యూనివర్శిటీల్లో ప్రణాళికలకు బాబు ప్లాన్

 

గుంటూరు, జూలై 14, (globelmedianews.com)
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని యూనివర్సిటీలలో, యాత్ర చెయ్యటానికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెడీ అవుతున్నారు. వర్శిటీలో ఒక్కొక్క రోజున నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో తాను పాల్గొని 10 వేల మంది విద్యార్థులతో నేరుగా మాట్లాడుతానని ముఖ్యమంత్రి చెప్పారు. పాల్గొనే విద్యార్థులను వివిధ పోటీల ద్వారా ఎంపిక చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం, అమరావతి, ఇస్రో ప్రగతి, ఐటీ-ఐవోటీ, స్టార్టప్స్ వంటి అంశాలపై విద్యార్థులకు వర్క్‌షాప్ నిర్వహించాలని చెప్పారు. ఆయా విశ్వవిద్యాలయాలలో విద్యార్థులు కనుగొన్న నవీన ఆవిష్కరణలు, అవలంభిస్తున్న వినూత్న అభ్యాసాలపై అక్కడే ఒక ఎగ్జిబిషన్ నిర్వహించాలని కోరారు. సీఐఐ సహా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో ఆరోజు ఉదయం నుంచి వర్క్‌షాప్ నిర్వహించాలని చెప్పారు. ఫ్లిప్‌కార్ట్, వాల్ మార్ట్, అలీబాబా, టాటా, మహీంద్రా, ముఖేశ్ అంబానీ వంటి ప్రముఖుల్ని ఆహ్వానించి వారి ద్వారా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే నవతరానికి స్పూర్తినందించాలని అన్నారు. రాష్ట్రంలోని అన్ని కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ద్వారా యువతలో శక్తిని నింపి ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేయవచ్చునన్నారు. 
 
 
 
యూనివర్శిటీల్లో ప్రణాళికలకు బాబు ప్లాన్
 
ఈ కార్యక్రమ నిర్వహణ, సమన్వయ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నామని చెప్పారు. ఉన్నత విద్యామండలి, ఆయా వర్శిటీలే దీనికి అవసరమైన నిధులను సమకూర్చుకోవాలని నిర్దేశించారు.ప్రతిభా పురస్కార విజేతలు, కళాశాల, వర్శిటీ టాపర్లు, ‘చంద్రన్న ఉద్యోగ మేళ’లో కొలువులు సాధించిన యువతీ యువకులు, నవ్యావిష్కరణలతో రోల్‌మోడల్‌గా నిలిచిన విద్యార్థులు, క్రీడా, సాంస్కృతిక రంగాలలో పేరు ప్రఖ్యాతులు సాధించిన వారు ఈ ఈవెంట్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఈవెంట్ కోసం ప్రత్యేకంగా మొబైల్ అప్లికేషన్ ఒకదాన్ని రెండు, మూడు రోజులలో ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. ఈవెంట్ రిజిస్ట్రేషన్లన్నీ ఈ యాప్ ద్వారా జరుగుతాయని తెలిపారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఈనెల 18న శ్రీకాకుళం డాక్టర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం నుంచి ఈవెంట్ ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2న విజయనగరం జెఎన్‌టీయూలో, ఆగస్టు 17న విశాఖ ఏయూలో, ఆగస్టు 31న పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ హార్టీకల్చరల్ యూనివర్శిటీలో, సెప్టెంబరు 14న రాజమహేంద్రిలోని నన్నయ్య విశ్వవిద్యాలయంలో కార్యక్రమాలు జరుగుతాయి. సెప్టెంబరు 30న మచిలీపట్నం కృష్ణా వర్శిటీ, విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీలకు కలిపి, అక్టోబరు 12న గుంటూరు నాగార్జున, ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయాలకు కలిపి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మిగిలిన విశ్వవిద్యాలయాల్లో కూడా వరుసగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అవసరాన్ని బట్టి నిర్ణిత తేదీలలో మార్పులు జరుపుతారు.

No comments:
Write comments