కమలానికి దూరమౌతున్న ఆ వర్గం

 

విశాఖపట్టణం, జూలై 6, (globelmedianews.com
కొండ నాలుక‌కు మందేస్తే.. ఉన్న నాలుక కాస్త ఊడిపోయింద‌ట‌.. ఇప్పుడు ఏపీలో బీజేపీ ప‌రిస్థితి ఇలానే త‌యారైంది. ఏదో చేయాల‌ని చూస్తే.. మ‌రేదో జ‌రిగిపోయింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని కేంద్రం చెప్పిన త‌ర్వాత రాష్ట్రంలో ఆ పార్టీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంది. నిజానికి ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేత‌లు జ‌నంలో ధైర్యంగా తిర‌గ‌లేని వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే ప‌లువురు బీజేపీ నేత‌లు కూడా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఏపీలో బీజేపీ వేసిన‌ సామాజిక స‌మీక‌ర‌ణ ఎత్తుగ‌డ కూడా పూర్తిగా బెడిసికొట్టింద‌నే టాక్ వినిపిస్తోంది. కాపు సామాజిక‌వ‌ర్గానికి పెద్దపీట వేసి, ఏపీలో పార్టీని బ‌లోపేతం చేయాల‌ని చూసినా.. ఫ‌లితం లేకుండా పోయింద‌నే చెప్పొచ్చు. వెంక‌య్య నాయుడు క‌నుస‌న్న‌ల్లోనే దాదాపు మూడు ద‌శాబ్దాల పాటు ఏపీ బీజేపీ  న‌డిచింది. తెలంగాణ‌లో కొంద‌రు జాతీయ స్థాయి నాయ‌కులు ఆర్ఎస్ఎస్ అండ‌తో ఎదిగినా ఏపీ బీజేపీ మాత్రం పూర్తిగా వెంక‌య్య ఆడ‌మ‌న్న‌ట్టే ఆడింది. 
 
 
 
 కమలానికి దూరమౌతున్న ఆ వర్గం
 
వెంక‌య్య ఉన్న‌ప్పుడు ఏపీ బీజేపీలో ఆయ‌న సామాజిక‌వ‌ర్గం నేత‌ల‌దే ఆధిప‌త్యం. ఈ వ‌ర్గం నేత‌ల చేతుల్లో ఏపీ బీజేపీ న‌లిగిపోతోంద‌ని ఎంతో మంది ఎన్నో విమ‌ర్శ‌లు చేశేవారు.ఏపీ విష‌యంలో బీజేపీ అధిష్టానం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించింద‌ని గుర్రుగా ఉన్నారు. ఇందులో ప్ర‌ధానంగా ఉప రాష్ట్రపతి వెంక‌య్య‌నాయుడు వ‌ర్గం పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న‌విశాఖ ఎంపీ హ‌రిబాబును త‌ప్పించి, మాజీ మంత్రి  క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియ‌మించిన త‌ర్వాత ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా త‌యారైంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.మొత్తానికి వెంక‌య్య‌ను ఉప రాష్ట్ర‌ప‌తిగా పంపించేయ‌డంతో ఇక్క‌డ ఆయ‌న యాంటీ వ‌ర్గం అంతా సంబ‌రాలు చేసుకుంది. ఆ త‌ర్వాత కంభంపాటి హ‌రిబాబును త‌ప్పించి ఏపీ బీజేపీ ప‌గ్గాలు ఎవ‌రికి ఇవ్వాల‌న్న అంశంపై చాలా రోజులు చ‌ర్చ‌లు న‌డిచాయి. చివ‌ర‌కు సోము వీర్రాజు పేరు ఖ‌రార‌వుతుంద‌ని అనుకున్నా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు ఈ ప‌ద‌వి ద‌క్కింది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డం సాధ్యం కాద‌ని కేంద్రం చెప్పిన త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం నుంచి, ఎన్డీయే నుంచి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. కేంద్రంలోని ఇద్ద‌రు టీడీపీ మంత్రులు, రాష్ట్రంలోని ఇద్ద‌రు బీజేపీ మంత్రులు రాజీనామాలు చేసిన విష‌యం విదిత‌మే. ఇదే క్ర‌మంలో పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి దూర‌మైన త‌ర్వాత ఎంపీ హ‌రిబాబు కూడా సైలెంట్ అయిపోయారు. అంతేకాకుండా.. కామినేని కూడా పార్టీ కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్నారు. ఆయ‌న టీడీపీలోకి వెళ్లిపోతార‌న్న ప్ర‌చార‌మూ ఉంది. అంతేగాకుండా.. పాత‌కాపులంద‌రూ కూడా పెద్ద‌గా మాట్లాడ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.మాజీ కేంద్ర మంత్రి కావూరు సాంబ‌శివ‌రావు ఊసే లేదు. వాళ్లు త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌న్న అల‌కతో పార్టీకి అంటీముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయనకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌పున పోటీ చేసే ఉద్దేశం కూడా ఉన్న‌ట్టు లేదు. క‌న్నా ల‌క్ష్మీనార‌య‌ణ‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియ‌మించ‌డంపై పార్టీలో పెద్ద దుమార‌మే రేగింది. పార్టీ సీనియ‌ర్ నేత‌, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ‌ర్గం ఏకంగా కొద్దిరోజుల‌ పాటు తిరుగుబావుటా ఎగుర‌వేశారు. రెండు మూడు రోజులు సోము అల‌క‌బూనిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డంలో పాత‌ కాపులెవ‌రూ ముందుకు రాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే.. సోము వీర్రాజుకు అండ‌గా ఉన్న‌వాళ్లు కూడా ఇప్పుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వెంట వెళ్ల‌డం లేద‌నే టాక్ వినిపిస్తోంది. తాజాగా.. క‌డ‌ప‌లో ఉక్కు ఫ్యాక్ట‌రీ ఏర్పాటు విష‌యంలో కూడా కేంద్రం వైఖ‌రిని బీజేపీ నేత‌ల్లో కొంద‌రు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

No comments:
Write comments