ఇన్ ఛార్జ్ లే దిక్కు

 

కరీంనగర్, జూలై 24 (globelmedianews.com):
 జిల్లాలో సంక్షేమ శాఖలు నిర్వీర్యమవుతున్నాయి. ఉన్నత స్థాయి అధికారుల నియామకం కరవై.. సమస్యలు పేరుకుపోతున్నాయి.. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పెరుక యాదయ్యపై అవినీతి నిరోధక శాఖ ఫిబ్రవరి 14న కేసు నమోదు చేయటంతో సస్పెండ్‌ అయ్యారు. అప్పటి నుంచి శాఖకు ఉన్నతాధికారిని నియమించలేదు. ఎస్సీ కార్పొరేషన్‌ కార్యనిర్వాహక సంచాలకులు శ్రీమాలకు కొన్నాళ్లు బాధ్యతలు అప్పగించారు. ఆమె బదిలీపై వెళ్లడంతో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్లకు అప్పగించారు. ఆయన ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ప్రస్తుతం హుజురాబాద్‌ సహాయ సాంఘిక సంక్షేమాధికారి వినోద్‌కుమార్‌కు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు.
 
 
 
 ఇన్ ఛార్జ్ లే దిక్కు
 
నగరంలోని కళాశాల స్థాయి వసతి గృహాల్లో వసతి కొరత నెలకొంది. ప్రధానంగా మహిళా వసతి గృహాలకు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకుంటున్నారు. వసతులు లేవంటూ జ్యోతినగర్‌లోని మహిళా కళాశాలలో అడ్మిషన్లు క్లోజ్‌ చేశారు. మిగిలిన వాటిలోనూ సామర్థ్యం కన్నా ఎక్కువ మంది విద్యార్థినులు ఉంటున్నారు. మరో రెండు వసతి గృహాలు ఉంటేగాని విద్యార్థినుల అవసరాలు తీరే పరిస్థితి లేదు. పైగా తాగునీటి కొరత నెలకొంది.. ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ఆవరణలోని ఎస్సీ నిర్భయ బాలికల కళాశాల స్థాయి వసతి గృహంలో నీటి ఎద్దడిని తీర్చాలంటూ మార్చిలో విద్యార్థినులు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. ఇప్పటివరకు ఆ సమస్య పరిష్కారం కాలేదు. ఇలా మౌలిక వసతుల కరవైనా పట్టించుకొనే దిక్కులేకుండా పోయింది.
వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖలో మరీ అధ్వాన పరిస్థితి నెలకొంది.. రెండేళ్లుగా ఇన్‌ఛార్జి అధికారులతోనే నెట్టుకొస్తున్నారు. సహాయ సంక్షేమాధికారికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చి నిర్వహణ కొనసాగిస్తున్నారు. నగరంలోని బాలుర కళాశాల స్థాయి వసతి గృహానికి ప్రస్తుత సంవత్సరం 257 దరఖాస్తులు వస్తే 76 మందిని మాత్రమే తీసుకున్నారు. మిగతావారికి మొండి చేయి చూపారు. ఈ పరిస్థితి రెండేళ్లుగా ఉన్నా.. జిల్లా యంత్రాంగం చొరవచూపి కొత్త వసతి గృహం ఏర్పాటు చేయించడం లేదు. 100 మందికి సరిపోయే వసతి గృహంలో 150 మంది వరకు పెంచారు. అనంతరం గతేడాది ఏకంగా 220కి పెంచి చేతులు దులుపుకొన్నారే తప్ప.. అదనంగా ఏర్పాటు చేయలేదు.  బీసీ రుణాల దరఖాస్తుల్లో కేటగిరీ-3 కింద అభ్యర్థులకు ఆన్‌లైన్‌ చేయకపోవటంతో వారికి రుణాలు మంజూరు కాలేదు. ఇదే సమయంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఈ విభాగం కింద రుణాలు మంజూరయ్యాయి. కొత్తగా మంజూరు చేస్తున్న రుణాల్లో వారిని పరిగణలోకి తీసుకుంటారా.. లేదా అన్న విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయ ముఖ్య పర్యవేక్షరాలు ఇందిర తన స్వస్థలం ఖమ్మం జిల్లాకు బదిలీపై వెళ్లగా ఆమె స్థానంలో జగిత్యాల జిల్లా నుంచి బదిలీపై రావాల్సిన జయరాజ్‌ ఇప్పటివరకు రాలేదు. సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌లో ఉండటంతో ముగ్గురు జూనియర్‌ అసిస్టెంట్స్‌, ఇద్దరు పొరుగు సేవ ఉద్యోగులతో కార్యాలయం నెట్టుకొస్తున్నారు.
మైనార్టీ సంక్షేమ శాఖలో సంక్షేమాధికారిగా పనిచేసిన సయ్యద్‌ అహ్మద్‌ అలీ గత నెలలో బదిలీపై వెళ్లిపోయారు. ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో కొత్తగా గిరిజన సంక్షేమాధికారిగా బదలీపై వచ్చిన క్రిష్ణానాయక్‌కు ఇన్‌ఛార్జిగా అప్పగించారు. ఆ శాఖ అధ్వర్యంలో జిల్లాలో 9 వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. రుణాలు మంజూరు చేసిన అనంతరం బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయడానికి అధికారులు ఎంతో కొంత కృషిచేయాల్సి ఉంటుంది. జిల్లా అధికారి లేకపోవటంతో లబ్ధిదారుల సమస్యలను జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లేవారు కరవయ్యారు. 
గిరిజన సంక్షేమాధికారికి బాధ్యతలు అప్పగించినా ఆయన సొంత శాఖలోని సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఆయా కలెక్టర్లు పెట్టే సమావేశాలతోనే ఆయనకు సరిపోతుంది. ఇక మైనార్టీ శాఖ పరిస్థితులను సమీక్షించే తీరికే ఉండటం లేదు.

No comments:
Write comments