గాడిన పడుతున్న ఆర్టీసీ

 

గుంటూరు, జూలై 3, (globelmedianews.com) 
ఆర్టీసీ అంటేనే, ఎప్పుడూ నష్టాల్లో నడిచే నష్టాల బస్సుగా ముద్ర పడింది.. ఇది నిజం కూడా... ఆదాయం రాక పడరాని పాట్లు పడుతోన్న ప్రజా రవాణాసంస్థ ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఏపీఎస్ఆర్టీసీ లాభాలను నమోదు చేసింది. బస్సులను నడపడంలో లోపాలను సరిదిద్దుకోవడం, కొత్త బస్సుల కొనుగోళ్లు, ఆక్యుపెన్సీని పెంచుకోవడం, పట్టుదలగా యాజమాన్యం చేసిన ప్రయత్నాలు తదితర అంశాలలో యాజమాన్యం చేసిన కృషి ఫలించి, చివరకు ఆర్టీసీని లాభాల బాట పట్టించింది. పెళ్లిళ్లు, వేసవి సెలవులు తదితర అంశాలు కూడా ఆర్టీసీకి బాగా కలసివచ్చాయి. సొంతగా కార్గో సేవలు అందిచటం కూడా,కలిసి వచ్చింది. కొన్ని రూట్లలో అద్దెబస్సులను, మరిన్ని రూట్లలో కొత్త బస్సులను నడిపి.. ప్రయోగాలకు తెర తీసింది. కేసినేని లాంటి ట్రావెల్స్‌ ఆగిపోవటంతో, దూరప్రాంత బస్సుల్లో కొంతమేర ఆక్యుపెన్సీ పెరిగింది.రాష్ట్ర విభజన తరువాత దాదాపు 3వేల కోట్ల రూపాయల తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ తాజా సంస్కరణల ఫలితంగా క్రమేణా రాబడి పెంచుకుంటూ నష్టాలను తగ్గించుకుంటోంది. 
 
 
 
గాడిన పడుతున్న ఆర్టీసీ
 
సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ మాలకొండయ్య హయాంలో 2016-17లో రూ. 780 కోట్లుగా ఉన్న సంస్థ నష్టం 2017-18 నాటికి రూ. 390 కోట్లకి చేరింది. అంటే రికార్డు స్థాయిలో ఒక్కసారిగా రూ. 450 కోట్లు నష్టం తగ్గింది. ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి సురేంద్రబాబు కృషి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతినెలా క్రమేణా నష్టాలు తగ్గుతూ వస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 2017-18 ఏప్రిల్‌తో పోలిస్తే మొత్తం 128 డిపోల్లో రికార్డు స్థాయిలో రూ. 31 కోట్లు నష్టం తగ్గింది.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మే నెలలో ఏడు డిపోల్లో రాబడి పెరిగింది. ఏప్రిలో వచ్చిన నష్టం రూ. 27కోట్లు కాగా మే నెలలో వచ్చిన నష్టం రూ. 7.13 కోట్లు మాత్రమే కావటం విశేషం. మొత్తం 128 డిపోల్లో మూడు బస్ స్టేషన్లు సహా మొత్తం 35 డిపోల్లో రూ. 23.51 కోట్లు రాబడి రాగా, 97 డిపోల్లో రూ. 58 కోట్ల రూపాయల మేర సంస్థకు నష్టాలు వచ్చాయి. ఈ రెండు మాసాల్లో కలిపి అత్యధికంగా విజయవాడ డిపో రూ. 3.41 కోట్ల రాబడితో ప్రథమ స్థానంలో నిలవగా రూ. 1.91 కోట్లతో రాజమండ్రి, కోటి 90 లక్షల 42వేలతో అమలాపురం, కోటి 67 లక్షల 75 వేలతో కాకినాడ, కోటి 54 లక్షలతో కనిగిరి, కోటి 15 లక్షల 27వేలతో విజయవాడ ఆటోనగర్, కోటి 8 లక్షలతో విశాఖ, 88.81 లక్షలతో తుని, రూ. 69 లక్షలతో రాజోలు వరుస క్రమంలో నిలిచాయి. ఇక రూ. కోటి 84 లక్షల 12వేల నష్టాలతో చిత్తూరు-1 డిపో చివరి స్థానంలో నిలిచింది.

No comments:
Write comments