ఆయుష్ లేదు. (తూర్పుగోదావరి)

 

కాకినాడ, ఫిబ్రవరి 14 (globelmedianews.com): ల్లాలోని ఆయుష్ ఆస్పత్రులు అసలు అందుబాటులో ఉండటం లేదు.  ప్రజలకు సాంప్రదాయ వైద్యం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయుష్‌ అనే విభాగాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే ఆయుర్వేదం, యునాని, సిద్ధ, హోమియోపతి ఆసుపత్రి విభాగాలను ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఒక వైద్యుడు, ఇద్దరు సహాయకులను నియమించారు. జిల్లాలోని 43 పీహెచ్‌సీల్లో ఒక్కో చోట ఒకటి ఉండేలా చర్యలు తీసుకున్నారు. జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) ద్వారా వీటి కార్యకలాపాలు ఉండేలా నిబంధనలు రూపొందించారు.


ఆయుష్ లేదు. (తూర్పుగోదావరి)

 2008 ఆగస్టు 30న వీటిని జిల్లాలో ప్రారంభించారు. వైద్య విధానంలో అత్యంత చౌకగా దొరికే ఆయుష్‌ విభాగాల మందులు గ్రామీణ ప్రాంతాల రోగులను బాగా ఆకట్టుకున్నాయి. దశాబ్ద కాలం గడచినా నేటికీ బాలారిష్టాలతో సంప్రదాయ వైద్య విభాగం సతమతమవుతోంది. చాలా చోట్ల ఈ విభాగాలు దాదాపు మూతపడ్డాయి.
ఈ విభాగాలు ప్రజలందరికీ బాగా చేరువయ్యాయి. రెండేళ్ల పాటు బాగానే జరిగాయి. తరువాత వైద్యులు పీజీ చదువులకు వెళ్లిపోవడం, సరిగా వేతనాలు చెల్లించకపోవడం, గ్రామీణ ప్రాంతాల్లోనే ఉండాల్సి వస్తుండటంతో నెమ్మదిగా ఒక్కొక్కరు తప్పుకున్నారు. వైద్యులు రాకపోయినా సిబ్బందికి అలవాటు ప్రకారం రోగులకు మందులిచ్చేవారు. అలా చేస్తున్నా వీరికి వేతనాలు అందేవి కావు. నెలలు దాటి ఏళ్లు గడుస్తున్నా వీరికి వేతనాలు అందడం మానేశాయి. దీంతో పాటు మందుల సరఫరా ఆగిపోయింది. అలా ఒక్కొక్కటిగా మూతపడడం మొదలయ్యాయి. ఇలా ఈ సేవలు జిల్లాలో 2016 మే నెల నుంచి ఆగిపోయాయి. అల్లోపతి వైద్యంలోనూ నయం కాని దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోయింది. ఆయుష్‌ విభాగం కిందనే ప్రత్యేకించి కొన్ని హోమియో, ఆయుర్వేద వైద్యాలయాలున్నాయి. అక్కడ కూడా వైద్యులను నియమించకపోవడంతో వాటికి తాళం వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆయుష్‌ విభాగంలో వైద్యులు చాలా చోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే ఆసుపత్రులకు బదిలీ అయ్యారు. ఇక్కడ కొత్తగా వైద్యుల్ని నియమించ లేదు. కింది స్థాయి సిబ్బంది వైద్యం చేస్తున్నా రోజుకు 25 నుంచి 40 మంది వరకు ఆయా ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే వారు. ఎన్‌హెచ్‌ఆర్‌ఎం వారు ప్రతి విభాగానికి రూ.26 వేల విలువైన మందులు పంపేవారు. రాష్ట్ర విభజన ఆయుష్‌ విభాగాన్ని దెబ్బతీసింది. ఈ ఆసుపత్రులకు వచ్చే మందులన్నీ ఎక్కువ భాగం తెలంగాణ రాష్ట్రం నుంచే వచ్చేవి. ఈ పరిశ్రమలు అక్కడే ఎక్కువగా ఉన్నాయి. విభజనలో అవి అక్కడే ఉండిపోయాయి. నవ్యాంధ్రకు రాలేదు. ప్రభుత్వమే అక్కడి నంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ తెప్పించి మందులిచ్చేది. వాటిలో కొన్ని పనిచేసేవి, కొన్ని పనిచేయనవి ఉండేవి. కొన్ని మందులు ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఉండేవి కావు. కావాల్సినవి అరకొరగా వచ్చినా మందుల్లేక సిబ్బంది వాటిని వెనక్కి పంపించేవారు. ఇలా క్రమంగా వైద్యులు, మందుల్లేని ఆసుపత్రికి ఎందుకు వెళ్లాలని రోగులు రావడం మానేశారు. దీంతో ఇవి ప్రాభవాన్ని కోల్పోయాయి. నడవడం లేని ఇలాంటి ఆసుపత్రులను మూసేయాలని అప్పటి ఆ శాఖ సంచాలకుడు కేంద్ర ప్రభుత్వానికి 2016లో లేఖ రాశారు. అలా అర్థాంతరంగా వీటి సేవలు నిలిచిపోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో సిబ్బంది వేరే చోటికి వెళ్లిపోయారు. చేసిన వాటికి వేతనాలు రాక రోడ్డున పడ్డారు.
ఆయుర్వేద, హోమియో ఆసుపత్రులు జిల్లాలో ఆయుష్‌ విభాగం రానప్పటి నుంచి పేరొందాయి. ఇలాంటి చోట్ల వైద్యుల కొరత ఉంది. ఉదాహరణకు కోటిపల్లి హోమియో ఆసుపత్రికి మూడు దశాబ్దాలుగా మంచి గుర్తింపు పొందింది. ప్రముఖ వైద్యులు ఇక్కడ పనిచేశారు. దీంతో పరిసర గ్రామాల నుంచి ఎంతో మంది రోగులు వస్తుండేవారు. ఇలాంటి ఆసుపత్రికి వైద్యుడ్ని నియమించలేదు. జనవరి నెలలో ఇక్కడ పనిచేసే వైద్యుడు బదిలీ అయిపోయారు. ఇప్పటి వరకూ కొత్తవారిని నియమించలేదు. దీంతో ఆసుపత్రికి తాళం పడింది. ఇలా 19 ఆసుపత్రులకు వైద్యులే లేరు. ఆ ఖాళీలు ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదని ఆ విభాగం ఉన్నతాధికారులు సైతం అంగీకరిస్తున్నారు.

No comments:
Write comments