ఆలేరులో కరువు పరిస్థితులు

 

నల్గొండ, ఆగస్టు 8, (globelmedianews.com)
రెండు దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆలేరు నియోజకవర్గంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. చినుకు జాడ లేకపోవడంతో చెరువులు, కుంటలు బోసిపోయాయి. ఆగస్టు మొదటి వారం ముగిసినా.. పావలా వంతు నాట్లు పడలేదు. జూన్‌ మొదటి వారంలో కురిసిన ఒకటి, రెండు వర్షాలు మినహా ఇప్పటికీ ఒక మోస్తారు వాన కురిసిన దాఖలాలు లేవు. అపుడపుడు ఆకాశం మేఘావృతం అవుతున్నప్పటికీ.. ఆ కొద్ది సేపట్లోనే అంతా సాధారణంగా మారుతోంది. ఇప్పటికే చాలా మంది రైతులు కాడి మూలన పడేయగా.. మరి కొందరు గత్యంతరం లేక అరెకరం, ఎకరం విస్తీర్ణంలో నాట్లు వేశారు. 
 
 
 
ఆలేరులో కరువు పరిస్థితులు
 
సాగు చేసిన ఆ కొద్ది పంటలు సైతం బోర్లు ఎత్తి పోతుండడంతో పారుదలకు నోచుకోవడం లేదు. వేలాది ఎకరాల్లో పత్తి, కంది, మొక్కజొన్న పంటలు వాడిపోతున్నాయి. ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, గుండాల మండలాల్లో ఇప్పటికే వందలాది ఎకరాల్లో మొక్కజొన్న చేలు ఎండిపోయాయి.నియోజకవర్గంలోని మోటకొండూరు, ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, గుండాల మండలాల పరిధిలో కరవు దరువు వేస్తోంది. జూన్‌ 1 నుంచి ఇప్పటి వరకు వర్షపాతం 53 నుంచి 82 శాతం ఉంది. జూన్‌ నుంచి వర్షాలు లేకపోవడంతో ఆలేరు, రాజపేట, తుర్కపల్లి, గుండాల లాంటి మండలాల్లో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లుతోంది. వరి 20 శాతానికి మించి సాగు కాలేదు. మోటకొండూరు మండలంలో వర్షపాతం 82 శాతంలోటు ఉండగా ఆలేరు 62, గుండాలలో 61, తుర్కపల్లిలో 53శాతం లోటు వర్షపాతం ఉంది. ఫలితంగా కరవు పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. 15 రోజులుగా పగటి పూట సాధారణానికి మించి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో గాలిలో తేమశాతం తగ్గుతోంది. ఫలితంగా పత్తి, కంది, మొక్కజొన్న పైర్లు వాడిపోతున్నాయి.

No comments:
Write comments