తెలంగాణ ముందస్తుకు ఆ ఏడు మండలాలు అడ్డు

 

ఖమ్మం, ఆగస్టు 27, (globelmedianews.com)
తెలంగాణలో ముందస్తు ఎన్నికల కోసం… తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. పూర్తిగా సిద్ధమయ్యారు. ఈసీ నుంచి ఎలాంటి ఆటంకాలు రాకుండా.. సన్నాహాలు చేసుకుంటున్నారు. మామూలుగా అయితే కేసీఆర్‌కు ఈ విషయంలో ఇబ్బందికర పరిస్థితి ఉండేది కాదు. కానీ ఇప్పటికప్పుడు.. ప్రధానితో పాటు.. ఈసీ కూడా పరిష్కరించలేని సమస్య ఉండటంతో ముందస్తు జరగదేమో అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఆ సమస్య ఏమిటంటే.. ముంపు మండలాలు. పోలవరం ముంపు మండలాలు ఏడింటిని.. కేంద్రం ఏపీలో కలిపింది. ముందస్తు ఎన్నికలు జరిగితే ఆ ఏడు మండలాల సంగతి తేల్చాల్సి ఉంటుంది. ఏపీలో ఉంటాయో.. తెలంగాణలో ఉంటాయో క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. కొద్ది రోజుల క్రితం.. తెలుగు రాష్ట్రాల్లో సీట్ల మార్పు విషయంపై స్పష్టత ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం .. హోంశాఖను కోరింది. వెంటనే ఆలస్యం చేయకుండా.. కేంద్ర హోంశాక.. కేంద్ర ఎన్నికల సంఘం అడిగిన వివరాలను వీలైనంత త్వరగా అందివ్వాలని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు లేఖ రాసింది.
 
 
 
తెలంగాణ ముందస్తుకు ఆ ఏడు మండలాలు అడ్డు
 
 దానికి సంబంధించి ఆయా ప్రభుత్వాలు సమాచారం పంపాయి. విలీన మండలాలు ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నాయి. ఇవన్నీ భద్రాచలం ఎమ్మెల్యే నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఎమ్మెల్యే మాత్రం తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికలు జరపాలంటే.. ఆ ఏడు మండలాల సంగతి తేల్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఏడు మండలాలతో ఏపీలో ఓ అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి. అది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి… మళ్లీ రిజర్వేషన్ల విషయాన్నీ పరిశీలించాలి. ఒక ఎస్టీ సీటు ఏపీలో పెంచాలంటే.. చాలా కసరత్తే చేయాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణలో తగ్గించాలంటే.. కూడా అదే స్థాయి కసరత్తు చేయాలి. దీంతో ఇదంతా తేలికగా కాదని ఈసీ అధికారులు భావిస్తున్నారు. ఓ రాష్ట్రంలో సీటు తగ్గించి..మరో రాష్ట్రంలో పెంచాలంటే.. సవాలక్ష చిక్కులుంటాయి. ప్రస్తుతానికి ఎన్నికల అధికారులు విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం.. ఏపీలో కలిసిన ఏడు మండలాల ప్రజలూ.. తెలంగాణ ఓటర్లుగా చూపిస్తున్నారు. ఏపీ పాలనలో ఉండి..వారు తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే స్థానానికి ఓటు వేయాల్సి వస్తే.. అది పరిష్కరించలేని వివాదమే అవుతుంది. ఒక వేళ… ఈ విషయంపై క్లారిటీకి రాలేకపోతే మరింత గందరగోళం తలెత్తుతుంది. అందుకే.. ఆర్డినెన్స్ జారీ చేసి సమస్యను పరిష్కరించాలని.. కేసీఆర్ మోడీని కోరినట్లు తెలుస్తోంది.

No comments:
Write comments