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వెంటనే మరుగుదొడ్ల బిల్లులు మంజూరు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. వాస్తవానికి వేసవి సెలవుల్లోనే పెండింగ్‌ పడిన బిల్లులు మొత్తం విడుదల చేసి ఉంటే పాఠశాలల పునఃప్రారంభం నాటికి వాటికి సున్నం వంటివి వేయించి అందరూ వినియోగించుకునేలా శుభ్రం చేయించేవారమని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా పాఠశాల విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్‌ ఉన్నతాధికారులు ఈనిధుల విడుదలలో నెలకొన్న జాప్యాన్ని నివారించి వెంటనే 11 నెలలుగా నిలిచిన బిల్లులను చెల్లించాలని రెండు జిల్లాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.

No comments:
Write comments