దళారులకే భోజ్యంగా మారుతున్న ఈ నామ్

 

కరీంనగర్, ఫిబ్రవరి 12, (globelmedianews.com)
రైతుకు కనీస మద్దతు ధర దక్కేలా, వ్యాపారుల జీరో దందాకు బ్రేకులు వేసేలా తీసుకొచ్చినఈ-నామ్‌ పద్ధతి అమలు కావడం లేదు. మార్కెట్లలో ఇప్పటికీ వ్యాపారుల సిండికేటే నడుస్తోంది. అధికారులూ పట్టించుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో దళారులు కుమ్మక్కై పత్తి రైతును నిలువునా ముంచుతూ ధరలను అడ్డగోలుగా తగ్గిస్తున్నారు. ఇతర మార్కెట్లలో క్వింటా పత్తికి రూ.5వేలపైనే పలుకుతుంటే ఇక్కడ మాత్రం రూ.4వేలకు మించడం లేదు. సీసీఐ క్వింటాల్‌ పత్తి కూడా కొనలేదు.పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, సుల్తానాబాద్‌ మార్కెట్‌ యార్డుల్లో అక్టోబర్‌ నుంచే పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వాటికి తోడు జిల్లాలో ఆరు జిన్నింగ్‌ మిల్లులుండగా 8 మంది ట్రేడర్లు, దళారులు పత్తి కొంటున్నారు.


 దళారులకే భోజ్యంగా మారుతున్న ఈ నామ్
 
ఇప్పటి వరకు 13వేల 449 మంది రైతుల నుంచి 54వేల 37 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేశారు. అయితే, వ్యాపారులంతా కుమ్మక్కై తేమ పేరుతో అమాంతరం ధరలు తగ్గించారు. కేంద్రం ఈసారి పత్తికి మద్దతు ధర పెంచిన నేపథ్యంలో బ్రహ్మరకం పత్తికి 8శాతం తేమ ఉంటే క్వింటాకు రూ.5వేల 450, మేక్‌ రకం పత్తికి రూ.5వేల 350 ధర ప్రకటించింది. కేంద్రం ప్రకటించిన ధరకు ఏనాడూ దళారులు పత్తి కొనలేదు. కాగా తేమ 18 నుంచి 20శాతం ఉంటుందంటూ ధరలను తెగ్గోస్తున్నారు. ఈనెల 7న ఒక్క రోజునే పెద్దపల్లి మార్కెట్‌లోకి 350 మంది రైతులు 1346బస్తాల్లో 1500క్వింటాళ్ల పత్తి తీసుకొచ్చారు. దీనికి తేమ పేరుతో గరిష్టంగా రూ.4800, కనిష్టంగా రూ.4వేలే ధర నిర్ణయించారు. ఇదే సమయంలో పక్కనే ఉన్న వరంగల్‌ మార్కెట్‌లో రూ.5,150 నుంచి రూ.5900 చెల్లించారు. మరో అతిపెద్ద మార్కెట్‌ జమ్మికుంటలోనూ ఇదే ధర ఇస్తున్నారు. పెద్దపల్లిలో మాత్రం ఏకంగా రూ.వెయ్యి నుంచి రూ.1500తగ్గించారు. పత్తి కొనుగోలు చేసేందుకు 8మంది ట్రేడర్లు ఈ-నామ్‌లో ధర నిర్ణయానికి ఆన్‌లైన్‌ చేసుకుంటున్నారు. అయితే వారంతా ఇప్పటికే కుమ్మక్కై తక్కువ ధరకు కోట్‌ చేస్తూ అదే రేటును ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఫలితంగా ఈ 'ఈ-నామ్‌' రైతులకు అమలు కావడం లేదు. మరోవైపు సీసీఐ అధికారులు ఇంతవరకు ఒక్క క్వింటాల్‌ కూడా పత్తి కొనకపోవడం గమనార్హం. అయితే, సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఆరు జిన్నింగ్‌ మిల్లుల్లో రైతుల నుంచి 23వేల 844క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్టు చెబుతున్నారు. అదంతా సీసీఐ నిబంధనలకు విరుద్ధంగా మిల్లు నిర్వాహకులు రైతుల నుంచి కొనుగోలు చేసిన లూజు పత్తినే కావడం గమనార్హం.

No comments:
Write comments