కనీస వసతులకు దూరంగా కరీంనగరం

 

కరీంనగర్, జూలై 5, (globelmedianews.com)
స్మార్ట్‌నగరంగా చోటు దక్కించుకున్న కనీస వసతులు మృగ్యంగా మారాయి. మోకాలులోతు గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణిస్తుంటే నడుమునొప్పి వచ్చుడు ఖాయం. పాదచారులు నడవలేనంతగా రోడ్డుపైనే వాహనాల పార్కింగ్‌. వర్షం పడితే నీళ్లు వెళ్లలేని విధంగా డ్రెయినేజీలు. ఇదీ మొత్తంగా నగర పరిస్థితి.కమాన్‌చౌరస్తా నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీకి వెళ్లే దారిలో అడుగడుగునా గుంతలే దర్శనమిస్తాయి. హౌసింగ్‌బోర్డు, పాతబజార్‌ ప్రాంతాల నుంచి ఎక్కువశాతం విద్యార్థిని, విద్యార్థులు, విద్యాసంస్థలకు వెళ్లే వారు కమాన్‌చౌరస్తాకు వచ్చి బస్సులు, ఆటోలు ఎక్కాల్సిందే. అయితే మోకాలు లోతు గుంతలు పడడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు.ప్రతీ రోజు ఉదయం కమాన్‌చౌరస్తాలోని టిఫిన్‌సెంటర్ల వద్దకు వచ్చే వాహనాలు రోడ్డుపైనే నిలుపుతుండడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక సాయంత్రం వైన్స్, మిర్చీబజ్జి బండ్లు, కట్లీస్‌ బండ్ల వద్ద గుమిగూడే జనంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. ఇదే ప్రాంతంలో బాలికల వసతిగృహాలు ఉన్నాయి. వివిధ అవసరాలకు సాయంత్రం బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఆంధ్రాబ్యాంక్‌కు వచ్చే ఖాతాదారులు సైతం రోడ్డుపైనే వాహనాలు నడుపుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దీనిపై దృష్టిపెడితేనే జనం ఇబ్బందులు తీరేలా ఉన్నాయి.  కమాన్‌ నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీకి వెళ్లే రోడ్డుపై పెద్ద గుంతలుంటాయి. టిఫిన్‌సెంటర్లు, బ్యాంకు వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలుపుతుండడంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రమైతే ఈ రోడ్డుపై మహిళలు వచ్చేందుకు జంకుతున్నారు.   కనీస వసతులకు దూరంగా కరీంనగరం

No comments:
Write comments