హస్తం బలపడేనా.. ?

 

ఏలూరు, జూలై 20 (globelmedianews.com): 
అనివార్య కారణాలతో కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లో మనుగడ సాగిస్తున్న నేతల కోసం తాజాగా కాంగ్రెస్‌ గురిపెట్టింది. సొంత ఇంటికి తిరిగి రావాల్సిందిగా అభ్యర్థనలు ప్రారంభించింది. మీ నాయకత్వానికి ఎలాంటి లోటు రానివ్వం.. పార్టీని బలపడేలా చేద్దాం.. నియోజకవర్గాల వారీగా మన సత్తా ఏపాటిదో నిరూపించుకుందా మంటూ గడచిన 15 రోజులుగా సీనియర్ల నుంచి వర్తమానాలు అందుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనకు ఇక్కడ ప్రత్యేకించి కొంత కేడర్‌ ఏర్పాటైంది. అప్పట్లో సమైక్యాంధ్ర పార్టీ ఏర్పాటు చేసిన తరుణంలో కూడా ఇదే కేడర్‌ అప్పట్లో కిరణ్‌క మద్ధతుగా నిలిచింది. కాంగ్రెస్‌ తాజా పరిణామాలపై ఇప్పుడు మిగతా పార్టీలు కూడా దృష్టిపెట్టాయి.
 
 
 
 హస్తం బలపడేనా.. ?
 
సాధారణంగా 2014లో జరిగిన ఎన్నికలు ఒక సంక్లిష్ట మైనవి, కాంగ్రెస్‌ను పూర్తిగా వ్యతిరేకించిన రోజులవి. దీనికి కారణం సున్నిత అంశాల్లో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలే కారణమని ఊహించింది ఒకటి, జరిగింది ఇంకొ కటి అని ఇప్పటికీ సీనియర్లు చెబుతారు. కాని వాస్తవానికి కాంగ్రెస్‌ పార్టీ ఎన్నడూ ఈ స్థాయిలో ఉమ్మడి రాష్ట్రంలో దెబ్బతినలేదని, కేడర్‌ను కోల్పోలేదని, నాయకులను చేజార్చుకోలేదని, అలాంటి విషమ పరిస్థితిని తొలిసారిగా పార్టీ భరించగలిగిందని కొందరు చెబుతున్నారు. దాదాపు 15 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన కేడర్‌ ఇప్పటికీ ఉంది.
మూడు రంగుల జెండా తప్ప, మరో జెండా వీరికి తెలియనే తెలియదు. అంత పక్తుగా కాంగ్రెస్‌కు మద్ధతు తెలిపేవారు. ఇప్పటి తాజా రాజకీయాల్లో తిరిగి పుంజుకోవడానికి కాంగ్రెస్‌ సర్వశక్తులు కేంద్రీకరించబోతోంది. పరిస్థితిని ఓట్ల బ్యాంకులో రుజువు చేసుకోవాలన్న తపన ఇప్పటికే పార్టీలో మిగిలి ఉన్న నేతలు భావిస్తున్నారు. అందున మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డికి పార్టీలో కీలక పదవి లభించే అవకాశం ఉందని, ప్రస్తుత పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి మీద కంటే కిరణ్‌ మీదే కొందరికి ఇప్పటికీ మక్కువ ఉందని, సమైక్యాంధ్రకు కట్టుబడి, కీలక పదవిని తృణప్రాయంగా వదిలేశారన్న సానుభూతి లేకపోలేదని మరో అంచనా.
కాంగ్రెస్‌లో మిగిలింది ఎవరు
కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేసేందుకు జిల్లా స్థాయిలో మిగిలిన నేతలు ఎవరంటే పట్టుమని అరడజను మంది కూడా లేరు. 2014కు ముందే చాలామంది కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు. దానికి కారణం అప్పట్లో వైసీపీ పేరిట పార్టీని జగన్‌ స్థాపించడమే. వై.ఎస్‌ రాజశేఖరరెడ్డి మీద ఉన్న అభిమానంతో కొందరు నాయ కులు, కార్యకర్తలు వైసీపీ జెండా అందుకున్నారు. కానీ ఈ విషయం ముందుగానే గమనించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం కూడా చూసీ చూడనట్టు వదిలివేసింది. దాంతో పార్టీలో కొంత భాగం ఖాళీ కావాల్సి వచ్చింది. ప్రస్తుతానికి పార్టీ పరంగా నమ్ముకుని వ్యవహరిస్తున్న నేతల్లో మాజీ ఎంపీ కనుమూరి బాపిరాజు, మాజీ మంత్రి వట్టి వసంత కుమార్‌, సీనియర్‌ నేత కరాటం రాంబాబు వంటి ముఖ్యులు మాత్రమే నేటికీ కాంగ్రెస్‌లో కనిపిస్తున్నారు.
వీరుకాక మిగతా వారంతా వైసీపీలోను, టీడీపీలోనూ సర్దుకున్నారు. వీరిలో కొందరు మాజీ ఎమ్మెల్యేలుగా మిగిలిపోతే, మరి కొందరు మాత్రం ఇప్పటికీ సిట్టింగ్‌లుగా ఇతర పార్టీల్లో కనిపిస్తున్నారు. ఇప్పుడు అలాంటి వారి కోసమే కాంగ్రెస్‌ ఎత్తుగడ వేసింది. సొంత ఇంటికి రండి అంటూ కొత్త పల్లవి అందుకుంది. దీనికి తగ్గట్టుగానే తొలుత మాజీ సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంలో విజయం సాధించారని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి.కానీ జిల్లాకు వచ్చేసరికి అంత పట్టుకలిగిన, స్తోమత కలిగిన నేతలు ఎవరూ లేరు. పార్టీ ఇచ్చిన పిలుపునకు, లేదా కిరణ్‌కుమార్‌ ఇచ్చిన పిలుపుకుగాని స్పందించి ముందుకు వెళ్ళే నాయకత్వం లేనేలేదు. కానీ వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్‌ కాస్తంత ధైర్యంగానే పావులు కదుపుతోంది. ఒక దశలో కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎంగా వ్యవహరిస్తున్న తరుణంలో ఇదే జిల్లాకు చెందిన పితాని సత్యనారాయణ ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. కానీ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, సమైక్యాంధ్ర పార్టీని స్థాపించే నాటికే పితాని తెలుగుదేశంలో చేరారు. అప్పట్లో కిరణ్‌తో పితానికి ఉన్న సాన్నిహిత్యం అంతా ఇంతా కాదు. ఒకానొక దశలో నెంబర్‌-2గా ఆయన మంత్రివర్గంలో వెలిగి పోయారు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా కిరణ్‌ వెన్నంటే కొన్నాళ్ళ పాటు పితాని అనుసరించారు. 2014 ఎన్నికలకు ముందు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కిరణ్‌ చేతిని వదిలేసి చంద్రబాబు చెంతకు చేరారు. అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా కొందరు వైసీపీ పక్షాన మొగ్గు చూపారు. కానీ వీరిలో జంగారెడ్డిగూడెంకు చెందిన నేత జెట్టి గురునాధరావు మాత్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా కిరణ్‌తో సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తున్నారు.
ఇటీవల ఆయన కిరణ్‌కుమార్‌ రెడ్డితో భేటీ అయ్యారు. ఇలాంటి సందర్భంలో పశ్చిమ రాజకీయాల ప్రస్తావన వీరిద్దరి మధ్య చోటు చేసుకుంది. పార్టీకి పూర్వవైభవం తీసుకు రావాలంటే బయటకు వెళ్ళిన వారంతా తిరిగి రావాల్సి ఉందని కిరణ్‌ అభిప్రాయపడ్డారని గురునాధరావు వెల్లడించారు. రిజర్వుడు నియోజకవర్గాల్లో కేడర్‌ను అంటిపెట్టుకుని, ఒక పెద్ద దిక్కుగా వ్యవహరించిన వారిలో, అదికూడా ఏజెన్సీలో గురునాధరావు ఒకరు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ దూకుడును బట్టి రాజకీయాల్లో చేరికలు ఉంటాయి. లేదంటే అత్యల్పంగానే ఉన్న కేడర్‌తోనే మిగతా పార్టీలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం కావాల్సి ఉంది.

No comments:
Write comments