రబీకి పూర్తి స్థాయిలో నీళ్లు

 

ఒంగోలు, ఆగస్టు 27, (globelmedianews.com)
రబీకి పూర్తిస్థాయిలో నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎగువన కురిసిన వర్షాలతో నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌లో నీరు చేరడంతో సాగర్‌ పరిధిలో మాగాణికి నీళ్లివ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. జిల్లాలో సాగర్‌ పరిధిలో పూర్తిస్థాయిలో పంటలు వేసి చాలా కాలమయ్యింది. రెండేళ్ల వ్యవధి తర్వాత గత ఏడాది ఆరుతడి పంటలకు ఇచ్చినప్పటికీ అది కూడా అరకొరగా, అప్పుడప్పుడు కేటాయించారు. నిరుడు అధికారిక లెక్కల ప్రకారం 25 టీఎంసీల నీటిని జిల్లాకు వదిలినా ఆ లెక్కకు సంబంధించిన పంట మాత్రం పండలేదు. ఆ నీళ్లు ఖరీఫ్‌ చివర్లో కంది, పత్తి పంటలకు కాస్త ప్రాణం పోశాయి. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో అనుకున్నట్లు పండలేదు. ఈసారి మాత్రం పక్కా ప్రణాళిక ప్రకారం జిల్లాకు నీటిని ఇవ్వనున్నారు. రైతులు ఆచితూచి తగిన పంటలు వేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.నీటి సద్వినియోగానికి జిల్లా నుంచి కూడా ప్రణాళిక రూపొందిస్తున్నారు. 
 
 
 
రబీకి పూర్తి స్థాయిలో నీళ్లు
 
ఎక్కడెక్కడ ఎలాంటి పంటలు వేసుకుంటే మేలన్న కోణంలో రైతులకు అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఇక రైతులే ఆచితూచి అడుగులు వేయాలి. విత్తులు సిద్ధం చేసుకోవాలి...జిల్లాలోని 4.29 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, కంది, అపరాలు పంటలు వేస్తుంటారు. సాగర్‌ నీటిని అడిగినంత మేరకు ఇచ్చినప్పటికీ ఈ నీటి ద్వారా 75 శాతమే ప్రయోజనం దక్కుతుంది. మధ్యమధ్యలో వానలు కురిస్తే నేల మెత్తబడి పంటలకు ఆయువు పోస్తాయి. జిల్లాలో సాగు అవసరాల నిమిత్తం 50 టీఎంసీలు అవసరమని అధికారులు ప్రతిపాదించారు. సెప్టెంబరు-15 నుంచి ఫిబ్రవరి-15 వరకు నీటిని అందించేందుకు ఉన్నతస్థాయి నుంచి సూచనలు అందాయి. మొదటి నెల రోజుల పాటు విత్తనాల వృద్ధికి కావాల్సినట్టు ఇస్తారు. అధికారులు కూడా దానికి తగ్గట్టు కార్యాచరణ సిద్ధం చేశారు. బుగ్గవాగులో ముందుగా 3 టీఎంసీల నీటిని నిల్వ చేసి 7 వేల క్యూసెక్కుల చొప్పున వదులుతారు. ఈ ప్రవాహం ఆరు నెలల పాటు కొనసాగుతుంది. జిల్లా అధికారులు 50 టీఎంసీలు అడిగారు. దీనిలో కనీసం 40 టీఎంసీలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైతులు కూడా సమయానుగుణంగా పంటలు వేసుకోవాలి. కాలువలకు దగ్గర్లో ఉన్న రైతులు ఒక తరహాలో, దూరాన, శివారున ఉన్న పొలాల్లో తక్కువ నీళ్లు అవసరమయ్యే పంటలు వేసుకోవాలి. మాగాణి పంటలకు మూడు తడులకు నీరిస్తారు. పత్తి, కంది వేసే రైతులకు అవసరం మేరకు ఇస్తారు. మధ్యలో వర్షాలు కురవకుంటే మాత్రం ఈ పైర్లకు ఇబ్బందులు తప్పవు. సాగర్‌ నీరు అందుబాటులో ఉన్నప్పటికీ, సాగు మధ్యలో రెండు, మూడు వానలు కురిస్తేనే పూర్తిస్థాయిలో పంటలకు లబ్ది చేకూరుతుందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.సాగర్‌కు జలకళ రానుండడంతో రైతులు కూడా పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాగర్‌ పరిధిలో 4.29 లక్షల ఎకరాల సేద్యం ఉంది. ఎక్కువగా అద్దంకి బ్రాంచి కాలువ పరిధిలో 1.69 లక్షల ఎకరాలు, ఒంగోలు బ్రాంచి కాలువ పరిధిలో 1.57 లక్షల ఎకరాలు, దర్శి బ్రాంచి కాలువ పరిధిలో 73 వేల ఎకరాల సాగు ఉంది. అద్దంకి, దర్శి, చీమకుర్తి, కురిచేడు, ముండ్లమూరు, సంతనూతలపాడు, మేదరమెట్ల, తాళ్లూరు, ఒంగోలు సమీప మండలాల్లో కంది, శెనగ, పత్తి వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నీటి ఆశలతో కాలువలకు సమీపంలో దాదాపు 45 వేల ఎకరాల్లో వరి, మరో 35 వేల ఎకరాల్లో అపరాల సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికైతే సాగర్‌ పరిధిలో కొద్దిమంది మాత్రమే అరకొర నీటిని తోడుకుంటూ శనగ, కంది పంటలు ఆరంభించారు. చాలా మంది రైతులు శనగ, కంది, పత్తి విత్తనాలు తీసుకువచ్చి నీటి కోసం వేచి చూస్తున్నారు. తాజాగా అధికారుల కబురుతో దుక్కులకు సమాయత్తమవుతున్నారు. సెప్టెంబరు-15 నాటికి నీరు అందేలోగా రెండు వానలు కురిస్తే నేలలు మెత్తబడి నాట్లకు అనుకూలంగా మారుతాయని రైతులు ఆశిస్తున్నారు.

No comments:
Write comments