ఇప్పుడు ఉద్యోగాలన్నీ లోకల్

 

వరంగల్, ఆగస్టు 29, (globelmedianews.com)
తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన విధానాన్నిరూపొందించి ‘మన రాష్ట్ర, మన ఉద్యోగాలు మనకే’ అనే ప్రాతిపదికన నూతన జోనల్ వ్యవస్థకు ఊపిరిపోసింది. రాష్ట్రపతి ఆమోదంతో త్వరలో 371డి ఉత్తర్వులకు సవరణ జరగడంతో రాష్ట్రంలో ఇకపైన జరిగే నియామకాలన్నింటికీ స్థానికులకు 95% అవకాశాలు లభించనుండడం రాష్ట్ర నిరుద్యోగ యువతకు కొత్త ఆశల్ని రేకెత్తించినట్లయింది. తెలంగాణ నిరుద్యోగ యువత ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త జోనల్ వ్యవస్థ రూపంలో ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రాష్ట్రానికి చెందిన నిరుద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా, గతంలో జరిగిన అన్యాయం పునరావృతం అయ్యే అవకాశం లేకుండా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థలను ఈ నూతన విధానంలో ప్రభుత్వం ప్రతిపాదించింది.  
 
 
 
ఇప్పుడు ఉద్యోగాలన్నీ లోకల్
 
రాష్ట్రంలో వివిధ నియామక ఏజెన్సీల ద్వారా వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్, గురుకుల నియామక బోర్డు, సింగరేణి, విద్యుత్ సంస్థల ద్వారా ఇప్పటికే వేలల్లో ఉద్యోగాల నియామకాలు చేపట్టగా, త్వరలోనే మెగా నోటిఫికేషన్లు విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. టిఎస్‌పిఎస్‌సి ద్వారా 40,921 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలుపగా, 36,286(128 గ్రూప్1 పోస్టులు కలిపి) పోస్టులకు టిఎస్‌పిఎస్‌సి ఇప్పటికే 100 నోటిఫికేషన్లు విడుదల చేసి, ఆగస్టు 15 నాటికి 13,420 ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేసింది. మిగతా పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. 19,689 పోస్టులకు సంబంధించిన ఫలితాలు వెలువడాల్సి ఉండగా, 3,177 పోస్టులకు సంబంధించిన పరీక్షల నిర్వహణకు టిఎస్‌పిఎస్‌సి ఏర్పాట్లు చేస్తోంది. అలాగే వివిధ శాఖల నుంచి ఇండెంట్ లభించిన వెంటనే 1,835 పోస్టులకు నోటిఫికేన్లు జారీ చేసేందుకు టిఎస్‌పిఎస్‌సి సన్నాహాలు చేస్తోంది. అలాగే పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా ఇప్పటివరకు 532 ఎస్.ఐ ఉద్యోగాలు, 10,432 కానిస్టేబుల్ ఉద్యోగాలు మొత్తం 10,964 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ ప్రక్రియ పూర్తి కాగా, 18,428 పోస్టులకు సంబంధించిన భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. గురుకుల నియామక బోర్డు ఇప్పటికే 2,932 టీచర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, పంపిణీ సంస్థల్లో 12 వేల ఉద్యోగాలు ఇప్పటికే భర్తీ అయ్యాయి. వీటితోపాటు సింగరేణిలో 7,500 పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయ్యింది.కొత్త జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి ఆమోదం తెలిపిన వెంటనే రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నియామకాలకు రంగం సిద్దమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు శాఖలవారీగా ఖాళీల వివరాలను సేకరించి, ఆయా శాఖల ముఖ్యకార్యదర్శులతో నియామకాల విధివిధానాలపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. 9,355 పంచాయతీ కార్యదర్శుల నియామకాన్ని ఈ విధానం కోసమే తాత్కాలికంగా పెండింగ్‌లో ఉంచినట్లు అధికారులు అభిప్రాయపడ్డారు. కొత్త జోనల్ వ్యవస్థ అమలులోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులు దీర్ఘకాలికంగా ఎదురుచూస్తున్న గ్రూప్1 నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. కొత్త జోనల్ వ్యవస్థతో ఇప్పటివరకు కొనసాగిన అసమానతలకు తెరపడనుంది. అన్ని స్థాయిల్లోని ఉద్యోగాల భర్తీలో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయి. ఈ విధానంతో మారుమూల ప్రాంతాల నిరుద్యోగ అభ్యర్థులకు లబ్ది చేకూరనుంది. 31 జిల్లాలవారీగా నియామకాలు చేపట్టనున్న నేపథ్యంలో ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతం నిరుద్యోగులతోనే పోటీ పడతారు. దాంతో గ్రామీణ యువత పట్టణాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులతో పోటీ పడాల్సిన అవసరం ఉండదు. ఈ విధానంతో ప్రాంతాల మధ్య అసమానతలు తొలగిపోనున్నాయి. కొత్తగా జరుగనున్న నియామకాలలో అన్ని ప్రాంతాల వారికీ సమాన అవకాశాలు లభించనున్నాయి.

No comments:
Write comments