పుస్తకాల గోల

 

అనంతపురం, జూలై 24 (globelmedianews.com): 
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాల పంపిణీ ప్రక్రియ వివాదం రేగుతోంది. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేదు. ఈక్రమంలో జిల్లాకు రావాల్సిన పుస్తకాల ప్రక్రియ 60 శాతానికే పరిమితమైంది. ఇక అంతా ముద్రణ సంస్థల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. అప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పుస్తకాల దిగులు తప్పదు.
 
 
 
 పుస్తకాల గోల
 
ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై అప్పుడే నెల రోజులు దాటింది. అయినా విద్యార్థులకు మాత్రం మునుపెన్నడూ లేని సమస్య వెంటాడుతోంది. ప్రతి సంవత్సరం... విద్యా సంవత్సరం ప్రారంభానికే పుస్తకాలు పాఠశాలలకు చేరేవి. ఈసంవత్సరం ప్రారంభమైన పది రోజులకు కేవలం 6 లక్షలు మాత్రమే సరఫరా చేశారు. అప్పటి నుంచి అడపాదడపా ఈనెల 7 వరకు పంపిణీ 16 లక్షలకు చేరుకుంది. ఇక అప్పటి నుంచి ముందుకు సాగనంటోంది. ఈక్రమంలో విద్యార్థుల చేతికి పాఠ్యపుస్తకాలు అందకుండా ఊరిస్తూనే ఉన్నాయి. పాఠ్యపుస్తకాల లెక్కలు తేడాలొచ్చాయి. ఈక్రమంలో జిల్లాకు రావాల్సిన పాఠ్యపుస్తకాలు అందలేక పోయాయి. వ్యత్యాసాన్ని జిల్లా విద్యాశాఖ గుర్తించి పంపినా ఇప్పటి దాకా ముద్రణా సంస్థల నుంచి పాఠ్యపుస్తకాలు రావడం లేదు. 
ఈక్రమంలో అనంతపురం జిల్లాకు రావాల్సిన పుస్తకాలు మరింత జాప్యం అయ్యే ప్రమాదం నెలకొంది. తాజాగా అన్నింటీకి యూడైస్‌ డేటాను పరిగణనలోకి తీసుకుంటారు. యూడైస్‌ ప్రకారం అనంతకు రావాల్సిన పుస్తకాలను పాఠ్యపుస్తకాల డైరెక్టరు నుంచి పంపిణీ చేశారు. అయితే ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియలో నెలకొన్న లోపానికి అనంతకు రావాల్సిన 9 లక్షల పుస్తకాల లెక్కపై స్పష్టత కొరవడింది. జిల్లాకు మొత్తం 25,82,500 పుస్తకాలు అవసరం. ఇప్పటి దాకా 16 లక్షల వరకు ఇచ్చి... జిల్లాకు అన్ని పాఠ్యపుస్తకాలు సరఫరా చేసినట్లు రాష్ట్రస్థాయి అధికారులు చేతులెత్తేశారు. మిగిలిన 9 లక్షల పుస్తకాలపై సందిగ్ధం నెలకొంది. వాటిని ఎప్పుడు సరఫరా చేస్తారన్నది ప్రశ్నార్థకమే.
గతంలో ఆయా మండలాల్లోని ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన ప్రతిపాదన మేరకు ఎంఈవోలు వివరాలు పంపితే పాఠ్యపుస్తకాలు అందేవి. అనంత అధికారులు మాత్రం ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో ఒక తరగతిలో వంద మంది విద్యార్థులు ఉంటే.. అందులో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ, కన్నడ మాధ్యమం విద్యార్థులు ఉంటే కేవలం ఏదో ఒక మీడియం విద్యార్థులను పరిగణనలోకి తీసుకొని ముద్రణ చేసి పుస్తకాలు పంపడంతో వ్యత్యాసం ఏర్పడిందని పేర్కొంటున్నారు. ఈతరహా తప్పిదం అనంతపురానికి మాత్రమే ఎలా జరిగిందనేదే ఇప్పుడు తొలుస్తున్న ప్రశ్న. లోపం ఎక్కడ ఉన్నా, తప్పిదం ఎవరు చేసినా అనంతకు అందివ్వాల్సిన పాఠ్యపుస్తకాలు వచ్చేలా చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
ఈవిద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ఒకటో తరగతి నుంచి ప్రవేశ పెట్టారు. జిల్లాలో మొత్తం 520 పాఠశాలల్లో అమలులోకి వచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నుంచి మంచి స్పందన లభించింది. ఆయా పాఠశాలలకు తెలుగు మాధ్యమం పుస్తకాలనే సరఫరా చేశారు. ఇప్పటి దాకా ఒకటో తరగతిలో ఆంగ్ల మాధ్యమంలో 17,500 మంది విద్యార్థులు చేరారు. వారందరికీ ఆంగ్లమాధ్యమం పుస్తకాలు ఎప్పుడు సరఫరా చేస్తారన్నది ప్రశ్నార్థకమే.

No comments:
Write comments