వేతన బాసట..

 

ఆదిలాబాద్, సెప్టెంబర్ 04, 2018 (globelmedianews.com)
ప్రజాసంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోంది తెలంగాణ సర్కార్. నాలుగేళ్లుగా ప్రజాభ్యున్నతే లక్ష్యంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. ఇక తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశా కార్యకర్తలు, గోపాల మిత్రలు, అర్చకులకు బాసటగా కీలక నిర్ణయం తీసుకున్నారు. వీరి వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆదిలాబాద్ పరిధిలోని ఆశా కార్యకర్తలు, గోపాల మిత్రలు, అర్చకులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవానికి గ్రామాల్లో ఆరోగ్యపరమైన సేవలు అందించే ఆశా కార్యకర్తలు వేతనాలు పెంచాలని చాలాకాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో నిరసనలకు దిగడంతో వీరి వేతనాలు పెంచారు. అయితే పెంచిన వేతనం ప్రస్తుత పరిస్థితులకు ఏమాత్రం సరిపోవడంలేదని ఆశాలు వాపోతున్నారు. ఈనేపథ్యంలో జీతాల పెంపు డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. వీరి గోడుపై దృష్టి సారించిన ప్రభుత్వం జీతాలు పెంచింది. ఆశా కార్యకర్తల వేతనం రూ.6 వేల నుంచి రూ.7,500 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల జిల్లాలో దాదాపు వెయ్యి మంది ఆశాలకు ప్రయోజనం చేకూరనుంది. ఇక గోపాలమిత్రలకూ అండగా నిలబడింది సర్కార్.గ్రామాల్లో మూగజీవాలకు వైద్యం అందించే గోపాలమిత్రల వేతనం రూ.3500 నుంచి రూ.8500కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో గోపాలమిత్రలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. గోపాలమిత్రలు చాలీచాలనీ వేతనాలతో ఏళ్లుగా నెట్టుకొస్తున్నారు. తాజాగా జీతాలు పెంచడంతో వారంతా ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తున్నారు.
 
 
 
వేతన బాసట..
 
అర్చకుల వేతనాలు సైతం పెంచిన ప్రభుత్వం వారి పదవీ విరమణ వయసునూ పెంచింది. ప్రభుత్వ పరంగా వేతనాలు చెల్లించి వారు ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా చర్యలు తీసుకుంది. వారి పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచడంతో జిల్లాలోని 100మంది పైగా అర్చకులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకుముందు వరకూ అర్చకుల పదవీ విరమణ వయసు 55 సంవత్సరాలుగా ఉండేది. పదవీకాలం మరో పదేళ్లు పెరగడంతో వారంతా ఆనందంలో మునిగిపోయారు. మరోవైపు  బీసీలకు ఇప్పటివరకు ప్రభుత్వాలు భవనాలు కేటాయించలేదు. ఈ విషయంలో ప్రతి ప్రభుత్వానికి భవనాల నిర్మాణానికి సంఘనేతలు నివేదిస్తూ వస్తున్నారు. దీంతో బీసీల ఆత్మగౌరవ భవనాల కోసం 71 ఎకరాల స్థలం కేటాయించడమే కాకుండా భవనాల నిర్మాణానికి రూ.77 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వారూ సర్కార్‌కు కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇదిలాఉంటే సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రెండో ఏఎన్‌ఎంల వేతనాలు రూ. 11 వేల నుంచి ఏకంగా రూ.21 వేలకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో పనిచేసే 200 మంది రెండో ఏఎన్‌ఎంలకు ప్రయోజనం చేకూరనుంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాల పెంపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం చాలాచోట్ల వీరికి సరిపడా వేతనాలు ఇవ్వడం లేదు. తాజా నిర్ణయంతో వారికి లబ్ధి చేకూరనుంది. మొత్తంగా ప్రజాసంక్షేమార్ధం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో జిల్లాలోని వేలాది మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

No comments:
Write comments