ఆగమ్యగోచరంగా తయారైన డీఎస్ పరిస్థితి

 

నిజమాబాద్, 27, (globelmedianews.com)
ఉమ్మడి రాష్ట్రంలో రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి ఎంతో మంది కాంగ్రెస్ నేతలకు గాడ్ ఫాదర్ గా పనిచేసిన డి.శ్రీనివాస్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైంది. కాంగ్రెస్ లో సీనియర్ నేతగా ఉన్న ఆయన 2004, 09లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో తనవంతు పాత్ర పోషించారు. ఎంతోమంది కాంగ్రెస్ అభ్యర్థులకు తన చేతులమీదుగా బీఫామ్ లు ఇచ్చిన ఘనత ఆయన సొంతం. అటువంటిది వ్యక్తి ఇప్పుడు రాజకీయంగా అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి కష్టకాలంలో అండగా ఉండాల్సిన డీఎస్ టీఆర్ఎస్ లో చేరారు. సీనియర్ నేతగా గుర్తింపు ఉన్న ఆయనను ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పార్టీలోకి చేర్చుకున్నారు.టీఆర్ఎస్ లో చేరాక కొన్నిరోజుల వరకు డీఎస్ కు పార్టీలో అంతోఇంతో ప్రాధాన్యత ఇచ్చారు. రాజ్యసభకు కూడా పంపించారు. అయితే, డీఎస్ చిన్న కుమారుడు అర్వింద్ ధర్మపురి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి బీజేపీలో చేరాక డీఎస్ కు పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. కేసీఆర్ కుమార్తె కవితపై అర్వింద్ బీజేపీ తరుపున నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనున్నారు.

 ఆగమ్యగోచరంగా తయారైన డీఎస్ పరిస్థితి
 ఆయన చాలా చురుగ్గా నియోజకవర్గంలో తిరుగుతూ కవితకు రోజురోజుకూ బలమైన ప్రత్యర్థిగా తయారవుతున్నారు. అయితే, కుమారుడికి సహకరిస్తున్నారని, పార్టీ నేతలను కుమారుడి వైపు పంపిస్తున్నారని ఆరోపిస్తూ డీఎస్ పై చర్యలు తీసుకోవాలని కవిత సహా నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలంతా ముక్తకంఠంతో కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఫిర్యాదు చేశారు.స్వయంగా కవిత ఫిర్యాదు చేయడంతో ఇక డీఎస్ పై చర్యలు తీసుకోవడం పక్కా అనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగారు డీఎస్. కానీ, నెల రోజులు గడుస్తున్నా డీఎస్ కు అపాయింట్ మెంట్ దక్కలేదు. అలాగని ఆయన మీద చర్యలు కూడా తీసుకోలేదు టీఆర్ఎస్ అధిష్ఠానం. దీంతో డీఎస్ అసలు టీఆర్ఎస్ లో ఉన్నారా..? లేదా అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఆయనపై చర్యలు తీసుకుంటే బీసీపై చర్యలు తీసుకున్నారనే అపవాదు మూటగట్టుకోవడం ఇష్టంలేని టీఆర్ఎస్ అధిష్ఠానం చర్యలు తీసుకోవడానికి మెుగ్గు చూపడం లేదు. ఇదే సమయంలో డీఎస్ కూడా పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీలోకి ఆయన రాకను కొందరు కాంగ్రెస్ నేతలే వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే రాజకీయాలకు గుడ్ బై చెప్పడం లేదా కుమారుడు ఉన్న బీజేపీలో చేరడం మాత్రమే డీఎస్ ముందున్న మార్గాలుగా కనపడుతున్నాయి. మొత్తానికి డీఎస్ స్వయంగా పార్టీ నుంచి వెళ్లిపోవాలని టీఆర్ఎస్ భావిస్తుంటే, పార్టీ బహిష్కరించే వరకు చూడాలని డీఎస్ భావిస్తున్నట్లు కనపడుతోంది

No comments:
Write comments