రైతన్నలకు అండగా పునరుజ్జీవం..

 

కామారెడ్డి‌, ఆగస్టు10, 2018 (globelmedianews.com)  
కామారెడ్డి రైతాంగానికి మద్దతుగా శ్రీరాంసాగర్‌ ను పటిష్టం చేసే చర్యలు ముమ్మరం చేసింది సర్కార్. సెప్టెంబరు చివరి నాటికి నీటిని తరలించాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు పనులు వడివడిగా సాగుతున్నాయి. పనులు పూర్తైతే ఆయకట్టుకు రెండు పంటలకు నీరందే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు పరిధిలో స్థిరీకరించిన ఆయకట్టుకు నీరు అందించాలంటే 120 టీఎంసీలు అవసరం. జలాశయంలో పూడిక పేరుకుపోవడంతో పూర్తిస్థాయిలో నీరు ఉండడంలేదు. 90 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంటోంది. దీంతో చివరి ఆయకట్టుకు సాగు నీరు అందడం లేదు. గోదావరి నదిపై మహారాష్ట్ర పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు నిర్మించడం కూడా నీటి నిల్వను ప్రభావితం చేస్తోంది. ఎగువ నుంచి నీళ్లు రాక ప్రాజెక్ట్ లో పూర్తిస్థాయి నీటి నిల్వ ఉండడంలేదు. గత మూడేళ్ల వరద లెక్కలను పరిశీలిస్తే  ఏటా సగటున 55 టీఎంసీలు కూడా ఎగువ నుంచి రావడం లేదని ఈజీగానే తెలుసుకోవచ్చు. నీరు పూర్తిగా లేనందున ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడం కష్టంగా మారింది. ఈ పరిస్థితిని దృష్టించి కాళేశ్వరం నుంచి రివర్స్‌పంపింగ్‌ పద్ధతిలో ఎస్సారెస్పీలోకి నీళ్లు తీసుకురావలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ప్రస్తుతం కాళేశ్వరం నుంచి మల్లన్నసాగర్‌కు నీటిని తరలిస్తున్నారు..మధ్యలో ఎల్లంపల్లి వద్ద శ్రీరాంసాగర్‌ వరద కాల్వలోకి కొంత నీటిని మళ్లిస్తారు. 
 
 
 
రైతన్నలకు అండగా పునరుజ్జీవం..

రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 రోజుల్లో 60 టీఎంసీల నీటిని రివర్స్‌ పంపింగ్‌ పద్ధతిలో తీసుకురావాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఈ పథకాన్ని పునరుజ్జీవంగా అభివర్ణిస్తున్నారు. పునరుజ్జీవం పథకం పనులను రూ.927 కోట్లతో నిర్వహిస్తున్నారు. జులై 2018 వరకు పనులు పూర్తి చేయాలన్నది టార్గెట్. అయితే పనులు ఇంకా సగం కూడా కాలేదు. ఇకనుంచైనా పనులు మరింత వేగం పుంజుకుంటే త్వరలోనే ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తుంది. ఇదిలాఉంటే పథకంలో భాగంగా ముప్కాల్‌, జగిత్యాల్‌ జిల్లా రాజేశ్వర్‌రావుపేట, రాంపూర్‌లలో పంప్‌హౌస్‌లను నిర్మిస్తున్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణ పూర్తైంది. ఇక పనులు కూడా వేగంగానే సాగుతున్నాయి. పునరుజ్జీవ పనుల్లో భాగంగా ఒక్కొక్క పంప్‌హౌస్‌ వద్ద 8 పంపులను బిగించాలని నిర్ణయించారు. ఒక్కో పంపు సామర్థ్యం 6.5 మెగావాట్ల విద్యుత్తు అవసరం.. ఒక్కో పంప్‌ ద్వారా దాదాపు 1500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నారు. రాజేశ్వర్‌రావుపేట, రాంపూర్‌ వద్ద పంప్‌హౌస్‌లలో 3 పంపులను సెప్టెంబర్‌ నాటికి బిగించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు అధికారులు. ఈ పనులు పూర్తి అయితే ఎస్సారెస్పీలోకి కొంత నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుంది. అదే జరిగితే స్థానిక వ్యవసాయక్షేత్రాలకు సాగునీరు సమృద్ధిగా అందుతుంది. రైతులకు నీటిపాట్లు కొంతమేర తొలగిపోతాయి.

No comments:
Write comments