దళారుల ఎంట్రీ

 

కరీంనగర్, జూలై 2 (globelmedianews.com):
 మత్స్యకారులకు 75 శాతం రాయితీపై వాహనాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.. ఇప్పటికే భారీగా దరఖాస్తులు రాగా.. దళారులు మేం వాహనాలను ఇప్పిస్తామంటూ రంగంలోకి దిగారు.. అధికారులపై ఒత్తిడి చేస్తామని, వాహనాలను ఇప్పిస్తామని చెప్పి వలలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. జులై నెలాఖరులో ఎంపిక జరగనుంది. ముందస్తు చర్యలు చేపట్టకపోతే మత్స్యకారుల నుంచి పెద్దఎత్తున డబ్బులు దండుకునే అవకాశం ఉంది. మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని విధాలా సదుపాయాలు కల్పించి పైకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే ఉచితంగా చేప పిల్లలను చెరువులు, జలాశయాల్లో వేసి పట్టుకొని అమ్ముకునే అవకాశం కల్పించారు. అలాగే చేపలను నిల్వ చేయడం, వలలు, ఇతర వస్తువుల సరఫరా, గ్రామాల్లో తిరిగి అమ్ముకునేందుకు ద్విచక్రవాహనాలు, పట్టణాలకు సరఫరా చేసేందుకు ట్రాలీ ఆటోలు, ఇతర వాహనాలను 75 శాతం రాయితీపై సరఫరా చేయనున్నారు. కొన్నింటికి వంద శాతం రాయితీ ఇస్తున్నారు. వీటికి భారీగా దరఖాస్తులు వచ్చాయి.
దళారుల ఎంట్రీ 
జాతీయ సహకార అభివృద్ధి సంస్థ 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను కలుపుకొని జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో 31 రకాల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. చేపలు పట్టడం మొదలుకొని విక్రయించుకునే వరకు అవసరమైన వస్తువులు, వాహనాలను 100 శాతం, 75 శాతం రాయితీపై సమకూర్చుతారు. గతేడాది నిధులు కేటాయించినప్పటికీ కార్యక్రమం అమలులో జాప్యం జరగడంతో ఈ ఏడాది ప్రత్యేక దృష్టిసారించారు. పథకం గురించి మత్స్యకారులకు అవగాహన కల్పించేందుకు రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో రాష్ట్ర శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహించారు.  31 రకాల సౌకర్యాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయి పరిశీలనలో ఉంది.
జిల్లాలోని అన్ని మండలాల పరిధిలో ఆన్‌లైన్‌ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి జిల్లా మత్స్యశాఖ దరఖాస్తులు స్వీకరించింది. 31 రకాల సౌకర్యాలకు 6,560 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో మోపెడ్ లు , ట్రాలీ ఆటోలకు అత్యధికంగా ఉన్నాయి. వీటికి సంబంధించిన వాటిలో దరఖాస్తుదారుల అర్హతలపై అధికారులు పరిశీలన నిర్వహిస్తున్నారు. నెలాఖరులోగా పరిశీలన పూర్తి చేసి వచ్చే నెలలో ఎంపిక చేసి యూనిట్లు మంజూరు చేస్తారు. భారీగా దరఖాస్తులు వచ్చినందున లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు జిల్లా స్థాయిలో పాలనాధికారి అధ్యక్షతన సంయుక్త పాలనాధికారి, జిల్లా మత్స్యకార సంస్థ ఛైర్మన్‌, ఆ శాఖ సహాయ సంచాలకులు సభ్యులుగా ఉంటారు. వీరి ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎక్కువ దరఖాస్తులు ఉంటే లాటరీ పద్ధతిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
మోపెడ్, ఆటో ట్రాలీల విషయానికి వస్తే 75 శాతం రాయితీపై సరఫరా చేయనున్నారు. ద్విచక్రవాహనంలో టీవీఎస్‌ ఎక్స్ఎల్ వాహనం విలువ రూ.50 వేలుగా నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారు రూ.12,500 చెల్లిస్తే మిగతా మొత్తం రూ.37,500 రాయితీ రూపంలో ఇస్తారు. అలాగే ఆటో ట్రాలీకి యూనిట్‌ విలువ రూ.5 లక్షలు నిర్ణయించారు. ఇందులో లబ్ధిదారు రూ.1,25,000 చెల్లిస్తే మిగిలిన రూ.3,75,000 రాయితీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తోంది. రాయితీ లక్షలు, వేలల్లో ఉండటం, దరఖాస్తులు భారీగా రావడంతో గ్రామాల్లో, జిల్లాల్లో కొందరు దళారులు రంగంలోకి దిగి మత్స్యకారులకు వాహనాలు ఇప్పిస్తామని వసూళ్ల కార్యక్రమం మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ విషయంలో అధికార పైరవీలు కూడా మొదలైనట్లు తెలిసింది. ప్రభుత్వం పెద్దమొత్తంలో రాయితీ ఇస్తున్నందున అందినంత దండుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది.

No comments:
Write comments