సీనియర్ జర్నలిస్ట్ కుల్‌దీప్ నయ్యర్ మృతిపట్ల కేసిఆర్ సంతాపం

 

హైదరాబాద్ ఆగష్టు 24 (globelmedianews.com)
సీనియర్ జర్నలిస్ట్ కుల్‌దీప్ నయ్యర్(95)మృతిపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. కుల్‌దీప్ రచనలు భారత సమాజానికి ఎంతగానో ఉపయోగపడ్డాయని సీఎం పేర్కొన్నారు. సామాజిక, రాజకీయ, దౌత్యపర అంశాలపై కుల్‌దీప్ అధ్యయనాలు దేశానికి ఉపయోగపడ్డాయని చెప్పారు.గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న నయ్యర్.. ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుల్‌దీప్ నయ్యర్ సియాల్‌కోట్(పాకిస్థాన్)లో జన్మించారు. లాహోర్ నుంచి లా డిగ్రీని పూర్తిచేశారు. దేశ విభజన సమయంలో ఢిల్లీకి వచ్చి స్థిరపడ్డారు. కుల్‌దీప్ నయ్యర్ 1990లో బ్రిటన్‌లో భారత రాయబారిగా పనిచేశారు. పలు పత్రికలకు వ్యాసాలు రాశారు. రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2012లో జీవిత చరిత్రను వెలువరించారు. ఇందులో దేశ విభజన సమయంలో జాతుల మధ్య నమ్మకం ఎలా కుప్పకూలిందో.. పంజాబ్‌లోని రక్తపు రహదారులను దాటుకుని ఢిల్లీకి ఏ విధంగా వలస రావాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. ఓ ఉర్ధూ పత్రికలో యువ పాత్రికేయుడిగా ప్రవేశించి తదనంతర కాలంలో న్యూస్ ఏజెన్సీకి హెడ్‌గా వ్యవహరించారు. పత్రికా స్వేచ్ఛకు పాటుపడ్డారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం, దేశంలో అత్యవసర పరిస్థితి 1975 వంటి ఎన్నో చారిత్రక ఘట్టాలను ఆయన కవర్ చేశారు. కుల్‌దీప్ నయ్యర్ అంత్యక్రియలు దక్షిణ ఢిల్లీలోని లోధి స్మశానవాటికలో నేడు జరగనున్నాయి.
 
 
 
సీనియర్ జర్నలిస్ట్ కుల్‌దీప్ నయ్యర్ మృతిపట్ల కేసిఆర్ సంతాపం

No comments:
Write comments