ఏపీలో కింగ్ మేకర్ గా కమలం

 

హైద్రాబాద్, జూలై 18 (globelmedianews.com)
రాష్ట్రంలో అంతంతమాత్రంగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం కొత్త రక్తాన్ని ఎక్కించింది. గత ఎన్నికల్లో అభ్యర్థుల కోసం వెతుకులాడిన బీజేపీ, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కింగ్‌మేకర్ కావాలని భావిస్తోంది. బీజేపీ, ఎన్డీయేతో టీపీపీ తెగతెంపులు చేసుకున్న తరువాత రాష్టానికి కొత్త అధ్యక్షునిగా వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర పెద్దల ఆదేశాలను, అమిత్‌షా రాజకీయాన్ని యథాతథంగా ఇక్కడ అమలు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏమాత్రం పట్టులేని బీజేపీ, 2019లో కాషాయ జెండా రెపరెపలను చూడాలని అధిష్ఠానం ఆశిస్తోంది.
 
 
 
  ఏపీలో కింగ్ మేకర్ గా కమలం
 
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన బీజేపీ, రెండు ఎంపీ సీట్లను, నాలుగు అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న సంకేతాలు బీజేపీ శ్రేణులకు అందాయి. దీంతో ఏపీలో 25 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలని నిర్ణయించుకుంది. వీటిలో 10కి పైగా అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకోవాలని చూస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల విషయంలో ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని పార్టీ అగ్రనేతలు తెలియచేశారు. పార్టీ ఇప్పటికే ఎంపిక చేసుకున్న 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి పార్టీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోబోతోంది. ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెప్పడంతోపాటు, కేంద్రం నుంచి అదనంగా నిధులు తెప్పించుకుని, అక్కడ బలీయమైన శక్తిగా ఎదగాలన్న ఆలోచనలో ఉంది. అలాగే రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన పథకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. నెలకు ఒక కేంద్ర మంత్రిని ఏపీకి తీసుకువచ్చి, ఆయా శాఖల ద్వారా ఏపీకి ఇచ్చిన నిధుల గురించి వివరించనున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరి, నడ్డా ఏపీలో పర్యటించి వెళ్లారు. త్వరలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాష్ట్రానికి రాబోతున్నారని పార్టీ వర్గాలు తెలియచేశాయి. అంతేకాదు, వచ్చే నెలలో బీజేపీ చీఫ్ అమిత్‌షా ఏపీకి వస్తున్నట్టు బీజేపీ నాయకులు తెలియచేశారు. అమిత్‌షా ఏపీ పర్యటన తరువాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని వారు తెలియచేశారు. షా పర్యటన తరువాత దేశమంతా ఏపీ రాజకీయాలవైపే చూస్తుందని పార్టీకి చెందిన కీలక నేత ఒకరు తెలియచేశారు.ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో పాల్గొన్న సభల్లో కేంద్రం, మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే, అక్కడికక్కడే కౌంటర్ ఇచ్చేందుకు కమలదళాన్ని సమాయత్తం చేస్తోంది.కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖలో గడ్కరీతో కలిసి ఒక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశ మందిరంలోకి బీజేపీ కార్యకర్తలు వ్యూహాత్మంగానే ముందుగా వెళ్లి, మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. మోడీ ప్లకార్డులను పదే పదే సీఎంకు చూపిస్తూ, ఆయనను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారు. ఇకపై కూడా ఇదే పంథాను అనుసరించాలని బీజేపీ నిర్ణయించింది. ఏపీకి కేంద్రం అన్యాయం చేసిందని చంద్రబాబు చెపుతున్న మాటల్లో వాస్తవం లేదని నిరూపించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని పార్టీ వర్గాలు అందించిన విశ్వసనీయ సమాచారాన్నిబట్టి తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా, తత్సమానంగా ఏపీకి ఎటువంటి మేలు చేశామన్న విషయాన్ని ప్రధాని మోదీ నోటితోనే చెప్పించాలని అధిష్ఠానం నిర్ణయించింది. అలాగే, రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీపై మోదీ త్వరలోనే కీలక ప్రకటన చేయనున్నారని కూడా పార్టీ వర్గాలు చెపుతున్నాయి.ఇక అధికార తెలుగుదేశం పార్టీని ఇరకాటంలో పెట్టేందుకు బీజేపీ మైండ్ గేమ్ కూడా ప్రారంభించినట్టు సమాచారం. ఇటీవల కేంద్ర మంత్రి అధవాలే మాట్లాడుతూ టీడీపీని తిరిగి ఎన్డీయేలో చేరమనడం, జగన్ వచ్చినా చేర్చుకుని ఆయనను సీఎంను చేస్తామని చెప్పడం అంతా మైండ్ గేమ్‌లోని భాగమేనని అంటున్నారు.

No comments:
Write comments