20 మందికి టెన్షన్

 

విజయవాడ, ఆగస్టు 24, (globelmedianews.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మరోసారి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. అన్ని పార్టీల వలే కాకుండా అభివృద్ధి చేసి ఓటర్ల వద్దకు వెళ్లాలనుకుంటున్నారు. అందుకోసం రోజులో ఎక్కువ భాగం రాష్ట్రాభివృద్ధికే కేటాయిస్తున్నారు. ఒకవైపు రాజధాని నిర్మాణం.. మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఆయన.. వాటిని పూర్తి చేసేందుకు నిరంతరం పని చేస్తూనే ఉన్నారు. దీనికి తోడు పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కారణంగా ఆయన ప్రస్తుతం పార్టీపైనే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో కూడా ఈ సారి విజయబావుటా ఎగురవేయాలని పరితపిస్తున్న టీడీపీ అధినేత.. ఆయా స్థానాలను టార్గెట్ చేశారు. ప్రస్తుతం ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీని గెలిపించడానికి అక్కడి నేతలను సమాయత్తం చేస్తున్నారు. 
 
 
 
 20 మందికి టెన్షన్
 
ఇప్పటికే పలు స్థానాల్లో టీడీపీ నేతలు పట్టు సాధించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో అక్కడ టీడీపీనే గెలుస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారట.వీటితో పాటు మరికొన్ని స్థానాల్లో విజయం సాధించడం కోసం చంద్రబాబు ఓ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది తెలిసినప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలలోని కొందరు తెగ భయపడిపోతున్నారని సమాచారం. వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న కొందరికి టికెట్లు ఇచ్చే అవకాశం లేదనేది ఈ ప్రచారానికి సంబంధించిన సారాంశం. చంద్రబాబు కొద్దిరోజుల క్రితం చేయించిన సర్వేలో ప్రతికూల ఫలితాలు వచ్చిన ఎమ్మెల్యేలలో దాదాపు 20 మందికి ఈ సారి టికెట్ ఇవ్వరని టీడీపీలో చర్చ జరుగుతోందట. అలాగే గత ఎన్నికల్లో ఓడిపోయిన చోట కూడా అప్పుడు పోటీకి నిలబెట్టిన మరో 20 మందికి ఈ సారి మొండిచేయి చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. వారి స్థానాల్లో నియోజకవర్గాల్లో చురుకుగా పని చేస్తున్న ఇన్‌చార్జీలు, పలువురు నేతల పేర్లను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల అభ్యర్ధుల విషయంలో ముందస్తుగా తొలి జాబితా విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. ఈ జాబితాలోని కొత్త వారి పేర్లను ప్రకటించనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీలోని కొందరు నేతలు కూడా దీనిని బహిరంగంగానే చెబుతుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారని వినికిడి.

No comments:
Write comments