సెప్టెంబర్ నుంచి మళ్లీ పెరగనున్న టోల్ చార్జీలు

 

రాజమండ్రి ఆగస్టు 27, (globelmedianews.com)
వాహనదారుల ‘టోలు’ తీసేందుకు మరోసారి రంగం సిద్ధమైంది. సెప్టెంబర్‌ ఆరంభం నుంచే టోల్‌ ఛార్జీలు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.దేశవ్యాప్తంగా టోల్‌గేట్ల ద్వారా ఏటా రూ.16 వేల కోట్ల ఆదాయం సమకూరుతున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ చెబుతోంది. అయితే లారీలకు నేషనల్‌ పర్మిట్ల మాదిరిగా దేశవ్యాప్తంగా టోల్‌ నుంచి మినహాయిస్తే రూ.24 వేల కోట్లు ముందుగానే చెల్లిస్తామని, జాతీయ లారీ యజమానుల సంఘం ప్రతిపాదించినా ఇంతవరకూ సానుకూల స్పందన రాలేదు టోల్‌ ఛార్జీల పెంపు ప్రభావం రవాణా రంగంపైనే కాకుండా ప్రజా రవాణా వ్యవస్థపైనా తీవ్రంగా పడనుంది. టోల్‌ ఫీజులు భరించలేనంతగా ఉన్నాయని లారీ యజమానుల సంఘం ఇటీవలే వారం రోజుల పాటు సమ్మె చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం కార్లు, బస్సులు, ట్రక్కులు, మల్టీ యాక్సిల్‌ వాహనాలకు వసూలు చేస్తున్న ఫీజులకు అదనంగా పది శాతం వరకు టోల్‌ రుసుము పెంచనున్నారు.
 
 
 
సెప్టెంబర్ నుంచి మళ్లీ  పెరగనున్న టోల్ చార్జీలు
 
 రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల పరిధిలో 30 వరకు టోల్‌ గేట్లున్నాయి. ఒక్కో చోట ఒక్కో రకంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అధికార పార్టీ నేతల అండతో అనధికారికంగా దోపిడీ చేస్తున్నారు. కృష్ణా జిల్లా కీసర, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు వద్ద టోల్‌గేట్లలో నిర్దేశిత ఫీజుల కంటే అధికంగా వసూలు చేయడంపై లారీ యజమానులు నిరసనలకు దిగారు. అనంతపురం జిల్లా పరిధిలోని టోల్‌గేట్లలో అధికార పార్టీ నేతల అండతో వాహనదారుల జేబులు గుల్ల చేస్తున్నారు.టోల్‌గేట్‌ కాంట్రాక్టుదారులు ఇష్టానుసారంగా ఫీజులు పెంచేందుకు జాతీయ రహదారుల అథారిటీ సహకరిస్తోందని రవాణా రంగ నిపుణులు విమర్శిస్తున్నారు. టోల్‌ నిర్వాహకుల లాబీయింగ్‌తో తరచూ ఫీజులు పెంచడం పరిపాటిగా మారిందని, ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సార్లు టోల్‌ ఫీజులు సవరించారని లారీ యజమానుల సంఘం పేర్కొంది.అధ్వాన్నంగా ఉన్న జాతీయ రహదారుల్లో వాహనదారుల నుంచి టోల్‌ ఫీజులు వసూలు చేయకూడదు. అయితే జాతీయ రహదారుల అథారిటీ మాత్రం విజయవాడ – విశాఖపట్టణం ఎన్‌హెచ్‌–16 దారుణంగా ఉన్నా వాహనదారుల నుంచి ముక్కు పిండి టోల్‌ వసూలు చేస్తోంది. విజయవాడ–గుంటూరు జాతీయ రహదారిని ఆరు వరుసలుగా మార్చినా నిర్వహణ సరిగా లేదు. వర్షం కురిస్తే రోడ్డుపైనే నీరు నిలుస్తూ ఇబ్బందికరంగా మారింది.

No comments:
Write comments