అనుకున్నదొక్కటి...అయినదక్కొటి...

 

బెంగళూర్, ఆగస్టు 17 (globelmedianews.com) 
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్వేదంలోకి వెళ్లిపోయారు. ఆయన రాష్ట్ర రాజకీయాలను ఇకపట్టించుకునేది లేదంటున్నారు. కుదిరితే లోక్ సభ ఎన్నికలకు రెడీ అయిపోతారన్న వార్తలు వస్తున్నాయి. గతకొంతకాలంగా సిద్ధరామయ్యకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ పెద్ద ప్రాధాన్యత దక్కడం లేదు. మాజీ ముఖ్యమంత్రిగా సంకీర్ణ సర్కార్ లో సమన్వయ కమిటీ ఛైర్మన్ గా ఉన్న సిద్ధరామయ్య సూచనలను సర్కార్ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన భాగస్వామ్యాన్ని కూడా కుమారస్వామి కోరుకోవడం లేదు. దీనికి తోడు నిన్న మొన్నటివరకూ దగ్గరగా ఉన్న కాంగ్రెస్ నేతలు నేడు దూరంగా జరిగిపోతుండటం సిద్ధూను కలత చెందేలా చేసిందంటున్నారు.సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు. కర్ణాటకలో మరే ముఖ్యమంత్రి తెచ్చుకోలేని పేరుప్రతిష్టలను ఐదేళ్లలో సిద్ధరామయ్య తెచ్చుకోగలిగారు. 
 
 
 
 అనుకున్నదొక్కటి...అయినదక్కొటి...
 
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన కాంగ్రెస్ నేతగా రికార్డులకు కూడా ఎక్కారు. గత ఎన్నికల్లో అంతా తన చేతుల మీదుగా నడిచినా కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోయింది. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ఓటమి పాలు కావడం సిద్ధరామయ్య జీర్ణించుకోలేక పోతున్నారు. అధిక స్థానాలను దక్కించుకున్నా ముఖ్యమంత్రి పదవి జేడీఎస్ తన్నుకు పోవడం సిద్ధరామయ్యకు సుతారమూ ఇష్టం లేదు. తొలుత దానిని సున్నితంగా వ్యతిరేకించినా అధిష్టానం ఆదేశాలతో మౌనం వహించాల్సి వచ్చింది.మరోవైపు గత నెలరోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలు కూడా సిద్ధరామయ్యను ఆవేదనకు గురిచేస్తాయంటున్నారు. అధికారుల బదిలీల వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి కుమారస్వామి తనను సంప్రదించకుండా చేయడాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద తప్పుపడుతున్నారు. తనకు అనుకూలురుగా ఉన్న అధికారులను కుమారస్వామి బదిలీ చేయడాన్ని ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన లోక్ సభ ఎన్నికలకు పోటీ చేసి రాష్ట్ర రాజకీయాలకు దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. నిన్న మాణెక్ షా పరేడ్ వేడుకలలో కుమారస్వామి, సిద్ధరామయ్య ఒకే కార్యక్రమంలో పాల్గొన్నా ఒకరి తర్వాత ఒకరు వచ్చి వెళ్లడం చర్చనీయాంశమైంది. సిద్ధరామయ్య అక్కడినుంచి వెళ్లేంత వరకూ కుమారస్వామి కారులోనే కూర్చుని ఉండటం వీరిమధ్య ఉన్న విభేదాలను బయటపెడుతోంది. మొత్తం మీద సిద్ధరామయ్య రాష్ట్ర రాజకీయాల్లో ఇక తన జోక్యం ఉండబోదని సన్నిహితుల వద్ద చెప్పేశారన్నది టాక్.

No comments:
Write comments