ఛలో గుంటూరు అంటున్న నేతలు

 

గుంటూరు, జూలై 27, (globelmedianews.com)
ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ లీడర్లు రెడీ అయిపోతున్నారు. ప్రజల చెంతకు వెళ్లేందుకు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయకులు ప్రచార రథాలను రూపొందించుకునే పనిలో పడ్డారు. ఈ వాహనాలన్నీ తయారు అయ్యేది ఎక్కడో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాజధానికి కూతవేటు దూరంలో ఉన్నగుంటూరులోనే. గుంటూరు లో ఉన్న జయలక్ష్మి డిజైనర్స్ ఈ వాహనాలను ఆకర్షణీయంగా తయారు చేస్తారు. ఎన్నికలకు ఇంకా పది నెలల సమయం మాత్రమే ఉండటంతో గుంటూరులో ఈ ప్రచార రథాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది.ఎన్నికల వేళ ప్రచార రథం ఎంతో అవసరం. గ్రామగ్రామాన, గడప..గడప కూ అభ్యర్థి తిరగాల్సి ఉంటుంది. అందుకోసం వీధుల్లో వెళుతూ కూడా ఓట్లను అభ్యర్థిస్తూ వెళ్లేందుకు, వాహనం పైనుంచే ప్రజల నుద్దేశించి మాట్లాడేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుంది. అందుకోసం ప్రతి పార్టీ కి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి ఖచ్చితంగా ప్రచార రథాన్ని ఉపయోగిస్తారు. వీటి తయారీలో గుంటూరుకు చెందిన జయలక్ష్మి డిజైనర్స్ కు సుదీర్ఘ అనుభవం ఉండటంతో అందరూ గుంటూరు వైపు వస్తున్నారు. 
 
 
 
ఛలో గుంటూరు అంటున్న నేతలు
 
ఈ వాహనాలకు అన్ని సౌకర్యాలను సమకూరుస్తారు. రాత్రి వేళ గ్రామాల్లో ప్రసంగించాలనుకున్నప్పటికీ వాహనం రెండు వైపులా ఎల్ఈడీ ఫోకస్ లైట్లు ఉంటాయి. ఈ లైట్లు, మైక్ కోసం జనరేటర్ ను వినియోగిస్తారు. ప్రసంగించేందుకు ఒక కార్డ్ లెస్ మైక్ తో పాటు, మరో మైక్ కూడా ఇస్తారు.అలాగే ఈ వాహనంపైకి ఎక్కేందుకు స్టీల్ తో తయారు చేసిన నిచ్చెన ఉంటుంది. వాటర్ ప్రూఫ్ కార్పెట్ ఈ వాహనంలో ప్రత్యేకతగా చెబుతారు. అభ్యర్థికి రక్షణగా వచ్చే గన్ మెన్లు నిల్చునేందుకు వీలుగా ఈ వాహానానికి మూడు వైపులా ఫుట్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. వాహనం తయారీ ఖర్చు ఎక్కువగా ఉన్నా నేతలు ఏమాత్రం తగ్గడం లేదు. తమ పార్టీ గుర్తుతో పాటు అధినేత ఫొటో తో సహా వాహనాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. అందుకోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన రాష్ట్రాల నేతలే కాదు ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఇక్కడ తయారు చేసిన ప్రచార రథాలనే వినియోగిస్తుండటం విశేషంమంత్రి నారా లోకేశ్ కోసం ఇక్కడ ప్రత్యేకంగా తయారు చేసిన వాహనం రెడీగా ఉంది. దీన్ని లోకేశ్ కుప్పంలో వినియోగించనున్నారు. అలాగే చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రి అమర్ నాథ్ రెడ్డి కూడా ఇప్పటికే తన వాహనాన్ని తీసుకువెళ్లారు. పాతపట్నం ఎమ్మెల్యే వెంకటరమణ ప్రచార రథం తయారీకి ఆర్డర్ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సయితం ఇక్కడే వాహనాన్ని తయారు చేస్తున్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, టీఆర్ఎస్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, వేముల ప్రశాంత్ రెడ్డిలు కూడా వాహనాల తయారీకి ఆర్డర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇక్కడి నుంచే వాహనాలు అక్కడి నేతలు తయారు చేయించుకుని వెళ్లారు. సిద్ధరామయ్య, దేవగౌడ కుమారుడు రేవణ్ణ కూడా ఇక్కడి తయారైన వాహనాన్నే ప్రచారంలో వినియోగించారు. మొత్తం మీద ప్రచార రథాలు రెడీ అవుతున్నాయి. నేతలు ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

No comments:
Write comments