ప్రధానితో తెరాస ఎంపీల భేటీ

 

న్యూఢిల్లీ, ,ఆగష్టు 11 (globelmedianews.com)
ప్రధాని మోదీని టీఆర్ఎస్ ఎంపీలు కలిశారు. తెలంగాణలో కొత్త సచివాలయం నిర్మాణం కోసం బైసన్‌ పోలో, జింఖానా మైదానం భూములు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రధానికి వినతిపత్రం కూడా అందజేశారు. మల్కాజ్‌గిరిలోని రక్షణ శాఖ భూమిని తమకు అప్పగిస్తే అక్కడ ఫ్లైఓవర్‌ నిర్మాణం నిర్మిస్తామని.. దాని ద్వారా 44వ నంబర్‌ జాతీయ రహదారి, ఒకటో నంబర్‌ రాష్ట్ర రహదారి అనుసంధానికి అనువుగా ఉంటుందని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అలాగే తెలంగాణలో కూడా ఓ జాతీయ ప్రాజెక్టును కేటాయించాలని.. కొత్త జోన్లకు ఆమోదం తెలపాలని కోరినట్లు తెలుస్తోంది. 
 
 
 
ప్రధానితో తెరాస ఎంపీల భేటీ
 
తెలంగాణ ప్రభుత్వం కొత్త సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తోంది. నిర్మాణానికి రక్షణశాఖకు సంబంధించిన బైసన్‌పోలో, జింఖానా మైదానాలు అనువుగా ఉన్నాయి కాబట్టి.. అక్కడ నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికి కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. గతంలోనే సీఎం కేసీఆర్ ప్రధానిని, కేంద్రమంత్రుల్ని కలిసి విజ్ఞ‌ప్తి చేశారు. మళ్లీ ఇప్పుడు ఎంపీలందరూ మోదీని కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉందని, రూ. 95 కోట్లు తేడా ఉందని, ఆ డబ్బును కట్టాలని చెప్పారని, దానికి రాష్ట్రప్రభుత్వం ఒప్పుకుందని ఎంపీలు తెలిపారు. తర్వాత మూడో క్లాజ్ పెట్టారని, ఆ ల్యాండ్‌పై ప్రతి ఏటా రూ. 31.5 కోట్ల ఆదాయం వస్తుందని... అది కూడా కట్టాలని చెప్పారని, దానిపై ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ రాశారని, రాష్ట్ర ప్రభుత్వం కూడా భూమి ఇస్తుందని, దానిద్వారా ఆదాయం వస్తుంది కాబట్టి దాన్ని మినహాయింపు ఇవ్వాలని కోరుతూ లేఖ రాశారన్నారు. దీంతో హైలెవల్ కమిటీ భూమిని బదలాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.కమిటీ సూచనతో జవహార్ నగర్‌లో దాదాపు 560 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపిందని ఎంపీలు పేర్కొన్నారు. రెండు రోజుల్లో స్థల బదలాయింపు అవుతుందన్న క్షణాన రక్షణ శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ మారారని, కర్ణాటక ప్రభుత్వం అడగగానే 210 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, తెలంగాణకు మాత్రం భూమిని బదలాయించకుండ కేంద్ర రక్షణ శాఖ ఆలస్యం చేస్తోందని ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోకొత్త మెలికతో స్థలం ఇవ్వకుండ కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఆలోచన చేస్తున్నారని, బైసన్ పోలో స్థలం, కంటోన్మెంట్ ఏరియా స్థలానికి సంబంధించి వేరు వేరుగా లేఖలు ఇవ్వాలనడం సరికాదన్నారు.

No comments:
Write comments