28న స్టాలిన్ పట్టాభిషేకం...

 

చెన్నై, ఆగస్టు 23 (globelmedianews.com)
తమిళనాడులో డీఎంకే అధినేతగా స్టాలిన్ పట్టాభిషేకానికి సర్వం సిద్ధమయింది. ఇందుకు ముహూర్తాన్ని ఈ నెల 28వ తేదీగా నిర్ణయించారు. మరో ఐదు రోజులే స్టాలిన్ డీఎంకే అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలను చేపట్టబోతున్నారు. ఇందుకు సంబంధించి అన్ని కార్యక్రమాలు వడివడిగా చేపడుతున్నారు. అదే రోజు జరిగే పార్టీ కార్యవర్గ సమావేశంలో స్టాలిన్ ఎన్నిక లాంఛనప్రాయమేనంటున్నారు. ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ కార్యవర్గ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అందరికీ ఆహ్వానాలు పంపారు. ప్రస్తుతం స్టాలిన్ డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ట్రెజరర్ బాధ్యలను కూడా స్టాలిన్ మాత్రమే చూస్తున్నారు. అయితే కోశాధికారిగా తనకు నమ్మకమైన వ్యక్తిని నియమించుకోవాలని స్టాలిన్ భావిస్తున్నారు.తనకు అత్యంత నమ్మకంగా ఉన్న మాజీ కేంద్రమంత్రి ఎ. రాజాను స్టాలిన్ కోశాధికారిగా నియమించ వచ్చన్న ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. 

28న స్టాలిన్ పట్టాభిషేకం...
ఎ.రాజా పేరునే దాదాపు ఖరారు చేసే అవకాశముందని తెలుస్తోంది. అయితే ఈ పదవిని ఆళగిరి కోరుకుంటున్నారు. తనకు గాని తన కుమారుడు దురై దయానిధికి ఇవ్వాలని ఆయన పట్టుపడుతున్నారు. ఈ మేరకు కరుణానిధి కుమార్తె సెల్వి ఇప్పటికే ఇటు స్టాలిన్ తోనూ, అటు ఆళగిరితోనూ చర్చలు జరుపుతున్నారు. సెల్వీ ఇటీవల మాట్లాడుతూ తమ కుటుంబం చీలిపోకూడదని కరుణానిధి కోరుకున్నారని తెలియజేశారు. అంతేకాదు తమ కుటుంబంమంతా కలిసే ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సెల్వి రాయబారం ఎంతవరకూ పనిచేస్తుందో చూడాలి.ప్రస్తుతం డీఎంకేలో ఖాళీగా ఉన్న అధ్యక్షుడు, కోశాధికారి పదవులను మాత్రమే భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఈ నెల 26వ తేదీన పార్టీ అధ్యక్షుడు, కోశాధికారి పదవులకు నామినేషన్లను ఆహ్వానించారు. 27వ తేదీన ఉప సంహరణకు గడువు విధించారు. 28న ఎన్నిక జరగనుంది. మరి ఈ ఎన్నికల్లో ఆళగిరి తన అనుచరులను ఎవరినైనా బరిలోకి దింపుతారా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఆళగిరి నేరుగా పోటీ చేయడానికి వీలులేదు. ఆయనను పార్టీ నుంచి బహిష్కరించడంతో ప్రస్తుతం ఆయన పార్టీ సభ్యుడు కాదు. బహిష్కరణ ఎత్తివేస్తేనే ఆయన సభ్యత్వం పునరుద్ధరించబడుతుంది. అందువల్ల ఆళగిరి తన మద్దతుదారుల్లో కొందరి చేత నామినేషన్ వేయించే అవకాశం ఉందంటున్నారు. ఆళగిరి కూడా వచ్చే నెల 5వ తేదీన చెన్నైలో మౌన ప్రదర్శనకు రెడీ అవుతున్నారు. తన సత్తా ఏంటో వారికి ఆరోజు తెలుస్తుందని స్టాలిన్ కు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. కరుణ చివరి మాటలను నిజం చేస్తానని ఆళగిరి చెబుతున్నారు. దాదాపు లక్షమందితో మౌన ప్రదర్శన చేయాలని ఆళగిరి భావిస్తున్నారు. తన వెనక భారతీయ జనతా పార్టీ ఉందన్న ప్రచారాన్ని ఆళగిరి కొట్టిపారేస్తున్నారు. తన వెంట కరుణ అభిమానులు, నిజమైన పార్టీ కార్యకర్తలే ఉన్నారని ఆయన చెబుతున్నారు. త్వరలోనే సీన్ తెలిసిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఐదు రోజుల్లో డీఎంకేలో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పార్టీ కార్యకర్తల్లో నెలకొని ఉంది.

No comments:
Write comments