15 కు కమల్ విశ్వరూపం

 

చెన్నై, ఆగస్టు 9  (globelmedianews.com)
విశ్వనటుడు కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘విశ్వరూపం 2’ వాయిదాపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం. కరుణానిధి మృతితో తమిళనాడులో విషాదఛాయలు అలముకున్నాయి. రాజకీయ నాయకుడిగానే కాకుండా కోలీవుడ్‌తో ప్రత్యేక అనుబంధం ఉన్న కరుణానిధి 70పైగా సినిమాలకు కథ, సంభాషణలు అందించారు. సుదీర్ఘకాలం అనేక సినిమాలకు రచయితగా పనిచేసిన ఈయన మృతికి తమిళ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇప్పటికే ఆయన మృతికి సంఘీభావంగా రెండు రోజుల పాటు సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండటంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏడురోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. దీంతో ‘విశ్వరూపం 2’ ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శించేందుకు అవకాశం లేదు.
 
 
 
15 కు కమల్ విశ్వరూపం
 
 దీంతో ఆగష్టు 10న విడుదల కావాల్సిన ‘విశ్వరూపం 2’ వాయిదా వేయాలని కమల్‌ నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీషు భాషల్లో నిర్మించిన ఈ చిత్రాన్ని తిరిగి ఆగష్టు 15న విడుదల చేయాలన్న ఆలోచనలో కమల్‌ ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక సమాచారం రావాల్సిఉంది. ఇదిలాఉంటే.. బుధవారం ఉదయం కరుణానిధి భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన కమల్‌ హాసన్‌ ట్విట్టర్ ద్వారా ఎమోషనల్ ట్వీట్ చేశారు. కాగా ఇటీవల తమిళనాడులో క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కమల్‌ హాసన్ రాజకీయ కురువృద్ధుడు కరుణానిధి నివాసానికి వెళ్లి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంలో అవసరమైనప్పుడు డీఎంకేతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చారు కమల్.

No comments:
Write comments