మోహన్ బాబు మరోసారి విలన్ అవతారం

 

ఆగస్టు 28, (globelmedianews.com)
హీరోయిజం, కామెడీ, విలనిజం.. దేన్ని పండించడంలో అయినా సిద్ధహస్తుడు మోహన్ బాబు. ఈ తరహా పాత్రలన్నింటినీ చేసి ‘కలెక్షన్ కింగ్’గా టాలీవుడ్ ప్రస్థానంలో ప్రత్యేకతను నిలుపుకున్నారాయన. ఇటీవలే ‘గాయత్రి’ సినిమా ద్వారా తన నటనా పటిమను మరోసారి చూపించి..తనెందుకు ప్రత్యేకమో చాటుకున్నారు. అలాగే ‘మహానటి’లో మహానటుడు ఎస్వీఆర్ పాత్రను పోషించి ఆకట్టుకున్నారు. ఇలా సాగుతున్న పరంపరలో మోహన్ బాబు మరోసారి విలన్ అవతారం ఎత్తనున్నారని టాక్ వినిపిస్తోంది. కెరీర్ ఆరంభంలో బీభత్సమైన విలనిజాన్ని పండించిన మోహన్ బాబు ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించనున్నారనే వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. అది కూడా ద్విభాష సినిమాలో మోహన్ బాబు విలన్ గా నటించనున్నారట. తమిళ హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఒక సినిమాలో మోహన్ బాబు విలన్గా నటించబోతున్నారని సమాచారం. సుధ కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఇది వరకూ విక్టరీ వెంకటేష్ తో ‘గురు’ సినిమాను రూపొందించిన దర్శకురాలు సుధ. ఇప్పుడు సూర్య హీరోగా ఒక సినిమాను చేస్తోంది. అందులో మోహన్ బాబు అయితే విలన్ పాత్రకు వందశాతం న్యాయం చేయగలుగుతారని అనుకుంటున్నారట. ఈ మేరకు కలెక్షన్ కింగ్ను సంప్రదించారని.. ఈ ద్విభాష సినిమాలో నటించడానికి ఆయన సమ్మతించడం జరిగిందనేది టాలీవుడ్ సమాచారం. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
 
 
 
మోహన్ బాబు మరోసారి విలన్ అవతారం 

No comments:
Write comments