చిరుధాన్యాల మిషన్ పై రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం

 

హైదరాబాద్ జూలై 3 (globelmedianews.com)

హైదరాబాదులోని హాకా భవన్ లోని సమావేశ మందిరంలో వ్యవసాయ కమిషనర్ డా. ఎం. జగన్ మోహన్, అధ్యక్షతన చిరుధాన్యాల మిషన్ పై రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమాన్ని  ప్రారంభిస్తూ.. 2018-19 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించినట్లు వ్యవసాయ కమిషనర్ గుర్తు చేశారు.  ఈ చిరుధాన్యాల మిషన్ ప్రధాన ఉద్దేశ్యం చిరుధాన్యాల విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచడమేనని అన్నారు. ప్రతి కుటుంబ స్థాయిలో చిరుధాన్యాల వినియోగాన్ని  25 శాతం పెంచడం,  తద్వారా పోషకాల భద్రతను కల్పించి, చిరుధాన్యాల డిమాండును సృష్టించడం ఈ మిషన్ ఉద్దేశ్యమని అన్నారు.  ఈ పథకంలో మహిళల, పిల్లల ఆరోగ్యం ఒక ముఖ్య అంశమని అన్నారు.  చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లను పంచాయితీ, మండల స్థాయిలో ప్రోత్సహించడమే కాక కుటుంబ స్థాయిలో కూడా చిరుధాన్యాల ప్రాసెసింగ్ చేసుకునేలా చూడడం లక్ష్యం అని అన్నారు.  
 
 
 
 చిరుధాన్యాల మిషన్ పై రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమం
 
మహిళా రైతులు కేంద్రంగా చిరుధాన్యాల ఉత్పాదకతను పెంచే వ్యవస్థలపై దృష్టి సారించడం, అవి లాభదాయకంగా మనుగడ సాధించేలా చూడడం ఈ మిషన్ లక్ష్యమని అన్నారు.మహిళా ఔత్సాహిక రైతులను చిరుధాన్యాల ఆధారిత సంస్థలను నెలకొల్పేలా ప్రోత్సహించడం, గ్రామాలకు, పట్టణాలకు మధ్య చిరుధాన్యాల  మార్కెటింగ్ సంబంధాలను మెరుగు పర్చడం లక్ష్యమని అన్నారు.  రాష్ట్ర పోషక ఆహార పథకం (అంగన్ వాడి), పౌర సరఫరాల విభాగం ద్వారాను చిరుధాన్యాల పంపిణీ జరిగేలా చూడడం లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ వాసన్ తోడ్పాటుతో  అమలు చేస్తుందని అన్నారు.  జిల్లా స్థాయిలో నోడల్ ఏజెన్సీగా ఆత్మ వ్యవహరిస్తుందని అన్నారు.  ఈ పథకం కోసం 5 సంవత్సరాలకు గాను మొత్తం బడ్జెట్    64 కోట్ల రూపాయలు కాగా వార్షిక బడ్జెట్ రు.10.62 కోట్లు.   ఈబడ్జెట్ లో జాతీయ ఆహార భద్రత మిషన్ ద్వారా రు. 6.51 కోట్లు, ఆర్కేవివై పథకం, రాష్ట్ర బడ్జెట్ ద్వారా రు.4.11 కోట్లు అందుతాయని చెప్పారు. ఈ చిరుధాన్యాల మిషన్ పథకం అమలుకు ఆదిలాబాదు(మండలాలు- ఇంద్రవెల్లి, నార్నూర్, గుడహత్నూర్, గాడెగుడ, ఉట్నూర్, సిరికొండ), ఆసిఫాబాద్(మండలాలు- ఆసిఫాబాద్, తిర్యాణి, కెరమెరి, జయనూర్, సిర్ఫూర్(U), లింగాపూర్),  నాగర్ కర్నూలు(మండలాలు- కొల్లాపూర్, పెద్ద కొత్తూర్, కోడైర్, పెంట్లపెల్లి, బాలమూర్, లింగాల్), మహబూబ్ నగర్(మండలాలు- నవాబ్ పేట, గండీడ్, హన్వాడ, కోయల్ కొండ, దామెరగిద్ద, నారాయణపేట), వికారాబాద్(మండలాలు-వికారాబాద్, ధరూర్, దౌలతాబాద్, కొడంగల్, బోమ్ రాస్ పేట, దోమ),  సంగారెడ్డి (మండలాలు- ఝరాసంగం, న్యాలకల్, సిర్గాపూర్, జహిరాబాద్, మొగడంపల్లి, నారాయణఖేడ్)  జిల్లాలను గుర్తించినట్లు వ్యవసాయ కమిషనర్  అన్నారు.  ఎంపిక చేసిన ప్రతి జిల్లానుంచి 6 మండలాలను ప్రతి మండలంలోను 200 ఎకరాల చొప్పున 7200 ఎకరాలలో ఈ చిరుధాన్యాల మిషన్ అమలౌతుందని అన్నారు.   ఇప్పటికే  ఖరీఫ్ (వానాకాలం) ప్రారంభం అయినందున ఈ పథకం అమలుకు సరిపడా విత్తనాలను తెలంగాణ రాష్ట్ర  విత్తనాభివృద్ధి సంస్థ ఏర్పాటు  చేసిందని వ్యవసాయ కమిషనర్ తెలిపారు.  2018 జూలై 2,3 తేదీలలో రెండు రోజుల  పాటు జరిగే సమావేశంలో క్షేత్ర స్థాయిలో చిరుధాన్యాల మిషన్ కార్యక్రమాన్ని అమలు చేయడానికి వచ్చిన సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకోవడం, పథకం అమలుకు ప్రణాళిక రూపొందించుకోవడం లక్ష్యమని అన్నారు. ఈ సమావేశంలో చిరుధాన్యాల మిషన్ క్షేత్ర స్థాయిలో అమలు చేసే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, 6 జిల్లాల ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్లు, 6 జిల్లాల వ్యవసాయ  అధికారులు (సాంకేతిక), తెలంగాణ స్టేట్  సీడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కు చెందిన 6 జిల్లాల మేనేజర్లు, వ్యవసాయ కమిషనర్ కార్యాలయం నుంచి వ్యవసాయ అదనపు సంచాలకులు కె. విజయ కుమార్, వ్యవసాయ ఉప సంచాలకులు వై. మాధవి సహా  వ్యవసాయ అధికారులు, వాసన్ ప్రతినిధులు పాల్గొన్నారు. 

No comments:
Write comments