గులాబీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు

 

కరీంనగర్, జూలై 4, (globelmedianews.com)
 విపక్ష కౌన్సిలర్లను తమవైపు తిప్పుకుని మున్సిపాలిటీల్లో పాగా వేసిన టీఆర్ఎస్ కు  నాలుగేళ్ల తర్వాత వర్గపోరు రూపంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు పురపాలికల్లో అసమ్మతి వర్గాలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఛైర్‌పర్సన్లపై ఆవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు అవసరమైన నాలుగేళ్ల పాలన గడువు ముగిసింది. ఇన్నాళ్లూ సమయం కోసం  ఎదురుచూసిన అసమ్మతి కౌన్సిలర్లు  అదునుగా క్యాంపు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని భువనగిరి మున్సిపాలిటీలో ఇప్పటికే తీర్మానంపై సభ్యుల సంతకాల సేకరణ జరిగింది. నేడోరేపో తీర్మానాన్ని పాలనాధికారికి అందజేయనున్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీల్లోని అధికారపార్టీలోని అసమ్మతి కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ అంశంపై చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. అధ్యక్ష స్థానంపై ఆవిశ్వాసం ప్రతిపాదించడానికి కలిసి వచ్చే విపక్ష సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
 
 

గులాబీకి వ్యతిరేకంగా ఒక్కటవుతున్న విపక్షాలు
 
  ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే త్వరలో మూడు పురపాలికల్లోనూ వేడెక్కుతున్నాయి.సూర్యాపేట మున్సిపాలిటీలో అధికార పార్టీకి 22 మంది సభ్యులున్నారు. వీరిలో ఉపాధ్యక్షురాలితో కలిసి 12 మంది కౌన్సిలర్లు అసమ్మతివర్గంగా తయారయ్యారు. నిధుల కేటాయింపులో తమకు అన్యాయం జరుగుతోందని చెబుతూ.. గత బడ్జెట్‌ సమావేశాలకు డుమ్మా కొట్టారు. విపక్ష సభ్యుల సహకారంతో బడ్జెట్‌ ఆమోదం పొందింది. తర్వాత జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఇరువర్గాలను హైదరాబాద్‌కు పిలిపించి సర్దుకుపోవాలని సూచించారు. కౌన్సిల్‌ సమావేశం ఎజెండాను అధికార పార్టీ సభ్యుల సమక్షంలో చర్చించాలని సూచించారు. కానీ మంత్రి సూచనను పట్టించుకోలేదని గత నెల 30న జరిగిన కౌన్సిల్‌ సమావేశాన్ని 9 మంది అధికార పార్టీ కౌన్సిలర్లు బహిష్కరించారు. దీనిపై ఛైర్‌పర్సన్‌ వాదన మరోలా ఉంది. కొత్తగా నిధులు కేటాయింపులు లేకపోవడంతో వారితో సమావేశం నిర్వహించలేదని చెబుతున్నారు. గతంలో చేసిన పనులకు కౌన్సిల్‌ ఆమోదం తీసుకునేందుకు మాత్రమే సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ఘటనతో అప్పటి వరకు ఉన్న సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. పుర అధ్యక్షురాలిపై ఆవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు సమాయత్తమవుతున్నట్లు సమాచారం. జిల్లా మంత్రి స్థానికంగా లేకపోవడంతో ఆయన రాగానే విషయాన్ని వివరిస్తామని, తదుపరి పరిణామాలను బట్టి కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని వారు చెబుతున్నారు.హుజూర్‌నగర్‌ మున్సిపాలిటీలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు రెండు వర్గాలుగా విడిపోయారు. వీరి మధ్య ఆరు నెలలుగా వర్గపోరు నడుస్తుండగా..ఇటీవల తారస్థాయికి చేరింది. ఒక్క సీటు కూడా గెలుపొందని తెరాస విపక్షాల నుంచి వచ్చిన కౌన్సిలర్ల సాయంతో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకుంది. రెండు ప్రధాన పార్టీల నుంచి వచ్చిన ఇద్దరు చెరో రెండున్నర ఏళ్ల పాటు అధ్యక్ష పదవిలో ఉండాలని ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా 8 నెలల కిందట దొంతగాని శ్రీనివాస్‌ అధ్యక్ష పదవిని చేపట్టారు. ఇదే వర్గంలో అధ్యక్ష పదవిని ఆశించిన సంజీవరెడ్డికి ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి శ్రీనివాస్‌ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. సొంతంగా వెంచర్లు వేయడం, ఇది వరకు అభివృద్ధి పనులు జరిగిన చోటే మరో సారి నిధులు వెచ్చించడానికి ప్రయత్నించడం లాంటివి వెలుగు చూశాయి. వీటిని సంజీవరెడ్డి వర్గీయులు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ నిర్వహించిన ఆర్డీవో సైతం ఆయన అక్రమానికి పాల్పడ్డట్లు నివేదిక అందించారు. తదుపరి చర్యలు తీసుకునేందుకు పాలనాధికారి వద్ద ఆ దస్త్రం పరిశీలనలో ఉంది. దీని కోసం మరోవర్గం వేచిచూస్తోంది. నివేదిక రాని పక్షంలో ఆవిశ్వాసం పెట్టడానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. దీని కోసం అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

No comments:
Write comments