ప్రీ మేనిఫెస్టోపై దృష్టి పెట్టిన పవన్

 

హైద్రాబాద్, ఆగస్టు 7  (globelmedianews.com)
ఎన్నికల ప్రణాళికలు, పార్టీ సంస్థాగత నిర్మాణం, ఎన్నికల సందర్భంగా ప్రకటించబోయే పాలసీలపై జనసేన పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఇందుకోసం ఆదివారం మాదాపూర్‌లోని పార్టీ కార్యాలయంలో పిఏసి సమావేశమయ్యింది. ఈ నెల 14న ఎన్నికల ముందస్తు ప్రణాళికను ప్రకటించేందుకు సిద్ధమవుతున్న జనసేన, దీనిపై సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన జరిగిన ఈ కీలక సమావేశంలో వివిధ పాలసీలు, జిల్లా కమిటీల నియామకాలపై ప్రధానంగా దృష్టి సారించారు. విద్యా వ్యవస్థకు సంబంధించి ఫిన్లాండ్‌ దేశంలో విజయవంతంగా అమలవుతున్న కొన్ని విధానాలు, కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన ముసాయిదా పత్రంపై పిఏసి చర్చించింది. 
ప్రీ మేనిఫెస్టోపై దృష్టి పెట్టిన పవన్
ఫిన్లాండ్‌ దేశంలో అమలవుతున్న ఆయా కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఏ విధంగా, ఏ మేరకు అమలు చేయవచ్చనే అంశాల్ని అధ్యనం చేయాలని నిర్ణయించారు.  కమిటీ సభ్యులకు పవన్‌ కొన్ని సూచనలు చేశారు. అరకు, పాడేరు ప్రాంతాల పర్యటనలో బాలికల వసతి గృహాలు, పాఠశాలను సందర్శించిన సమయంలో తాను గమనించిన విషయాలను కమిటీ సభ్యులకు వివరించిన ఆయన, పాఠశాలల్లో నాణ్యత పెంచడమే జనసేన లక్ష్యమని, అందుకనుగుణంగా పాలసీ రూపొందించాలని కమిటీని కోరారు. ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలు, మైనార్టీల పిల్లలకు వసతి గృహాలను ఏర్పాటు చేసే విధంగా జనసేన మేనిఫెస్టో ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలకు సంస్థగత నిర్మాణ కమిటీలు ఏర్పాటయ్యాయి.  పిఏసి సమావేశంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు ఈ కమిటీలను నియమించారు. దీంతోపాటు ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, అమరావతి ప్రాంతాలకు ప్రాంతీయ కోఆర్డినేటర్లను కూడా ప్రకటించారు. ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్‌, ఇద్దరు జాయింట్‌ కోఆర్డినేటర్లు ఉంటారు. అయితే విశాఖపట్నం జిల్లాకు మాత్రం అర్బన్‌ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని నలుగురు జాయింట్‌ కోఆర్డినేటర్లను నియమించారు. కోఆర్డినేషన్‌ బృందంలో 20 నుంచి 25 మంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ బృందాల్లో పార్టీకి గత నాలుగున్నరేళ్లుగా సేవలందిస్తున్న వారిని ఎక్కువగా నియమించారు. అన్ని జిల్లాలకు కన్వీనర్‌గా పార్థసారధి వ్యవహరించ నున్నారు. ఇక మిగిలిన జిల్లాలకు కమిటీలను త్వరలోనే ప్రకటిస్తామని పార్టీ నేతలు తెలిపారు.

No comments:
Write comments