అప్రమత్తమవుతున్న రాజకీయ పార్టీలు

 

అదిలాబాద్, జూలై 5, (globelmedianews.com)
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వెలువడుతున్న ముందస్తు ఎన్నికల సంకేతాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రధాన రాజకీయ పార్టీలన్ని ముందస్తుగానే అప్రమత్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ముందస్తు సంకేతాల నేపథ్యంలో తమ శ్రేణులను అలర్ట్ చేస్తూ సన్నాహకంపై సంసిద్దులు కావాలంటూ ఆదేశిస్తున్నాయని అంటున్నారు. అయితే ఈ ప్రధాన పార్టీలకు తోడుగా బిజెపి కూడా రాబోయే ఎన్నికలలో పట్టు నిలుపుకొనేందుకు ఇప్పటి నుంచే తమవంతు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. పార్టీ చేపట్టిన జన చైతన్య యాత్రతో శ్రేణులను ముందస్తుగానే కార్యోన్ముఖులను చేసేందుకు కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. ప్రధానమంత్రి మోడీ ఇమేజ్‌ను తనకు అనుకూలంగా మలుచుకొని ఈసారి ఎన్నికలలో ఉనికిని విస్తరించుకొనే దిశలో బిజెపి ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా ఉమ్మడి 10 అసెంబ్లీ స్థానాలను ఎలాగైనా ఈ సారి కూడా నిలుపుకోవాలని టిఆర్‌ఎస్ గట్టి పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. 
 
 
 
అప్రమత్తమవుతున్న రాజకీయ పార్టీలు
 
దీని కోసం గాను మంత్రులు, ఎంఎల్‌ఎలను టిఆర్‌ఎస్ అధిష్టానం అప్రమత్తం చేసినట్లు చెబుతున్నారు. నియోజకవర్గాల్లోనే ఎక్కువగా గడుపుతూ ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. దీనికి తోడుగా నెలకు 25 రోజులకు పైగా తమ తమ నియోజకవర్గాలకే పరిమితం కావాలని కూడా అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. అధిష్టానం ఆదేశాల మేరకు మంత్రులు జోగురామన్న, ఇంద్రకరణ్‌రెడ్డిలు తమ తమ నియోజకవర్గాలలోనే కాకుండా జిల్లా అంతటా కాలికి గజ్జె కట్టినట్లుగా పర్యటిస్తున్నారు. రాజధానిలో పనులేమైనా ఉంటే ఒకటి రెండు రోజుల్లోనే వాటిని ముగించుకొని మంత్రులిద్దరూ జిల్లాకే పరిమితమై పోతున్నారు. టీఆర్‌ఎస్ పకడ్బందీ ప్రణాళికతో నిరంతరం జనానికి చేరువయ్యే ప్రయత్నాలు చేస్తుండడం ఆ పార్టీ వ్యూహంలో భాగమేనని అంటున్నారు. ఇదిలాఉండగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తు ఎన్నికలపై వస్తున్న ఊహాగానాలతో తన శ్రేణులను ఆ దిశగా సంసిద్దులను చేస్తుంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జరిగిన డీసీసీ అధ్యక్షుల సమావేశం క్యాడెర్‌కు దిశానిర్దేశం చేసిందని అంటున్నారు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి నిర్మల్ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తూనే మిగితా సెగ్మెంట్లపై దృష్టి సారించడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆయా నియోజకవర్గాల పార్టీ సీనియర్ నాయకులందరినీ మహేశ్వర్‌రెడ్డి అప్రమత్తం చేస్తూ ముందస్తు కోసం సన్నద్దులు కావాలని సూచిస్తున్నారు. ఇలా అన్ని ప్రధాన పార్టీలు ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో తమ కేడర్‌ను ఆ దిశగా సిద్దం చేయడంలో నిమగ్నమయ్యారని అంటున్నారు

No comments:
Write comments