కాంగ్రెస్, టీడీపీల పొత్తు విభజన తెచ్చిన తంటా

 

హైద్రాబాద్, ఆగస్టు 24, (globelmedianews.com)
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఊహించడం కష్టంగా మారింది. దీంతో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఫలితంగా సమీకరణలు మారిపోతున్నాయి. అందుకోసం పార్టీలన్నీ మార్పులకు తగ్గట్లు సమాయత్తం అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల పరిస్థితిని పక్కనపెడితే, తెలుగు రాష్ట్రాల్లో రెండు పార్టీలు వింత పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ.. ఏపీలో కాంగ్రెస్ పార్టీలు భిన్నమైన పరిస్థితులతో సతమతమవుతున్నాయి. విభజన తెచ్చిన తంటతో ఈ రెండు పార్టీలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. విభజనకు ముందు తలో రెండు సార్లు అధికారాన్ని దక్కించుకున్న ఈ రెండు పార్టీలు ప్రస్తుతం కష్టాలు పడుతున్నాయి. 
 
 
 
కాంగ్రెస్, టీడీపీల పొత్తు
విభజన తెచ్చిన తంటా
 
ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నికలు ప్రారంభమైనప్పటి నుంచి ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఏపీలో ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇక తెలంగాణలో మాత్రం కొంచెం ప్రభావం చూపిన ఆ పార్టీ.. ప్రస్తుతం మరింత బలపడింది. దీంతో ఆత్మవిశ్వాసం సాధించి, వచ్చే ఎన్నికల్లో అక్కడ అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.మరోవైపు, ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ.. తెలంగాణలో ఉనికి కోల్పోయి ఇబ్బంది పడుతోంది. గత ఎన్నికల్లో 15 సీట్లను గెలుచుకున్న ఆ పార్టీకి ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపరేషన్‌ ఆకర్ష్‌ను ప్రయోగించి టీడీపీ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి రప్పించుకున్నారు. ఆ పార్టీకి తెలంగాణలో నాయకత్వ లోపం చాలా ఉంది. క్యాడర్ బాగా ఉన్నా నాయకులు లేక ఆ పార్టీ ఇబ్బంది పడుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకోవాలని ఆ పార్టీలోని కొందరు కీలక నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ముందుగా టీడీపీ నేతలు ప్రతిపాదించిన దాని ప్రకారమే రాష్ట్రంలో, అటు కేంద్రంలో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకోడానికి సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు.. పొత్తు విషయంలో కొంత సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం. ఒక్క తెలంగాణలో మాత్రం పొత్తు పెట్టుకోవడం వల్ల ఈ రెండు పార్టీలు బాగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ కారణంగానే పొత్తు ప్రతిపాదనపై రెండు పార్టీల అధిష్టానాలు పునరాలోచనలో పడినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

No comments:
Write comments