పర్మినెంట్ ఉద్యోగులేరీ..? (గుంటూరు)

 

గుంటూరు, ఫిబ్రవరి 14 (globelmedianews.com): 
గుంటూరులో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల ప్రారంభించి ఐదేళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు శాశ్వత ఉద్యోగులను నియమించలేదు. గుంటూరు సర్వజనాసుపత్రిలో  తాత్కాలికంగా కేటాయించిన భవనంలోనే కళాశాల నడుపుతున్నారు. అనుభవం ఉన్న ముగ్గురు బోధనా నిపుణులను ఇతర కళాశాలల నుంచి తాత్కాలికంగా ఇక్కడికి సర్దుబాటు చేశారు. స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్న 20 మందిని డిప్యుటేషన్‌పై నియమించారు. ఈ కళాశాలకు ఒక్కరిని కూడా శాశ్వత విధానంలో నియమించలేదు. బోధనారంగమే గాకుండా బోధనేతర సిబ్బందినీ మంజూరు చేయలేదు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 


పర్మినెంట్ ఉద్యోగులేరీ..? (గుంటూరు)

కళాశాల ప్రారంభంలో ప్రభుత్వంలో కనిపించే ఉత్సాహం తరువాత ఉండటంలేదు. ప్రభుత్వం ఇటీవల పలు కళాశాలలకు కొత్త పోస్టులు మంజూరు చేసింది. అదేవిధంగా భారత నర్సింగ్‌ మండలి నిబంధనలు అనుసరించి అవసరమైన మేరకు పోస్టులను తక్షణమే మంజూరు చేయాల్సి ఉన్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.
భారత నర్సింగ్‌ మండలి నిబంధనల మేరకు అధ్యాపకులు, సహాయ ఆచార్యులు, ఆచార్యులు, ప్రధానాచార్యులు మొత్తం 25 మంది బోధనా నిపుణులు ఉండాలి. వీరంతా ఉంటేనే కళాశాలకు గుర్తింపు ఇస్తారు. తనిఖీకి వచ్చిన సమయంలో స్టాఫ్‌నర్సులనే అధ్యాపకులుగా చూపిస్తూ అనుమతి పొందుతుండటం గమనార్హం. దీంతో వాస్తవాలు వెలుగులోకి రావటంలేదు. ప్రభుత్వమే ఈ విధంగా చేస్తుండటంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గుంటూరు జిల్లాలో ప్రభుత్వ కళాశాల ఇదొక్కటే మంజూరైంది. దీనివల్ల ప్రతిభ గల విద్యార్థులకు ఎంతో మేలు జరిగింది. గత ఐదేళ్ల నుంచి తాత్కాలిక సిబ్బందినే బోధకులుగా చూపిస్తూ గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు పొందుతున్నారు. దీనినే ఏటా కొనసాగిస్తుండటం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.
ప్రభుత్వాసుపత్రుల్లో స్టాఫ్‌నర్సులుగా పనిచేస్తున్న 20 మందిని నర్సింగ్‌ కళాశాలకు తాత్కాలికంగా బదిలీ చేయడంతో అక్కడ రోగులకు సేవలందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీరికి ఎంఎస్సీ నర్సింగ్‌ అర్హతతో పాటు ఎంతో అనుభవం ఉంటుంది. దీనివల్ల రోగి ఆరోగ్య సంరక్షణ బాధ్యతల్ని శ్రద్ధగా నిర్వర్తిస్తూ, ఔషధాలను క్రమం తప్పకుండా అందిస్తూ రోగిని కోలుకునేలా చేస్తుంటారు. వీరిని కళాశాలలో శాశ్వత ఉద్యోగులుగా తీసుకుంటే వారి స్థానంలో కొత్తవారిని తీసుకునే అవకాశం ఉంటుంది.
గోరంట్లలోని ప్రభుత్వ జ్వరాల వైద్యశాల ప్రాంగణంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి. దీనిని త్వరలోనే ముఖ్యమంత్రితో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా కళాశాల ప్రాంగణంలో వసతి గృహాన్ని కూడా నిర్మించారు. దీన్ని నిర్మించేందుకు రూ.18 కోట్లు ఖర్చు చేశారు. ఈ కళాశాలలో ప్రవేశానికి ప్రతిభ ఆధారంగా ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏడాదికి 50 మంది విద్యార్థులను కేటాయిస్తున్నారు.  ఇప్పటికే రెండు బ్యాచ్‌ల విద్యార్థులు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లారు. వారందరికీ నూటికి నూరుశాతం ఉద్యోగ అవకాశాలు లభించడం గమనార్హం.

No comments:
Write comments