డోలాయామానంలో టీడీపీ

 

విజయవాడ, ఆగస్టు 13  (globelmedianews.com)
ప్ర‌స్తుతం టీడీపీ ప‌రిస్థితి డోలాయామానంలో ఉంది. టీడీపీ వెళ్లి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నా.. కాంగ్రెస్ వ‌చ్చి టీడీపీతో పొత్తు పెట్టుకున్నా టీడీపీకే న‌ష్ట‌మంటున్నారు విశ్లేష‌కులు. ఏపీలో ప్ర‌స్తుతం పొత్తుల‌పై పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. మ‌రీ ముఖ్యంగా కాంగ్రెస్ వ్య‌తిరేక పునాదుల‌పై నిర్మించిన టీడీపీ.. మ‌ళ్లీ రాజ‌కీయ అవ‌స‌రాల దృష్ట్యా కాంగ్రెస్‌తోనే జ‌ట్టు క‌డుతుంద‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య ఎన్నో ఏళ్లుగా ఉన్న వైరం తొల‌గి.. స్నేహ హ‌స్తం చిగురించిందని తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాలే స్ప‌ష్టంచేస్తున్నాయి. మ‌రి టీడీపీ-కాంగ్రెస్ పొత్తు కుదిరితే ఎవ‌రికి లాభం? ఎవ‌రికి న‌ష్టం? అనే ప్ర‌శ్న స‌హ‌జంగానే వినిపించ‌క‌మాన‌దు. ప్ర‌స్తుత రాజ‌కీయ పరిణామాల నేప‌థ్యంలో.. అటు తెలంగాణ‌లో, ఇటు ఏపీలో పొత్తు కాంగ్రెస్‌కే కొంత మేర లాభిస్తుందంటున్నారు విశ్లేష‌కులు.రాజ‌కీయం శ‌త్రువుల‌ను కూడా మిత్రులుగా చేస్తుంద‌నేందుకు టీడీపీ-కాంగ్రెస్ మ‌ధ్య జ‌రుగుతున్న వ్య‌వ‌హారాలే నిద‌ర్శ‌నం. బ‌ద్ధ శ‌త్రువులు కూడా త‌మ కామ‌న్‌ శ‌త్రువును ఓడించేందుకు చేతులు క‌లుపుతార‌నేందుకు ఇంత‌కంటే ఉదాహ‌ర‌ణ‌లు క‌నిపించవు. 
 
 
 
డోలాయామానంలో టీడీపీ 
 
లేదు లేదంటూనే వ‌డివ‌డిగా ఇరు పార్టీల మ‌ధ్య ఉన్న అడ్డుగోడ‌పై ఉన్న ఒక్కొక్క ఇటుకను తొల‌గించేస్తున్నారు టీడీపీ, కాంగ్రెస్ నాయ‌కులు. ఈ రెండు పార్టీలూ అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ పొత్తు పెట్టుకోవచ్చ‌న్న చ‌ర్చ‌లు జోరుగా న‌డుస్తున్నాయి. ఇందుకు సంబంధించి లోలోన ఆసక్తిదాయకమైన పరిణామాలు సంభవిస్తున్నాయని సమాచారం. ఒంటరిగా ఎన్నికలకు వెళ్లడం చంద్రబాబు చరిత్రలో లేదు. ఈ నేపథ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణాన్ని గ‌మ‌నించిన ఆయ‌న ఈసారి కాంగ్రెస్ మీదే ఆధారపడ‌వ‌చ్చ‌న్న‌ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఒక వేళ పొత్తు కుదిరితే ఎలా ఉంటుంద‌న్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తక్కువ సీట్లను తీసుకోవడానికి, ఏపీలో తెలుగుదేశం పార్టీ మెజారిటీ సీట్లను తీసుకునేలా ఒప్పందం జరిగే ఛాన్సులు ఉన్న‌ట్టు తెలుస్తోంది. తాజాగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక విషయంలోనూ తెలుగుదేశం పార్టీ.. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. దీంతో కాంగ్రెస్, టీడీపీల మధ్యన దూరం మరింత తగ్గినట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో గత ఎన్నికల్లో తెలుగుదేశం గెలిచిన సీట్లను ఆ పార్టీకే కేటాయించేందుకు కాంగ్రెస్ వెనుకాడటం లేదని తెలుస్తోంది. ఇక ఏపీలో ఇప్పటికీ అక్కడ కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నది ఏమీ లేదు.గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన కొంతమంది సీనియర్లు ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది డిపాజిట్లు దక్కించుకున్నారు. అలాంటి వారి సీట్లను తిరిగి కాంగ్రెస్ కు కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ ఓకే చెప్ప‌వ‌చ్చేమో అని కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ.. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాస్తో కూస్తో పోటీ ఇచ్చిన సీట్లను తిరిగి అదే పార్టీకి కేటాయించేందుకు తెలుగుదేశం పార్టీ ఒప్పుకునే ఛాన్సులు కూడా ఉన్నాయి. ఎన్నిక‌ల్లో ప్ర‌తి సీటు కీల‌క‌మే! అంతేగాక ప్ర‌జ‌ల్లో కాంగ్రెస్‌పై ఇంకా పూర్తిస్థాయిలో ద్వేషం పోలేదు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంద‌నే కోపం టీడీపీపై ప‌డొచ్చు. దీనివ‌ల్ల కొన్ని సీట్ల‌లో గండిపడొచ్చు. అదే స‌మ‌యంలో కాంగ్రెస్‌కు ఇచ్చిన సీట్లనూ పోగొట్టుకునే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ కాంగ్రెస్ నెగ్గితే ఆ పార్టీకి మ‌ళ్లీ జ‌వ‌సత్వాలు నిండిన‌ట్టే!!

No comments:
Write comments