బదీలీలకు విద్యార్థులు బలి..

 

హైదరాబాద్, జూలై 20 (globelmedianews.com): 
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ రాజధానిలోని కొన్ని ప్రభుత్వ బడులకు కొత్త కష్టాల్ని తెచ్చిపెట్టింది. ఇప్పటివరకు ఆయా పాఠశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లిపోగా.. కొత్తగా వచ్చేవారు లేక వాటి భవితవ్యం ప్రశ్నార్థకంలో పడింది. వందల సంఖ్యలో విద్యార్థులున్న స్కూళ్లూ ఉపాధ్యాయులు లేనివిగా మిగిలిపోయే ప్రమాదం నెలకొంది. తాజా పరిణామాల నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉండి  ఉపాధ్యాయులు లేకపోవడం.. మరికొన్ని చోట్ల అవసరానికి మించి బదిలీపై రావడం చర్చనీయాంశంగా మారింది.  ఈ తీరుతో సర్కారీ బడుల వ్యవస్థ గాడి తప్పనుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
 
 
 
  బదీలీలకు విద్యార్థులు బలి..
 
ఖైరతాబాద్‌ మండలంలోని ఎన్‌బీటీ నగర్‌ ప్రాథమిక పాఠశాల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇక్కడ 680 మంది విద్యార్థులున్నారు. ఇంతకాలం ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేయగా.. తాజా బదిలీల్లో అందరూ వేరే పాఠశాలలకు వెళ్లిపోయారు. కొత్తగా ఒక్కరూ ఈ పాఠశాలను ఎంపిక చేసుకోలేదు.  దీంతో బదిలీ అయిన ముగ్గురిలో ఒకరిని ఆపివేయాలని అధికారులు భావిస్తున్నారు. అసలే విద్యార్థులు లేక బడులు రోజురోజుకు చిక్కిశల్యమవుతున్న తరుణంలో.. ఇంత పెద్దసంఖ్యలో విద్యార్థులున్న పాఠశాల బోధకులు లేక మూతపడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి ఇంకా పలు పాఠశాలల్లో ఉండటం గమనార్హం. కొన్నిచోట్ల అవసరమైన సంఖ్య కంటే ఎక్కువగా ఉపాధ్యాయులు వచ్చి చేరారు. సికింద్రాబాద్‌ మండలంలోని ఓ ప్రాథమిక పాఠశాలలో 30 మంది విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులున్నారు. మారేడుపల్లిలో 50 మందికి అయిదుగురు కొలువుదీరారు. రేషనలైజేషన్‌ చేయకుండా బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించడం వల్లే ఈ దుస్థితి ఉత్పన్నమైందనే అభిప్రాయాలున్నాయి. 2015లో చివరిసారిగా రేషనలైజేషన్‌ చేపట్టారు. తర్వాతి మూడేళ్ల కాలంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యలో చాలా మార్పులొచ్చాయి. అప్పటి సంఖ్యనే ప్రామాణికంగా తీసుకొని తాజా బదిలీలు చేయడం ఈ పరిణామాలకు కారణంగా చెబుతున్నారు.
ప్రభుత్వ బడుల్లో సదుపాయాల పరంగా ఖైరతాబాద్‌ రాజ్‌భవన్‌ పాఠశాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని రీతిలో సౌకర్యాల్ని కల్పించడంతో ప్రవేశాలు పోటెత్తాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో కలిపి 1200 పైచిలుకు విద్యార్థులు ఉన్నారు. కానీ ఉపాధ్యాయుల సంఖ్యను పరిశీలిస్తే నోరెళ్లబెట్టక తప్పదు. ఉన్నత పాఠశాలలో 650 మందికి 8 మంది మిగిలారు.  మరో 16 మంది అవసరం. ప్రాథమిక పాఠశాల పరిస్థితి మరీ దయనీయం. 620 మంది విద్యార్థులకు కేవలం ఒక్క ప్రధానోపాధ్యాయురాలు మిగిలిపోయారు. 20 మంది అవసరముంది. విద్యావలంటీర్లతో ఖాళీలు భర్తీ చేసుకునే వెసులుబాటు ఉన్నా.. సమర్థమైన బోధన అత్యాశే అవుతుందని నిపుణులు అంటున్నారు.
ఉన్నతస్థాయి పర్యవేక్షణ ఉండటంతో... అధునాతన సదుపాయాలతో అలరారుతున్న రాజ్‌భవన్‌ పాఠశాలను బదిలీల సమయంలో ఉపాధ్యాయులు ఎంపిక చేసుకోకపోవడం విచిత్రంగానే అనిపిస్తోంది. అందుకు కారణాలను విశ్లేషిస్తే విస్తుపోయే అంశాలు వెలుగుచూస్తున్నాయి. ఈ విద్యాలయంపై ఉన్నతస్థాయి పర్యవేక్షణ అధికం కావడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత ఏడాదే కొత్త భవనంలో కొలువుదీరిన ఈ స్కూలులో పదో తరగతి ఉత్తీర్ణత మెరుగ్గా ఉండాలని గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. దీంతో కలెక్టర్‌ యోగితారాణా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పలు దఫాలుగా ఉపాధ్యాయులతో సమీక్షలు నిర్వహించారు. ఈ విషయంలో కలెక్టర్‌ వైఖరిపై ఉపాధ్యాయులు ఓమారు ఆందోళన సైతం నిర్వహించారు. ఈ పరిస్థితులతోనే ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చేందుకు వెనకడుగు వేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

No comments:
Write comments