నకిలీపై నిర్లక్ష్యం

 

నిజామాబాద్, జూలై 2 (globelmedianews.com)
విత్తు మంచిదైతేనే పంట పండుతుంది. లేదంటే మొలకరాక, మొలిచినా పూత లేక, గింజ రాక పెట్టుబడులు కూడా దక్కలేదని గగ్గోలు పెట్టే రైతన్నల బాధలు మళ్లీ పునరావృతమవుతాయి. ప్రభుత్వ ఉదాసీనత, అధికారుల అలసత్వం, రైతుల అమాయకత్వం.. విత్తన వ్యాపారులను బరితెగించేలా చేస్తోంది. ఖరీఫ్‌ సీజన్‌ ఉపందుకోవడంతో నకిలీలు, కల్తీలు రంగ ప్రవేశం చేస్తున్నాయి. మారుమూల ప్రాంతాలు, పల్లెలను లక్ష్యంగా చేసుకొని అన్నదాతలకు అంటగడుతున్నారు. జిల్లాలో వందలాదిగా ఎటువంటి అనుమతులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తున్నా సంబంధిత యంత్రాంగానికి చీమకుట్టినట్లైన లేదు. తనిఖీలకు ప్రత్యేక బృందాలున్నా వాటిని అడ్డుకోవడంలో ఏమాత్రం చొరవ తీసుకోకపోవడం అక్రమార్కులకు కలిసివస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే నాలుగైదు రోజులు హడావుడి చేసే అధికారులు మళ్లీ ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.
 
 
 
నకిలీపై నిర్లక్ష్యం 
 
ప్రభుత్వం రాయితీ ద్వారా వరి, సోయా, మొక్కజొన్న, పప్పుదినుసుల విత్తనాలను అందిస్తోంది. అయితే ఇందులో చాలా కంపెనీలవి మొలక సరిగా రావడం లేదని రైతులు వీటి జోలికి పోవడం లేదు. అంతేకాకుండా కొన్నింటికి బయట మార్కెట్‌తో పొలిస్తే సరాసరి ధర ఉండడంతో ప్రైవేటు దుకాణాలపై ఆధారపడుతున్నారు. దీనినే కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకునే పనిలోపడ్డారు. విత్తనాలు, బయో ఫర్టిలైజర్‌ పేరుతో సర్టిఫైడ్‌, ట్రూత్‌పూల్‌ లేబుళ్లు, కొన్నింటికి కంపెనీ చిరునామా లేకుండానే ధరలు ముద్రించి అమ్మేస్తున్నారు.
విక్రయ దుకాణాలనేసరికి యంత్రాంగం జిల్లా, మండల కేంద్రాలపైనే దృష్టి పెడుతోంది. కానీ ఇప్పుడు వ్యాపారులు తమ పంథాను మార్చారు. రైతులు ఎక్కువగా ఉండే పల్లెలనే లక్ష్యంగా చేసుకుంటున్నారు. గ్రామంలో పలుకుబడి ఉన్న పెద్ద రైతులు, వ్యాపారంపై ఆసక్తి ఉన్న యువకులను చేరదీసి వారికి ముందుగా సరఫరా చేసి, వారితో సరకును అమ్మించిన తర్వాతే లెక్క చూసుకుంటున్నారు. జిల్లాలో 430 వరకు లైసెన్సు దుకాణాలుండగా అనధికారికంగా ఓ వేయి దుకాణాలున్నట్లు అంచనా. ఊరూరా విత్తనాలు, బయో ఫర్టిలైజర్స్‌ పెట్టి అమ్మేస్తున్నా అడిగే నాథుడు లేకుండాపోయారు.
కొన్ని ప్రైవేటు సంస్థలు అనధికారికంగానే గ్రామాల్లో విత్తనోత్పత్తి చేయిస్తున్నాయి. రైతుల నుంచి సేకరించుకుని వాటిని ప్రాసెసింగ్‌ కేంద్రాల్లో శుద్ధి చేయించి, ఆకర్షణీయమైన బస్తాల్లో నింపి విక్రయాలు జరుపుతున్నారు. వాటిని పండించిన రైతులకే తిరిగి విక్రయిస్తున్నారు. కొందరు తాము పండించిన వాటినే సంచుల్లో నింపి దర్జాగా దండుకుంటున్నారు. వాటికి బహుళజాతి సంస్థల పేర్లు పెడుతున్నారు. ఇవి మొలకలు రానప్పుడు, పంట దిగుబడి లేనప్పుడు ఎలాంటి బిల్లులు రైతుల వద్ద లేకపోవడంతో చేసేదేమిలేక నిట్టూరుస్తున్నారు.
వ్యవసాయశాఖ అనుమతి లేకుండా విత్తనాలు, ఎరువులు సరఫరా అవుతున్నాయని తెలిసినా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడడం లేదు. గ్రామస్థాయిలో పటిష్టమైన వ్యవస్థ ఉండాలని ప్రభుత్వం విస్తీర్ణాధికారులను నియమించినా పర్యవేక్షణ లేకుండాపోయింది. ఏ గ్రామంలో ఎన్ని దుకాణాలు నిర్వహిస్తున్నారనేది మండలస్థాయి సిబ్బందికి సమాచారం ఉన్నా వాటిని నిలువరించడంలో చొరవ చూపడం లేదు. చాలా మంది లైసెన్సుల కోసం డీడీలు చెల్లించి తనిఖీలకు వచ్చినప్పుడు వాటిని చూపించి తప్పించుకుంటున్నారు. కనీసం ఎంత సరుకు వచ్చింది? ఎంత అమ్మిందనే దానిపై రిజిస్టర్లు కూడా నిర్వహించకుండానే దర్జాగా వ్యవహారం నడిపిస్తున్నారు. తనిఖీలకు వచ్చినప్పుడు దుకాణాలు మూసుకుని ఫలాయనమవుతున్నారు.
విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరాలో నాణ్యత పాటించడం లేదని, నకిలీ కంపెనీలతో రైతులు నష్టపోతున్నారని గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో టార్స్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్ర, జిల్లా స్థాయి ఎన్స్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీ బృందాలు కాకుండా డివిజన్‌, మండల స్థాయిలో సైతం వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్‌శాఖలను రంగంలోకి దించింది. ఇక తూనికలు, కొలతల శాఖ, వాణిజ్య పన్నుల శాఖ, విత్తన ధ్రువీకరణ బృందాలు ఉన్నా నకిలీలను నిలువరించడంలో, అక్రమాలను గుర్తించడంలో పెద్దగా పురోగతి కనిపించడం లేదు.

No comments:
Write comments