స్కూళ్లలో అటకెక్కిన కంప్యూటర్ స్టడీస్

 

అదిలాబాద్, జూలై 5, (globelmedianews.com)
కంప్యూటర్‌ ఆధారిత విద్యాబోధన కోసం లక్షలాది రూపాయలు వెచ్చించి సర్యశిక్షా అభియాన్‌ ఆధ్వర్యంలో ఒక్కో పాఠశాలకు 10 నుంచి 12 చొప్పన కంప్యూటర్లు అందజేశారు. ప్రింటర్, యూపీఎస్‌లను సైతం సమకూర్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్‌  విద్యావిధానం ఆటకెక్కింది. ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కాంట్రాక్టు సంస్థల గడువు ముగియడంతో పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి. వీటి సాయంతో తెలుగు, గణితం, ఇంగ్లిష్, పరిసరాల విజ్ఞానం పాఠాలు సులభమైన రీతిలో ఆడియో, వీడియో ద్వారా బోధించేవారు. విద్యార్థులకు నెలవారీ పరీక్షలు కూడా నిర్వహించేవారు.ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన కాంట్రాక్టు సంస్థల గడువు ముగియడంతో పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి. 
 
 
 
స్కూళ్లలో  అటకెక్కిన కంప్యూటర్ స్టడీస్
 
దీంతో సర్కార్‌ బడుల్లో చదివే పేద విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందకుండా పోయింది. 2008లో అప్పటి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కంప్యూటర్‌ విద్యా విధానాన్ని ప్రవేశ పెట్టారు.ఐదేళ్లపాటు కంప్యూటర్‌ విద్యాబోధన చేసేందుకు జిల్లాలో హెడ్‌కామ్‌ అనే ప్రైవేట్‌ సంస్థలకు నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఒక్కో పాఠశాలలకు ఇద్దరు చొప్పన బోధకులను నియమించారు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అందడంతో పాటు ఫ్యాకల్టీలు ఉపాధి పొందేవారు. వీరందరినీ తొలగించడంతో ఉపాధి కోల్పోగా, విద్యార్థులు పూర్తి స్థాయిలో కంప్యూటర్‌ విద్యకు దూరమయ్యారు.జిల్లాలో 173 ఉన్నత పాఠశాలలు, 102 ప్రాథమికోన్నత పాఠశాలలున్నాయి. ఇందులో 43 ప్రాథమిక పాఠశాలల్లో, 48 ఉన్నత పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యా విధానం అమలులో ఉంది. వీటిలో పనిచేసే 182 మందిని తొలగించడంతో కంప్యూటర్‌ పరిజ్ఞా నం ఉన్న ఉపాధ్యాయుల చేత కంప్యూటర్‌ విద్యావిధానాన్ని కొనసాగించాలని అధికారులు భావించారు. అయితే సరైన శిక్షణ లేకపోవడం, అవగాహన కొరవడంతో జిల్లాలోని అన్ని పాఠశాలల్లో కంప్యూటర్లు మూలనపడ్డాయి. కంప్యూటర్‌ విద్య అటకెక్కడంతో లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన కంప్యూటర్లు, జనరేటర్లు మూలనపడ్డాయి. మూడు సంవత్సరాలు గడుస్తున్నా విద్యాశాఖ అధికారులు గానీ, ప్రభ్వుత్వం పట్టించుకోక పోవడంతో విద్యార్థులు కంప్యూటర్‌ విద్యకు దూరమవుతున్నారు. కంప్యూటర్‌ బోధకులను నియమిస్తే గానీ కంప్యూటర్‌ ఆధారిత విద్య అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. దీనిని పునరుద్ధరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణులు కోరుతున్నారు.

No comments:
Write comments