ఒక్క ఆర్థికవేత్త అయినా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారా! మాజీ ఆర్థిక మంత్రి, పి.చిదంబరం

 

న్యూఢిల్లీ ఆగష్టు 30 (globelmedianews.com)
పెద్ద నోట్ల రద్దును ప్రపంచవ్యాప్తంగా ఒక్క ఆర్థిక వేత్త కూడా ప్రశంసించలేదని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం అన్నారు. మోదీ సర్కారు 2016లో చేసిన పెద్ద నోట్ల రద్దుపై చిదంబరం విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో జరిగిన నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్ ఇండియా(ఎన్‌ఎస్‌యూఐ)కార్యక్రమంలో మాట్లాడుతూ చిదంబరం ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ప్రపంచంలో ఎక్కడైనా ఒక్క ఆర్థికవేత్త అయినా ముందుకొచ్చి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారా, వారెవరో చూపించండి. ఒక్కరు కూడా లేరు. ప్రధాని పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన రోజు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ కేరళలో ఉన్నారు. దిల్లీలో లేరు. కనీసం ఆయనను కూడా సంప్రదించలేదు. పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్లు ఆయనకు కూడా తెలియదు. సీఈఏకే తెలియకపోతే.. ఎలాంటి ఆర్థిక వ్యవస్థ ఇది?’ అంటూ విమర్శలు చేశారు.2016 నవంబరు 8న ప్రధాని నరేంద్ర మోదీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నల్ల డబ్బును, అవినీతిని అరికట్టేందుకు నోట్ల రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులకు, ఇతర అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారికి నల్ల డబ్బు చేరకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే నోట్ల రద్దును అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు విపరీతంగా విమర్శించాయి. ఇటీవల భారత రిజర్వు బ్యాంకు చేసిన సర్వేలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై అధికంగా పడినట్లు వెల్లడైందని తెలిపింది. వీటితో పాటు చిదంబరం.. ఆయుష్మాన్‌ భారత్‌ పథకంపైనా విమర్శలు చేశారు. ఇన్స్యూరెన్స్‌ మోడల్‌ పథకాలు విజయం సాధించవని, అమెరికా సహా ప్రపంచ దేశాల్లో ఎక్కడా ఇలాంటి పథకాలు పనిచేయలేదని ఆయన పేర్కొన్నారు.
 
 
 
ఒక్క ఆర్థికవేత్త అయినా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారా!
              మాజీ ఆర్థిక మంత్రి, పి.చిదంబరం
 

No comments:
Write comments