అతివిశ్వాసంతో వైసీపీకి ఎదురుదెబ్బలు

 

కాకినాడ, జూలై 25 (globelmedianews.com)
వైసీపీ అధినేత జగన్ ది ఆత్మవిశ్వాసమా? అతి విశ్వాసమా? అందరినీ కలుపుకునే పోయేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదు. టీడీపీ వైసీపీ ప్రధాన శత్రువే. అలాగే కాంగ్రెస్ ను కూడా అదే రీతిలో జగన్ చూస్తున్నారు. తనపై అక్రమ కేసులను బనాయించి, పదహారు నెలలు జైలు పాల్జేసిన కాంగ్రెస్ ను జగన్ ఎట్టిపరిస్థితుల్లో దగ్గరకు రానివ్వరు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాని జనసేన, కమ్యునిస్టు లాంటి పార్టీలను కలుపుకుని వెళ్లాలన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని జగన్ భావిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల కోసం జరిగే ఆందోళనల్లోనైనా వాటిని కలుపుకునే ప్రయత్నం జగన్ చేయడం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలను అమలు చేయాలంటూ వైసీపీ బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ బంద్ ను ఏకపక్షంగా ప్రకటించారన్నది జనసేన, వామపక్షాల అభిప్రాయం. 
 
 
 
అతివిశ్వాసంతో వైసీపీకి ఎదురుదెబ్బలు
 
అవిశ్వాస తీర్మానం పార్లమెంటులో వీగిపోగానే ఏపీ బంద్ కు పిలుపునివ్వడాన్ని అవి తప్పుపడుతున్నాయి. కనీసం బంద్ కు పిలుపునిచ్చిన తర్వాతైనా తమను వైసీపీ నేతలు వచ్చి కలసి బంద్ కు సహకరించాలని కోరలేదని ఆ రెండు పార్టీలూ చెబుతున్నాయి. ఇందులో వాస్తవం ఉంది. ఒక ప్రధాన పార్టీ బంద్ కు పిలుపునిచ్చే ముందు తాము కలుపుకుని పోగలిగే పార్టీలకు చెప్పాల్సిన కనీస ధర్మం ఉంటుంది.జగన్ మాత్రం బంద్ కాల్ ను ఎవరితో సంప్రదించకుండానే ఇవ్వడం, తర్వాత కూడా ఆ పార్టీ నేతలు జనసేన, కమ్యునిస్టు పార్టీలను సంప్రదించకపోవడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసే ఎలాంటి ఆందోళనలకైనా వామపక్ష పార్టీలు మద్దతిస్తుంటాయి. ఇటీవల జరిగిన కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలోనూ వామపక్షాలు వైసీపీకి మద్దతుగా నిలిచిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. జనసేన పార్టీ నేతలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేతను సంప్రదించి ఉంటే మద్దతిచ్చి ఉండేవాళ్లమేమో అని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అక్కడ అన్ని పార్టీలూ ఏకమై ఉద్యమించాయి. అక్కడ ఉద్యమనేతగా కేసీఆర్ అన్ని పార్టీలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులను కూడా కలుపుకుని వెళ్లారు. కాని ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరగుతుంది. వైసీపీ ఇచ్చిన బంద్ లో ప్రత్యేక హోదా సాధన సమితి కూడా పాల్గొనలేదు. వారికి కూడా సమాచారం ఇవ్వలేదన్న ఆగ్రహం కావచ్చు. ఇలా జగన్ కీలక అంశాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. మరోసారి ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు అన్ని పార్టీలనూ సంప్రదించాలని వారు కోరుతున్నారు. తలోదారిలో ఆందోళనలు చేసుకుంటూ వెళితే రాష్ట్రానికి ఒనగూరిదేమీ ఉండదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

No comments:
Write comments